భారత్‌లో తగ్గిన నివాస గృహాల ధరలు

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 (Kovid-19) కారణంగా ఎక్కువగా నష్టాలను ఎదుర్కొన్న రంగాల్లో రియల్టీ (Realty) ముందుంది. ఆర్థికపరమైన లావాదేవీలు నిలిచిపోవడంతో రియల్టీ రంగంలో నివాస గృహల కొనుగోళ్లు పడిపోయాయి. ఈ క్రమంలోనే నైట్ ఫ్రాంక్ (Knight Frank) నివేదిక నివాస గృహాల ధరల జాబితాను ప్రకటించింది. ఈ ర్యాంకింగ్‌లో భారత్ ప్రపంచ వ్యాప్తంగా 11 స్థానాలు పడిపోయి 54వ స్థానానికి చేరుకుందని ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ (Knight Frank) నివేదిక వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నివాస గృహాల ధరలు సుమారు 2 శాతం క్షీణించాయని, ఈ జాబితాలో పరిశీలించిన మొత్తం 56 దేశాల్లో భారత్ 54వ స్థానంలో నిలిచిందని నివేదిక పేర్కొంది.

2020 ఏడాది రెండో త్రైమాసికంలో నైట్ ఫ్రాంక్ ‘గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్ రీసెర్చ్’ (Global House Price Index Research)నివేదిక ప్రకారం.. భారత్‌లో ఏడాది ప్రాతిపదికన నివాస గృహాల ధరలు జూన్ నాటికి 1.9 శాతం తగ్గాయి. బలహీనమైన పనితీరుతో 2.8 శాతం ధరలు తగ్గి హాంకాంగ్ ఈ ర్యాంకింగ్ జాబితాలో చివరి స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. అధికారిక గణాంకాలను ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా 56 దేశాల్లో నివాస గృహాల ధరల్లో మార్పులను నైట్ ఫ్రాంక్ ట్రాక్ చేసింది. గృహాల ధరల్లో 25.7 శాతం పెరుగుదలతో టర్కీ మొదటిస్థానంలో ఉండగా, లక్జెంబర్గ్ 13.9 శాతంతో రెండో స్థానంలోనూ ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా యూరోపియన్ దేశాలు ఈ త్రైమాసికంలో టాప్ 10 జాబితాలో ఎనిమిది స్థానాలను ఆక్రమించాయని నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది.

Advertisement