ప్రేక్షకుల్లేకుండా ఆడటం కష్టమే.. కానీ తప్పదు : కోహ్లీ

by Shyam |
ప్రేక్షకుల్లేకుండా ఆడటం కష్టమే.. కానీ తప్పదు : కోహ్లీ
X

దిశ, స్పోర్ట్స్ :

కరోనా వైరస్ ప్రభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడారంగం స్తంభించిపోయింది. ఇటీవల ఒకటి, రెండు క్రికెట్ మ్యాచ్‌లు జరిగినా ప్రేక్షకుల్లేకుండానే ఆడించారు. ఐపీఎల్ సీజన్-13ను సైతం ఇదే తరహాలో నిర్వహించాలనే సూచనలు వినిపించినా.. బీసీసీఐ దాన్ని తోసిపుచ్చింది. కాగా, లాక్‌డౌన్ అనంతరం మ్యాచ్‌లు నిర్వహించాలంటే ప్రేక్షకుల్లేకుండా అయితేనే సాధ్యమని పలు క్రికెట్ బోర్డులు చెబుతున్నాయి. దీనికి ఇంగ్లాండ్ ఆటగాడు బెన్‌స్టోక్స్ కూడా మద్దతు పలికాడు. తాజాగా ఈ విషయంపై టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ.. ‘ఖాళీ స్టేడియాల్లో క్రికెట్ ఆడటం చాలా కష్టమని చెప్పాడు. స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారమవుతోన్న ‘క్రికెట్ కనెక్టెడ్’ షోలో మాట్లాడుతూ.. ప్రేక్షకులున్న స్టేడియంలో ఆడటానికి, ఖాళీ స్టేడియాల్లో ఆడటానికి చాలా వ్యత్యాసం ఉంటుందన్నాడు. ప్రేక్షకుల్లేకుండా ఆటను ఆస్వాదించలేమని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకుల ఆరోగ్యాలను పణంగా పెట్టలేమని వెల్లడించాడు.

క్రికెట్ ఆటను బతికించాలంటే ముందుగా ఖాళీ స్టేడియాల్లో ఆడాల్సి ఉంటుందని కోహ్లీ అన్నాడు. ప్రేక్షకుల సమక్షంలో ఆడుతుంటే ఒక లాంటి భావోద్వేగం ఉంటుందని.. అవన్నీ కోల్పోయి ఆడటమంటే నిస్సారంగానే అనిపిస్తుందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. కాగా, కొవిడ్-19 వైరస్ కారణంగా అన్ని ఫార్మాట్ల క్రికెట్ మ్యాచ్‌లు రద్దు కావడానికి ముందే సిడ్నీ స్టేడియంలో ప్రేక్షకుల్లేకుండానే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు వన్డే మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే.

Tags: Cricket, Australia, Team India, Stadiums, Spectators, Empty Stadium, Virat Kohli, Star Sports

Advertisement

Next Story

Most Viewed