కంగనా, సంజయ్ ట్వీట్ వార్

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌పై మండిపడింది. సుశాంత్ కేసులో డ్రగ్ యాంగిల్ వెలుగు చూశాక.. స్టార్ కిడ్స్ డ్రగ్ టెస్ట్ చేయించుకుని రూమర్స్‌ను ఖండించాలని కోరిన విషయం తెలిసిందే. దీనిపై మండిపడ్డ సంజయ్.. ఏదైనా సమాచారముంటే పోలీసులకు లేదా ప్రభుత్వానికి సూచించాలి కానీ, ఇలా ట్విట్టర్‌లో డ్రామాలు చేయొద్దని హెచ్చరించాడు. అంతేకాదు, ముంబై పోలీసులను తక్కువ చేసి మాట్లాడిన కంగనా అసలు ముంబైలో అడుగుపెట్టకూడదని వార్నింగ్ ఇచ్చాడు.

దీనిపై ఫైర్ అయిన కంగనా.. ‘ShameOnSanjayRauth’ పేరుతో ట్విట్టర్‌లో హాష్‌ట్యాగ్ ట్రెండ్ చేసి సంజయ్‌ను కడిగిపారేసింది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే ముంబై తనకు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లా ఎందుకు మారాలని ప్రశ్నించింది. బాలీవుడ్‌లో డ్రగ్స్ వినియోగం గురించి బయటపెడతానని.. ఈ విషయంలో తనకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం లేదా కేంద్రం రక్షణ కల్పించాలని.. ముంబై పోలీసుల మీద నమ్మకం లేదని చెప్పింది కంగనా. ఈ విషయాన్ని ఉద్దేశిస్తూ సంజయ్.. ముంబై పోలీసుల మీద నమ్మకం లేనప్పుడు ముంబైలో అడుగుపెట్టడానికి వీల్లేదని అన్నాడు.

కాగా, సుశాంత్ కేసులో ముంబై పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేయలేదని.. వారి మీద నమ్మకం లేదనే చెప్పాను తప్ప.. తన మాటల్లో ఎక్కడా ఇండస్ట్రీ అన్నా, ముంబై అన్నా హేట్ అని వినిపించిందా? అని ప్రశ్నించింది. ఈ విషయంలో నెటిజన్లు కూడా కంగనాకు సపోర్ట్‌గా నిలిచారు. అంతేకాదు దీపికా పదుకొనెకు ఒక చిన్న బెదిరింపు వస్తేనే రచ్చ చేసి, దేశంలో రక్షణ లేదంటూ మోడీ మీదకు లేచిన నాయకులు.. ఇప్పుడు ఎక్కడపోయారని ప్రశ్నిస్తున్నారు. ఒకరికి ఓ న్యాయం, మరొకరికి మరో న్యాయమా? అని అడుగుతున్నారు.

Advertisement