ఉద్ధవ్‌కు గర్వభంగం తప్పదు: కంగనా

by  |
ఉద్ధవ్‌కు గర్వభంగం తప్పదు: కంగనా
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎట్టకేలకు బుధవారం మంబైకి చేరుకున్న సంగతి తెలిసిందే. శివసేన కార్యకర్తల నిరసనలు.. రిపబ్లిక్ పార్టీ కార్యకర్తల మద్ధతు నడుమ ఆమె ముంబై ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టింది. అనంతరం ఆమె ఖర్ ప్రాంతంలోని నివాసానికి చేరుకుంది. తాను సవాల్ చేసినట్టుగానే ముంబైకి వచ్చానని ట్విట్టర్ ద్వారా వీడియో కూడా షేర్ చేసింది.

ఇది ఇలా ఉండగా.. కంగనాకు చెందిన భవనం అక్రమ కట్టడం అంటూ నిన్న బీఎంసీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాల్ చేసిన కంగనా రనౌత్ న్యాయవాది ముంబై కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు విచారణ ఇంకా జరగాల్సి ఉంది. అయినప్పటికీ.. బీఎంసీ అధికారులు కంగనా భవనాన్ని కూల్చివేసేందుకు పనులు ప్రారంభించారు. దీంతో విచారణ చేయకుండా ఎలా భవనాన్ని కూల్చేస్తారంటూ.. కూల్చివేత పనులను ఆపేయాలని కోర్టు స్టే ఇచ్చింది.

ఇదే వ్యవహారం పై వెంటనే ట్విట్టర్‌లో స్పందించిన కంగనా… ‘ఈ రోజు నా ఇల్లు ధ్వంసం చేశారు.. రేపు మీకూ గర్వభంగం తప్పదు’ అంటూ హెచ్చరించింది. ఫిలిం మాఫీయాతో చేరిన ఉద్ధవ్ ఠాక్రే తన భవనాన్ని ధ్వంసం చేశారని ఆరోపించింది. అంతేకాకుండా.. అన్ని రోజులు ఒకేలా ఉండవు అన్న విషయం గుర్తు పెట్టుకో అంటూ చురకలు వేసింది.

అంతకుముందు ట్వీట్‌లో బాబర్ అతడి సైన్యం వచ్చి రామమందిరాన్ని కూల్చినట్టు.. తనకు సంబంధించిన భవనాన్ని కూడా కూల్చేశారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయినా ప్రస్తుతం అయోధ్యలో అట్టహాసంగా రామమందిర నిర్మాణం జరుగుతోందని.. ఇతిహాసం మరోసారి రిపీట్ అవుతోందంటూ అభివర్ణించింది.

మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్‌ పై గతంలో అయోధ్య చిత్రాన్ని ప్రకటించామని గుర్తు చేసిన కంగనా.. ఆ ఆఫీస్ భవనం తనకు రామమందిరంతో సమానమంది. ఉద్ధవ్ ఠాక్రే బాబర్ అని.. బీఎంసీ అధికారులు అతడి సైన్యం అంటూ పోల్చిన కంగనా.. తన నివాసం అయిన రామమందిరాన్ని కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఉద్ధవ్‌కు ఇదే పరిస్థితి ఎదురువుతోందని జోష్యం చెప్పింది. ఈ తాజా పరిణామాలతో మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి అగ్గి రాజుకుంది.



Next Story