యోగి ఆదిత్యనాథ్ పై ఖాన్ సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ సీఎం మూర్ఖపు పిల్లాడిలా వ్యవహరిస్తున్నారని, ముంబయి నుంచి మధుర తీసుకొచ్చేటప్పుడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ తనను ఎన్‌కౌంటర్ చేయనందుకు ధన్యవాదాలని డాక్టర్ కఫీల్ ఖాన్ మంగళవారం రాత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పౌరసత్వ సవరణ చట్టంపై చేసిన ప్రసంగానికి గాను దేశ భద్రత చట్టం(ఎన్ఎస్ఏ) అభియోగాలపై కఫీల్ ఖాన్‌ను రాష్ట్ర ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. ఎన్ఎస్ఏ అభియోగాలను తోసిపుచ్చుతూ కఫీల్ ఖాన్‌ను వెంటనే విడుదల చేయాలని అలహాబాద్ హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. అనంతరం మంగళవారం రాత్రి మధుర జైలు నుంచి విడుదలైన కఫీల్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజు రాజ ధర్మాన్ని పాటించాలని రామాయణంలో వాల్మీకి పేర్కొన్నారని, కానీ, యూపీలో రాజ రాజధర్మాన్ని పాటించకపోగా మూర్ఖపు పిల్లాడిలా వ్యవహరిస్తున్నారని పరోక్షంగా సీఎంపై వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, తనను మరో కేసులోనూ ఇరికించే అవకాశమున్నదని అన్నారు. కోర్టు అద్భుతమైన తీర్పునిచ్చిందని, తన విడుదల కోసం గళమెత్తిన ప్రతిఒక్కరికి రుణపడి ఉంటారని చెప్పారు.

Advertisement