వరుస మరణాలతో కందనూలు కకావికలం..!

by Sridhar Babu |   ( Updated:2021-05-23 09:51:04.0  )
వరుస మరణాలతో కందనూలు కకావికలం..!
X

దిశ, నాగర్ కర్నూల్: ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ తమ స్వార్ధ అధికార, రాజకీయ ప్రయోజనం కోసం ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని కరోనా బాధితులకు ఇప్పుడిప్పుడే బోధపడుతుంది. కళ్ళముందే కనిపించిన వ్యక్తి సడెన్‌గా మాయమవుతున్నా అలసత్వం ప్రదర్శస్తున్న అధికారులు, వెంటేసుకుని తిరిగిన నేతలంతా కళ్ళప్పగించి చూడటమే తప్పా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వైద్యులు సంపాదనే లక్ష్యంగా మాంసపు ముద్దలను పీక్కుతినే రాబందులుగా మారి కరోనా వైరస్‌ను ఒక పావుగా వాడుకుంటున్నారని బిల్లులు కట్టే బాధితులు మొత్తుకుంటున్నారు. ప్రజలు కట్టే పన్నుల ఆధారంగా జీతాలు వస్తున్నాయన్న సోయి మరిచి “గాలివీచినప్పుడే తూర్పు అరబట్టాలన్న” సామెతను అధికార యంత్రాంగం ఫాలో అవుతోందని మండిపడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు కొమ్ము కాస్తూ కరోనా రోగుల వద్ద సొమ్ము చేసుకునేలా పరోక్ష కారకులు అవుతున్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన రాపిడ్ కిట్లను సైతం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి డబ్బులు దండుకుంటున్నారు. ప్రభుత్వంలో మాత్రం కిట్ల కొరత ఉందని టెస్టులు చేయకుండా తక్కువ కేసులు నమోదవుతున్నాయని పెద్దలతో గొప్పలు చెప్పుకొంటున్నారు.

ఫలితంగా కందనూలులో రోజురోజుకు కేసులు పెరిగి చివరికి చావు డప్పులే మిగిల్చుతున్నాయి. అక్షరాస్యత శాతంలోనూ వెనకబడి గ్రామీణ నేపథ్యం ఉన్న జిల్లా కావడంతో అవగాహనా లోపంతో కరోనా కాటుకు బలవుతున్నారు. దీనిని అదుపు చేయాల్సిన వైద్య ఆరోగ్య శాఖ మాత్రం అతివినయం ప్రదర్శించి కేసులు తక్కువ వస్తున్నాయని ఉన్నతాధికారుల చెవిలో పూలుపెట్టారని కరోనా బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ నివారణలో చివరి స్థానం సంపాదించుకుంది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి జిల్లా అధికార యంత్రాంగంపై మొట్టికాయలు వేశారు. జిల్లా కలెక్టర్ శర్మన్, జిల్లా ఎస్పీ సాయిశేఖర్ లను మందలించారు. కరోనా వైరస్ నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగిన నివేదికపై అసహనం వ్యక్తం చేస్తూ శనివారం జిల్లాకు ప్రత్యేక బృందాన్ని పంపారు. రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీనివాస రావు జిల్లా కేంద్రానికి వచ్చి ఇక్కడి పరిస్థితిని సమీక్షించారు. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య అధికారులు కరోనా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు సైతం ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. మరోసారి ఫీవర్ సర్వే చేసి నివేదికలు ఇవ్వాలని కోరుతూ లాక్‌డౌన్ మరింత కఠినం చేయాలని ఆదేశించారు.

ఇప్పటివరకు 28,187 కారోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు చూపుతున్నారు. ప్రస్తుతం 8,262 మంది చికిత్స పొందుతున్నట్లు ఇందులో 8 180 మంది హోమ్ ఐసోలేషన్లో ఉండగా మరో 82మంది ఐసీయూలో ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటివరకు 81మంది కరోనా బారినపడి మృతిచెందారు. కాగా హోమ్ ఐసోలేషన్ ఉన్నవారికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎలాంటి అవసరాలు తీర్చకపోవడంతో జనవసాల్లోకి వస్తున్నారు. ఫలితంగా వైరస్ రోజుకి మూడింతలు అవుతోంది.

ఓటు బ్యాంక్ కాపాడుకునే ప్రయత్నంలో.. ఓటర్లనే కోల్పోయారు..!

నాగర్ కర్నూల్ జిల్లాలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్నాయా అన్న సందేహం కలిగేలా ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు గ్రామాల్లో ప్రచారం సాగించారు. తమ ఓటు బ్యాంకు కాపాడుకునే పనిలో నిమగ్నమై కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిని అంచనా వేయకపోవడంతో చివరికి ఓటర్లనే కోల్పోయారు. సభలు, సమావేశాలు, గ్రామీణ కార్యక్రమాలతో జనాలను పోగేయడం పెనుముప్పుగా మారిందని బాధపడుతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు, సామాన్యులు సైతం తనువు చాలించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అచ్చంపేటలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం బ్లండర్ మిస్టేక్ అని బాధపడుతున్నారు. ఇప్పుడిప్పుడే తమ తప్పులను గమనించి ఉన్నతాధికారుల ఆదేశానుసారం లాక్‌డౌన్ నిబంధనలు కట్టుదిట్టం చేస్తున్నారు. ఇంటింటికి తిరిగి మరోసారి ఫీవర్ సర్వే చేస్తున్నారు. కానీ మద్యం దుకాణాలు, బెల్టు షాపులు నిర్వహణలో మాత్రం ఎలాంటి మార్పులు తీసుకోకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుందని మండిపడుతున్నారు.

Advertisement

Next Story