ట్రెండింగ్‌లో ‘జస్టిస్ ఫర్ కాకు’

by  |
ట్రెండింగ్‌లో ‘జస్టిస్ ఫర్ కాకు’
X

దిశ, వెబ్ డెస్క్: లెక్కల’ సబ్జెక్టు అంటేనే చాలా మంది భయపడిపోతుంటారు. ప్రపంచంలో చాలా కష్టమైన సబ్జెక్టు ఏదీ అంటే.. వెంటనే ‘గణితం’ అనేస్తారు. కానీ, లెక్కలు అర్థమైతే.. దాని కన్నా ఈజీ సబ్జెక్ట్ మరోటి ఉండదు. నూటికి నూరు మార్కులు తెచ్చుకోవాలంటే..మ్యాథ్స్‌‌ను మించి మరొకటి ఉండదు. ఈ లెక్కల గోల ఎందుకు అంటే..జీవితంలో ప్రతీది లెక్క ప్రకారమే ఉంటుంది కనుక. అందులోనూ డబ్బుల లెక్కింపులో లెక్కలు మరీ ముఖ్యం. లెక్క తప్పిందో మొదటికే మోసం వస్తుంది. ఈ క్రమంలోనే ఓ పని మనిషి తమ యజమానులతో శాలరీ లెక్కల విషయంలో లెక్క సరిచేయడానికి వాదిస్తోంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచిన ఈ వీడియో‌పై మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ‘జస్టిస్ ఫర్ కాకు’ అంటూ ట్విట్టర్లో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

ఒకటో తారీఖు రాగానే..అప్పుల చిట్టాలు, చిట్టీ పద్దులు, కిరాణా సామాను, పాల, కరెంటు, నల్లా, బోర్ బిల్లులు. ఇంటి కిరాయి. పని మనిషి శాలరీ అన్నీ లెక్కకట్టి ఇవ్వాల్సిందే. ఆ క్రమంలోనే కొందరు కుర్రాళ్లు.. తమ పని మనిషి(కాకు)కి నెల వారీ జీతం ప్రకారం రూ.1,800 ఇచ్చారు. అందులో మూడు 500 రూపాయల నోట్లు, మూడు వంద రూపాయల నోట్లు ఆమె చేతిలో పెడతారు. ఆ పనిమనిషి మాత్రం.. ఈ లెక్క సరికాదు నా వేతనం 1,800 ఇవ్వాలని అంటోంది. 1,500+100+100+100 = 1,800 కదా అని ఆ కుర్రాళ్లు ఆమెకు అర్థమయ్యేలా వివరిస్తారు. ఆమె మాత్రం ఎంతకూ ఒప్పుకోదు. తన 1,800 రూపాయలు తనకు ఇవ్వాలంటూ వాళ్లతో వాగ్విదానికి దిగుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలవగా.. మీమ్స్ చేసేవాళ్లు.. ఈ వీడియోను మరింత వైరల్ చేస్తున్నారు. ట్వీపుల్స్ (ట్విట్టర్ యూజర్లు) తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆ పనిమనిషికి న్యాయం జరగాలంటూ.. ‘జస్టిస్ ఫర్ కాకు’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. ‘ఈ కేసును సీబీఐకి అప్పగించాలి’, ‘1500+300=? ఎంతవుతుంది? ఇది తెలుసుకోవాలని మహారాష్ట్ర కోరుకుంటోంది’ ‘ముంబై లెక్కల చిక్కులు.. ఢిల్లీ దాకా చేరేటట్లు ఉంది’ ‘మన దేశ ఫైనాన్స్ మినిస్టర్ కావడానికి అన్ని క్వాలిటీస్ కాకుకు ఉన్నాయి’ ‘ఈ విషయంలో.. శకుంతలా దేవి, రామానుజన్ లేదా ఆర్యభట్టనే ఆమెకు సాయం చేయగలరు లేదా సూపర్ కంప్యూటర్ అవసరం ఉంది’‘ఆర్‌బీఐ ప్లీజ్ ప్రింట్ రూ. 1,800 నోట్’ ఇలా ట్విట్లర్లో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది ఏకంగా ప్రాబ్లెమ్ సాల్వ్ అంటూ..2000, 500 నోట్లను ఎడిట్ చేసి 1800 అంకె వేసి ఆ ఫొటోను షేర్ చేస్తున్నారు. మొన్నటివరకు ‘వంటగదిలో ఎవరున్నారు’(రసోడీ మే కౌన్ థా?) ట్రెండింగ్‌లో నిలిస్తే.. ఇప్పుడు ‘జస్టిస్ ఫర్ కాకు’ ఆ ప్లేస్‌ను రిప్లేస్ చేస్తోంది. మరి కాకుకు న్యాయం జరుగుతుందా? లేదా? లెక్క తేలుతుందో లేదో చూడాలి.

https://twitter.com/rj_lakshh/status/1300079067627216897


Next Story