పెళ్లికి ముందే ‘కళ్యాణ లక్ష్మి’.. స్పీకర్ పోచారం ఇలాకాలో హాట్‌టాపిక్

by Anukaran |   ( Updated:2021-10-26 08:14:38.0  )
పెళ్లికి ముందే ‘కళ్యాణ లక్ష్మి’.. స్పీకర్ పోచారం ఇలాకాలో హాట్‌టాపిక్
X

దిశప్రతినిధి, నిజామాబాద్ : సాధారణంగా పేదింట్లో జరిగే పెళ్లిళ్ళకు ప్రభుత్వం ఇచ్చే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పొందాలంటే ప్రజలకు చుక్కలు కనబడుతాయి. పైరవీలు, అధికారులను మచ్చిక చేసుకున్నా పెళ్లయ్యాక చెక్కులను పొందాలంటే నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. ఇటీవల ప్రభుత్వం పెళ్లి రోజే వధువు కుటుంబ సభ్యులకు చెక్కులను అందించాలని యోచిస్తోంది. కానీ, అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. అయితే, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడలో మాత్రం ఎంగేజ్‌మెంట్ చేసుకున్న జంటకు ఏకంగా కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు రెవెన్యూ అధికారులు. ప్రస్తుతం ఈ వ్యవహరం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. గతంలో పెళ్లిరోజే కళ్యాణలక్ష్మి చెక్కులను ప్రజాప్రతినిధులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. కానీ, ఏకంగా ఎంగేజ్ మెంట్ అయ్యాక చెక్కులను అందజేయడం స్థానికంగా చర్చకు దారితీసింది.

పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు కుటుంబాలకు భారం కావొద్దని తెలంగాణ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను తీసుకువచ్చింది. అందులో భాగంగానే తొలిసారి రూ.51 వేలను కేవలం ఎస్సీ, ఎస్టీ, గిరిజనులు, మైనార్టీలకు అందజేసింది. తర్వాత దీనిని అన్ని సామాజిక వర్గాలకు అమలు చేశారు. క్రమంగా పెళ్లి తర్వాత ఇచ్చే కళ్యాణ లక్ష్మి డబ్బులు రూ.50 వేలను పెంచి రూ.లక్ష చేసింది. కానీ, ఇది పొందాలంటే అర్హులకు సవాలక్ష నిబంధనలు పెట్టారు. పెళ్లి పత్రికతో పాటు గతంలో వివాహం జరుగలేదని, పెళ్లినాటి ఫోటోలను జత చేసి వధువు తల్లి పేరు మీద చెక్కు ఇవ్వడానికి చాలా అడ్డంకులు ఉన్నాయి. ముందుగా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అన్ని సవ్యంగా ఉంటేనే చెక్కుల జారీ కోసం ఉత్తర్వులు జారీ చేస్తారు.

కానీ కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలం మల్లాపూర్ గ్రామంలోని ఓ జంటకు రెవెన్యూ అధికారులు వరపూజ(ఎంగేజ్ మెంట్) జరిగిన కొన్ని రోజులకే చెక్కును అందజేశారు. చెక్కు తీసుకున్న వారు సంతోషిస్తుండగా.. స్పీకర్ ఇలాకాలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పెళ్లికి ముందే కళ్యాణ లక్ష్మి చెక్కులను ఇవ్వడం స్థానికంగా కలకలం రేపింది. ఇప్పటికే డబుల్ బెడ్ రూం ఇళ్ళను అనర్హులకు కేటాయిస్తున్నారని ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తుండగా.. తాజాగా కళ్యాణ లక్ష్మి చెక్కులు పెళ్లికి ముందే పంపిణీ జరుగుతుండటంతో రెవెన్యూ అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై తహశీల్దార్‌ను వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, పరిశీలిస్తున్నామని తెలిపారు. కాగా, ఈ ఘటనపై స్పీకర్ ఏ మేరకు చర్యలు తీసుకుంటారో అని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది

Advertisement

Next Story