కేసీఆర్ ఏడేళ్ల పాలనపై కోదండరాం మనసులో మాట

by Anukaran |   ( Updated:2021-06-01 09:41:42.0  )
Professor Kodandaram
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేసీఆర్ చెప్పినట్టు రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ధనిక రాష్ట్రమేనని, అడ్డాగోలు పాలనతో ఏడేండ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా ‘దిశ’తో కోదండరాం మాట్లాడారు.

భౌగోళిక తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజాస్వామిక తెలంగాణ కోసం పనిచేయాలని ఉద్యమ సమయంలో ప్రణాళికలు చేసుకున్నామని, కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో మాట్లాడే హక్కు కూడా లేకుండా చేశారని తెలిపారు. ప్రశ్నించిన వారందరిని రాష్ట్ర అభివృద్ధి నిరోధకులంటూ విష ప్రచారం చేయడం ద్వారా కేసీఆర్ కాలం గడుపుతూ వచ్చారన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఎక్కువ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరిగేవని, స్వరాష్ట్రంలో ధర్నా చౌక్ కూడా ఎత్తివేశారంటూ గుర్తు చేశారు. స్వరాష్ట్ర ఉద్యమం కోసం కొట్లాడిన వారిపై ఇప్పటికీ కేసులు కొట్టివేయని ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

కేసీఆర్ కుటుంబ పాలన కంటే ఆంధ్రా పాలకులే నయమనే భావన సాధారణ ప్రజల్లో కూడా వచ్చేసిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ప్రొఫెసర్ జయశంకర్ రూపొందించిన డాక్యూమెంటరీని పరిశీలించిన శ్రీకృష్టా కమిటీ కూడా తెలంగాణ ధనిక రాష్ట్రమేనని, విడదీస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటో కూడా ఆర్థిక నివేదిక సమర్పించాలని జయశంకర్ ను కోరిందని ఆనాటి విషయాలను ఆయన వివరించారు. 2014 నాటికి తెలంగాణ అప్పు కేవలం రూ.60 వేల కోట్లు ఉంటే, గడిచిన ఈ ఏడేండ్లలోనే అందుకు నాలుగు రెట్లు అంటే కొత్తగా రూ. రెండున్నర లక్షల కోట్లు కేసీఆర్ ప్రభుత్వం చేసిందంటే రాష్ట్రాన్ని ఎంత లోతు అప్పుల్లోకి ముంచారో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరముందన్నారు.

ఉత్పాదక రంగాల్లో పెట్టుబడుల కోసం అప్పులు చేయడం ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో కాంట్రాక్టర్ల జేబులు నింపడం, తమ వాటాల కోసం అప్పులు చేశారన్నది ఈ ఏడేండ్ల పాలన చూస్తే నిరూపితమవుతోందని కోదండరాం స్పష్టం చేశారు. ప్రాజెక్టుల డిజైన్లలో సైతం ఆ రంగ నిపుణుల కమిటీలు, నివేదికలు ఉండకుండా అడ్డాగోలుగా తమ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడంతో అక్కడ కూడా ప్రభుత్వం ఫెయిలయిందన్నారు.

చివరకు ప్రభుత్వ నిర్వాహణ కోసం అప్పులు చేయడాన్ని చూస్తే రాష్ట్రాన్ని ఏ విధంగా దివాళ తీయిస్తున్నారో తేలిపోతుందన్నారు. ‘ విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వ బాధ్యతలను తగ్గించుకుంది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్లోనూ కోత విధిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం తప్పిదాలను సరిదిద్దేందుకు కనీసం లోకాయుక్త కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలకు సమస్యలను చెబితే కేసీఆర్ మాట్లాడాలి తప్ప వారికే తెలియదు. చివరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా ఎంత కింది స్థాయికి తగ్గించారో తాజా పరిణమాలు చెబుతున్నాయ’న్నారు.

యూనివర్సిటీలకు వీసీల నియామకం, టీఎస్పీఎస్సీ బోర్డు నియామకం కూడా కోర్టులు జోక్యం చేసుకుంటే తప్ప చలనం లేదు. కొవిడ్ కష్ట సమయంలో ప్రజలను కాపాడుకునందుకు ప్రభుత్వం కనీస రచన లేదన్నది ఇప్పటికే స్పష్టమైందన్న కోదండరామ్ లాక్ డౌన్ లో దెబ్బతిన్న రాష్ట్రాన్ని కోలుకునేలా చేసేందుకు పునరుద్ధరణ ప్రణాళికలను కేసీఆర్ ప్రభుత్వం చేయలేదన్నారు.

Advertisement

Next Story