ముంబై‌లోనే తేల్చుకుందాం: కంగనా

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర రాజకీయాల్లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యవహారం సంచలనంగా మారింది. ఇటీవల కంగనా.. ముంబై పోలీసులు, ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం వివాదానికి దారి తీసింది. దీంతో శివసేన నాయకులు, కంగనా మధ్య మాటల యుద్ధం జోరందుకుంది. కంగనా రనౌత్‌ ఒక ‘హరంఖోర్ లడ్కి’ అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యలను కంగనా రనౌత్ తీవ్రంగా పరిగణించింది.

ఈ నేపథ్యంలోనే సంజయ్ రౌత్‌ పై తీవ్ర స్థాయిలో మండిపడుతూ.. సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేసింది. హరంఖోర్ అనడం సంజయ్ రౌత్ మనస్తత్వం అంటూ కంగనా అభిప్రాయపడింది. దేశంలో నిత్యం అమ్మాయిలు అత్యాచారానికి గురవుతున్నారని.. వారి పై ఎన్నో దాడులు, అవమానలు, అఘాయిత్యాలు జరగడానికి కారణం చెడు మనస్తత్వం అంటూ సంజయ్ రౌత్‌కు గుర్తు చేసింది. తన పై దారుణంగా మాట్లాడిన సంజయ్‌ రౌత్‌ను ఈ దేశ ఆడబిడ్డలు క్షమించరని చెప్పుకొచ్చింది.

ఈ దేశంలో ఉండాలంటే భయం వేస్తోంది అన్న అమీర్ ఖాన్, నసీరుద్దిన్ షాలను ఎందుకు హరంఖోర్ అనలేదని సంజయ్‌ను ప్రశ్నించింది. తానెప్పుడు మహారాష్ట్ర పై అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్న కంగనా.. కేవలం ముంబై పోలీసులను మాత్రమే తప్పుబట్టినట్లు వివరించింది. అది కూడా హిందూ సాధువులను దారుణంగా కొట్టి చంపుతున్నా పోలీసులు నిలబడి సినిమా చూశారే తప్ప అడ్డుపడలేదని గుర్తు చేసింది. అందుకే వాళ్లకు మర్యాద ఇవ్వలేదని చెప్పింది.

అటు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో కూడా ముంబై పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కంగనా ఆరోపించింది. అందుకే వారి తీరును ఎండగట్టానని తెలిపింది. మహారాష్ట్ర ఏమి సంజయ్‌ రౌత్ ది కాదని తేల్చి చెప్పింది. ముంబై కి వస్తే కొంతమంది కొట్టి చంపేస్తామని బెదిరిస్తున్నారని.. అయినా నేను ఎట్టి పరిస్థితుల్లో నైనా సెప్టెంబర్ 9న వచ్చి తీరుతానని.. అక్కడే తేల్చుకుందాం అంటూ కంగనా సంజయ్‌ రౌత్ కు సవాల్ విసిరింది.

Advertisement