వ్యాక్సినేషన్ లో కామారెడ్డి జిల్లా ఫస్ట్

by Aamani |
వ్యాక్సినేషన్ లో కామారెడ్డి జిల్లా ఫస్ట్
X

దిశ, కామారెడ్డి : కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లాలో 2.30 లక్షల టార్గెట్ ఉంటే లక్షకు పైగా వ్యాక్సినేషన్ పూర్తిచేసి 44 శాతం సాధించడంతో జిల్లా యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. శనివారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని జనహిత భవనంలో కరోనా తీవ్రత, కరోన కట్టడి, చికిత్స, వ్యాక్సినేషన్ పై మెడికల్, వైద్య ఆరోగ్యశాఖ, రెవిన్యూ, పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతర మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా సెకండ్ వేవ్ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆక్సిజన్, బెడ్ల కొరత ఉండకుండా రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కరోనాకు సంబంధించి టెస్టుల సంఖ్య పెంచడంతో పాటు పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స, కరోనా భారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ కార్యక్రమాలు సమాంతరంగా కొనసాగాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. కోవిడ్ టెస్టులు చేయడంలో జిల్లా యంత్రాంగం ముందంజలో ఉందని, సెకండ్ వేవ్ లో లక్ష 50 వేల మందికి పరీక్షలు నిర్వహించగా 4 వేల మందికి కరోనా సోకిందని తెలిపారు. ఇందులో 50 మందికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతుండగా మిగతా వారు హోమ్ ఐసోలేషన్లలో ఉన్నారని పేర్కొన్నారు.

జిల్లాలో ఆక్సిజన్ బెడ్లు సరిపోవడం లేదని అధికారులు మా దృష్టికి తెచ్చారని, వెంటనే జిల్లా ఆస్పత్రిలో 40, బాన్సువాడలో 50, దోమకొండలో 10, మద్నూర్ 10, ఎల్లారెడ్డిలో 10 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. వాటికి అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేయడం జరుగుతోందని తెలిపారు. జిల్లాలో రెమిడిసివర్ ఇంజక్షన్ల కొరత ఉందని రెండు రోజుల్లో ఇంజక్షన్లు, మందులు పంపించడానికి మాట్లాడటం జరిగిందని చెప్పారు. చికిత్స విషయంలో సిబ్బంది కొరత ఉందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా దానికోసం 19 మంది మెడికల్ ఆఫీసర్ల సేవలు వినియోగించుకోవాలని, ప్రతినెల వారికయ్యే 3 లక్షల వేతనాన్ని మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు. జిల్లాలో 2 లక్షల 30 వేల వ్యాక్సినేషన్ టార్గెట్ ఉంటే ఇప్పటికే లక్షకు పైగా మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసి 44 శాతంతో రాష్ట్రంలోనే కామారెడ్డి మొదటి స్థానంలో ఉందని, దీనికి జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కావాల్సిన సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకోవాలని ఆదేశించడం జరిగిందన్నారు.

మహారాష్ట్ర బార్డర్ నుంచి వచ్చే రాకపోకలపై జిల్లా ఎన్ఫోర్స్ మెంట్ టీం, పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో ఉన్న 108, 104 అంబులెన్స్ ఎన్ని ఉన్నాయో అన్ని అంబులెన్సులు ఆదివారం ఉదయం పది గంటలకల్లా రోడ్లపైకి రావాలని అధికారులను ఆదేశించారు. కరోనా సెకండ్ వేవ్ వేగంగా దూసుకుపోతుందని, ప్రజలకు చేతులెత్తి దండం పెడుతున్నా.. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలి, భౌతిక దూరం పాటించాలని, ప్రభుత్వం చేయగలిగింది చేస్తుందని, ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సమీక్షలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బిబిపాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, జిల్లా కలెక్టర్ శరత్, జడ్పీ చైర్మన్ దఫెడర్ శోభ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దొత్రే, కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed