యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘జ్యోతక్క’

by  |
యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘జ్యోతక్క’
X

దిశ, వెబ్‌డెస్క్: క్వారంటైన్ టైమ్‌లో పెద్దగా అవకాశాలు లేక అందరూ యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేస్తున్నారని గతంలో అనుకున్నాం కదా… ఆ క్రమంలో రోహిణీ, హిమజ, ఆషుల తర్వాత వారి బిగ్‌బాస్ బెస్ట్ ఫ్రెండ్ మన శివజ్యోతి కూడా యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసేసింది. తెలంగాణ ప్రేక్షకులు ఆమెను ముద్దుగా పిలుచుకునే ‘జ్యోతక్క’ అనే పేరుతోనే మొదలుపెట్టింది. రోహిణి, హిమజ, ఆషులు అంటే సినిమాలు, సీరియల్స్ చేశారు, సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది,. వాళ్ల దగ్గర చెప్పడానికి చాలా కంటెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ల చానళ్లు నడుస్తాయి. శివజ్యోతి ఎటు తిరిగి వార్తలు చదివి ఫేమస్ అయింది. కాబట్టి యూట్యూబ్‌లో కూడా వార్తలు చదవడం మినహా ఏమీ చేయలేదని అందరూ అనుకున్నారు. ఆమె పెట్టిన మొదటి వీడియోలో కూడా శివజ్యోతి తన దగ్గర ఎలాంటి కంటెంట్ లేదని, మనసుకు ఏది తోస్తే అదే పెడతానని చెప్పడం విశేషం. ఆమె అలా చెప్పడం చూసి క్లారిటీ లేదు అనుకున్నవాళ్లంతా ఇప్పుడు సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లు పొందుతున్నారు.

ఆగస్టు 1న ప్రారంభమైన జ్యోతక్క యూట్యూబ్ చానల్‌కు నెల తిరగకుండానే 1 లక్షా 64 వేల మందికి పైగా సబ్‌స్క్రైబర్‌లు వచ్చారు. ఇప్పటివరకు ఆమె పెట్టినవి 8 వీడియోలు మాత్రమే. వీటిలో ఒక వీడియోకు 2 మిలియన్లకు పైగా వీక్షణలు రావడం విశేషం. శివజ్యోతి పెడుతున్న యునిక్ కంటెంట్ ఇందుకు ప్రధాన కారణం. ఏం పెట్టాలో తెలియదు అంటూ మొదలుపెట్టి విభిన్న రకాల కాన్సెప్టులను ఎంచుకుని శివజ్యోతి వీడియోలను చేస్తోంది. వీటిలో ఎలాంటి గ్రాఫిక్‌లు, జోడింపులు లేకపోవడం, వీడియో మొత్తం సహజంగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల వీక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. వరలక్ష్మీ వ్రతం, రాఖీ పండుగ, ఫిదా హౌస్ టూర్, గొర్రెల కాపరుల జీవితంలో ఒకరోజు, ఖైరతాబాద్ గణేశ్ నిర్మాణం, సఫాయికార్మికులతో ఒకరోజు, సొంతూరు ట్రిప్… ఇలా పెట్టిన ఎనిమిది వీడియోల్లో కొన్ని మిలియన్ల వీక్షణలను దాటిపోగా, మరికొన్ని మిలియన్ల వీక్షణలకు దగ్గరలో ఉన్నాయి. అందరిలాగ మేకప్ ట్యుటోరియల్స్, వంటలు కాకుండా విభిన్నంగా యూట్యూబ్ చానల్‌ను నడిపిస్తున్నందుకు అందరూ జ్యోతక్కను తెగ పొగిడేస్తున్నారు.


Next Story

Most Viewed