ఖాదీ బండార్ ఆస్తులు ఖతం.. చక్రం తిప్పిన కోరుట్ల ఎమ్మెల్యే!

by Anukaran |   ( Updated:2021-06-24 07:29:02.0  )
ఖాదీ బండార్ ఆస్తులు ఖతం.. చక్రం తిప్పిన కోరుట్ల ఎమ్మెల్యే!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : స్వాతంత్ర్య సమరానికి స్పూర్తినిచ్చిన ఖాదీ భండార్‌లు స్వరాష్ట్ర కల సాకారమైన తర్వాత కనుమరుగు అయ్యే ప్రమాదంలో నెట్టబడ్డాయి. సొంత రాష్ట్రం ఏర్పడిన తరువాత గత వైభవాన్ని చాటుకుంటామని కలలు కన్నా.. చేతల్లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా సాగుతోంది. ఖాదీ వస్త్రాలను తయారు చేసేందుకు 1943లో ఏర్పడిన ఈ సంస్థను గుట్టు చప్పుడు కాకుండా అమ్మేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడురులోని ఖాదీ భండార్‌కు చెందిన 57 గుంటల స్థలానికి గప్‌చుప్‌గా యజమానులను మార్చేశారు. 78 ఏళ్ల కిందట పూడూరు కేంద్రంగా సాగుతున్న ఖాదీ ఉత్పత్తి వల్ల నాలుగు తరాల వారు ఉపాధి పొందుతూ వస్తున్నారు. పూడురుతో పాటు, రామడుగు, గంగాధర, బోయినపల్లి మండలాలకు చెందిన నేతన్నలు కూడా ఖాదీ గుడ్డను నేస్తూ జీవనం సాగిస్తున్నారు. స్వాతంత్ర్యానంతరం ప్రభుత్వాల శీతకన్ను కారణంగా ఖాదీ పరిశ్రమలు అస్థిత్వం కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. అయినప్పటికీ వారసత్వంగా వచ్చిన తమ కులవృత్తితోనే కాలం వెల్లదీయాలన్న తపనతో పూడురు ఖాదీ కేంద్రం పరిధిలోని నేతన్నలు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికీ 300లకు పైగా కుటుంబాలు ఈ కేంద్రంపై ఉపాధి పొందుతున్నారు. మెట్‌పల్లి ఖాదీ ప్రతిష్టాన్ కన్నా ముందే పూడురులో ఖాదీ ఉత్పత్తి జరిగిందని కార్మికులు చెప్తున్నారు.

12 కోట్ల భూమికి ఎసరు..

ఏకంగా రూ.12 కోట్ల విలువ చేసే ఖాదీ బోర్డు భూములను అడ్డదారిలో తక్కువ ధరకు విక్రయించి చరిత్ర సృష్టించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కేవలం రూ. 1.25 కోట్లకు ఆ స్థలాన్ని దొడ్డిదారిన అమ్ముకున్నారని ప్రధాన ఆరోపణ. బహిరంగ మార్కెట్‌లో అడ్డగోలు ధర పలుకుతున్న ఈ భూమిపై కన్నేసిన కొందరు నాయకులకు ఖాదీ భండార్ ఛైర్మన్ అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఆయన కూడా తనవంతు సహకారం అందించారన్న ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి.

వాస్తవం ఇది..

నిబంధనల ప్రకారం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే సంస్థకు చెందిన ఆస్థులను అమ్ముకునే అధికారం సంబంధిత కమిటీలకు ఉంది. అయితే, కమిటీ తీర్మాణం చేసిన కాపీలను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఖాదీ మరియు గ్రామీణ అభివృద్ధికి చెందిన విభాగానికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. సంస్థకు చెందిన ఆస్థులు అమ్మాలంటే మాత్రం బహిరంగ వేలం ప్రకటన ఇవ్వాల్సి ఉండగా.. అలాంటిదేమీ లేకుండానే పూడురు ఖాదీ భండార్ స్థలాన్ని విక్రయించడం పలు విమర్శలకు దారి తీస్తోంది.

ఇష్టానుసారంగా..

మెట్‌పల్లి ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ ద్వారా పూడురులోని ఆస్తిని అమ్మాలని 10 అక్టోబర్ 2020న జరిగిన సమావేశంలో నిర్ణయించామని, ఇట్టి ఆస్తిని అమ్మేందుకు బోర్డు మెంబర్, సెక్రటరీ అయిన ఇప్పనపల్లి సాంబయ్యకు హక్కులు కల్పిస్తున్నామని ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సబ్ రిజిస్టార్ కార్యాలయానికి లేఖ రాశారు. లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలన్ని సాంబయ్యే చూసుకుంటారని, రిజిస్ట్రేషన్ చేయాలని ఛైర్మన్ కోరారు.

ట్విస్ట్ ఇక్కడే..

ప్రైమ్ లోకేషన్‌లో ఉన్న ఈ ఆస్తిని అమ్మేందుకు ముందస్తుగానే వ్యూహం రచించుకున్నారని స్పష్టం అవుతోంది. అధికార పార్టీ నాయకులం కాబట్టి ఏం చేసినా చెల్లుతుందన్న యోచనతో వ్యవహరించిన తీరే వారి అంతర్గత కోణాన్ని స్పష్టం చేస్తోంది. ఇప్పనపల్లి సాంబయ్యకు ఈ ఏడాది ఏప్రిల్ 2న అధికారాలను కట్టబెడుతూ మెట్‌పల్లి ఖాదీ ప్రతిష్టాన్ ఛైర్మన్ కె విద్యాసాగర్ రావు రిజిస్ట్రేషన్ అధికారులకు లేఖ రాశారు. మరునాడే అంటే 3 ఏప్రిల్ 2021న ఈ భూమి రిజిస్ట్రేషన్ కూడా చేసేశారు. ఆస్తి క్రయవిక్రయ లావాదేవీలను చూసుకునేందుకు హక్కులు కల్పించిన మరునాడే అమ్మకం చేశారంటే, దీని వెనక ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే, రిజిస్ట్రేషన్ అధికారులు కూడా ఈ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయడంలో తమ చాకచక్యాన్ని ప్రదర్శించారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఖాదీ ప్రతిష్టాన్ ఛైర్మన్ లేఖను అనుసరించి రిజిస్ట్రేషన్ చేసినట్టుగా స్పష్టం అవుతున్నప్పటికీ ఇందుకు సంబంధిత శాఖ నిబంధనలు ఏం చెప్తున్నాయి. అందుకు అనుగుణంగానే లావాదేవీలు జరుగుతున్నాయా లేదా అన్న విషయాన్ని అధికారికంగా తెలుసుకోకుండానే రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం.

కెవీఆర్ ఉంటే ఇలా జరిగేదా..?

మెట్‌పల్లి ఖాదీ ప్రతిష్టాన్ ఛైర్మన్‌గా వ్యవహరించిన కెవీ రాజేశ్వర్ రావు బతికుంటే తమ ఆస్తిని అమ్మేవారు కాదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఖాదీ భండార్ ద్వారా కార్మికుల సంక్షేమం కోసం పాటు పడేవారని, ఇలా ఆస్తులను అమ్మేందుకు మాత్రం ఆయన తప్పక అడ్డుపడేవారని అంటున్నారు.

ఉపాధి కొల్లగొట్టే ప్రయత్నం..

మా తాతల కాలం నుండి ఖాదీ వస్త్రాలను నేస్తూ జీవనం సాగిస్తున్నాం. ఆదాయం తక్కువగా వచ్చినా, అనాదిగా వస్తున్న సాంప్రదాయం కాబట్టి ఇదే వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాం. నా కొడుకు చదువుకున్నప్పటికీ ఈ వృత్తిని నేర్పించాను. దివాళ తీస్తున్న విషయాన్ని గమనించైనా ప్రభుత్వం కొత్త పద్దతుల ద్వారా బట్ట నేసేందుకు అవకాశాలు కల్పిస్తే బావుండేది.

-వీరబత్తిని అంజయ్య, నేత కార్మికుడు, పూడురు

మెట్‌పల్లి కంటే ముందే ఇక్కడ సాంచాలు..

తాతాల కాలం నుండి ఇక్కడ ఖాదీ వస్త్రాలను నేస్తున్నాం. మెట్ పల్లిలో సాంచాలు లేకముందే పూడురులో ఉండేవని మా పెద్దవాళ్లు చెప్పేవారు. మెట్‌పల్లిలో ఒక్క ఆఫీసు మాత్రమే ఉండేదని, మా గ్రామంలోనే వందల సంఖ్యలో చరఖాలు తిరిగేవని చెప్పేవారు. ఇప్పటికే ఖాదీ పరిశ్రమను పట్టించుకునే వారు లేకుండా పోవడంతో మా కుటుంబాల పోషణ కష్టంగా మారింది. ఇప్పుడి ఆస్తిని కూడా అమ్మేయడంతో మా బతుకులకు భరోసా లేకుండా పోయింది.

-అకిని రామచంద్రం, పూడురు

ఎమ్మెల్సీగా నేను ఫిర్యాదు చేశా..విచారణ ఏది ..?

పుడూర్ ఖాదీ భాండార్‌కు చెందిన 57 గుంటల స్థలం అక్రమ రిజిస్ట్రేషన్ పై ఎమ్మెల్సీ హోదాలో తాను ఫిర్యాదు చేసినా ముఖ్యమంత్రి విచారణ జరిపించలేదని తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. గురువారం పూడురులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సామాన్యుడు లేఖ రాస్తే ఈటలపై చర్య తీసుకున్న సీఎం తాను ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని మండిపడ్డారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ప్రభుత్వ ఆస్తిని ఎలాంటి ప్రకటన లేకుండా అమ్మడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వ ఆస్తిని అమ్మే అధికారం ఎవ్వరికీ లేదని జీవన్ రెడ్డి స్పష్టంచేశారు. రూ. 12కోట్లు విలువ చేసే భూమిని దొంగచాటుగా కేవలం రూ.1.25 లక్షలకే అమ్ముకున్నారని ఆరోపించారు. తక్షణం రిజిస్ట్రేషన్ రద్దు చేసి ఈ స్థలాన్ని నేత కార్మికులకు కేటాయించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకులు అందరూ కలిసి కార్మికులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ లావాదేవీల్లో భాగస్వాములైన చొప్పదండి, కోరుట్ల ఎమ్మెల్యేలతో పాటు కొడిమ్యాల ఎంపీపీ, సింగిల్ విండో ఛైర్మెన్ అందరూ టీఆర్ఎస్ వాళ్లేనని అన్నారు. టెక్స్టైల్ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న కేటీఆర్ ఒక్క సిరిసిల్లాకే మంత్రా లేక రాష్ట్రానికి మంత్రా అర్థం కాకుండా పోయిందని విమర్శించారు. రూ. కోట్ల కుంభకోణం జరుగుతున్నా కేటీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

-MLC తాటిపర్తి జీవన్ రెడ్డి

Advertisement

Next Story

Most Viewed