ప్లాస్టిక్ ఫ్రీగా కంగనా ఆఫీస్

by  |
ప్లాస్టిక్ ఫ్రీగా కంగనా ఆఫీస్
X

వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో బీటౌన్ హీరోలకు సవాల్ విసిరే నటి కంగనా రనౌత్. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ బోల్డ్‌నెస్ ప్రదర్శించే ఈ బ్యూటీ క్వీన్ కెరీర్‌లో వివాదాలకూ కొదువేం లేదు. నటిగా నాలుగు ఫిలింఫేర్ అవార్డులతోపాటు మూడు జాతీయ పురస్కారాలు అందుకున్న కంగనా.. నిర్మాతగానూ తన అభిరుచికి తగ్గ చిత్రాలు నిర్మించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ‘మణికర్ణిక ఫిల్మ్స్’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఇందుకోసం ముంబైలోని పాలిహిల్ అనే ప్రాంతంలో ఆమె తన కలల ఆఫీస్‌ను కట్టుకుంది. తాజాగా ఈ ఆఫీసుకు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

‘మూడు నాలుగు సంవత్సరాల నుంచి ప్రకృతిపై ప్రేమ పెరిగింది. ఎకో ఫ్రెండ్లీగా మారిపోయాను. అందుకే ఆఫీస్‌ను ప్లాస్టిక్ ఫ్రీగా నిర్మించాను. నా బిల్డింగ్ మొత్తం పర్యావరణ అనుకూలంగా ఉంటుంది. ఎక్కడ చూసినా గ్రీనరీ కనిపిస్తుంది’ అని కంగనా తెలిపారు. ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ శభ్నమ్ గుప్తా ఈ ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దారు. ఈ భవంతి కోసం కంగనా దాదాపు 48 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కాగా ‘పది సంవత్సరాల ఆమె కలకు ఇదే నిదర్శనం.. నిజాయితీతో పాటు సత్యం మాట్లాడే వాళ్లు ఎప్పటికైనా విజయం సాధిస్తారు’ అని కంగనా సిస్టర్ రంగోలి తెలిపారు.



Next Story