- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలుగు సీఎంల ‘ఉమ్మడి’కథ
దిశ, న్యూస్ బ్యూరో : తెలుగు రాష్ట్రాల నీటి వివాదాల్లో కొత్త అంకం మొదలైంది. ఇంతకాలం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలూ కలిసి కేంద్రంతోటి కొట్లాడే కొత్త వ్యూహానికి పదును పెడుతున్నాయి. నదుల అనుసంధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని గోదావరిని కావేరికి లింకు చేస్తుంటే దాన్ని కృష్ణానదికి అనుసంధానం చేయాలని రెండు తెలుగు రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఇప్పుడు పైకి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదంగా కనిపిస్తున్నా చివరికి అది కేంద్రంతో వివాదంగా మారడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. గోదావరి-కావేరి ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల జలాలకు కొత్త సమస్య సృష్టించకుండా కేంద్రంతో ఐక్య పోరు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాయి. గోదావరి జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం పరిష్కారం కాకుండా కేంద్రం నదుల అనుసంధానంలో అడుగు ముందుకు వేయడం సాధ్యం కాదు. ఇప్పుడు రెండు రాష్ట్రాలూ జలాల హక్కుల విషయంలో ఒక రాష్ట్రంపై మరో రాష్ట్రం ఆరోపణలు చేసుకుంటున్నందున అవి ఎంతగా వేడెక్కి ఎన్ని నెలల పాటు కొనసాగితే గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రక్రియ అంతగా జాప్యం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకూ కావాల్సింది అదే.
గోదావరిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాటా మేరకు జలాలు వాడుకున్న తర్వాత మిగులు జలాలను మాత్రమే కావేరీకి తరలిస్తామని కేంద్రం చెప్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇలా చెప్తున్నా భవిష్యత్తులో దెబ్బ తగులుతుందనే భయం ఈ రాష్ట్రాలకు లేకపోలేదు. కృష్ణానదిలో తగినంత నీరు రావడం లేదనే ఉద్దేశంతో గోదావరి నీటిని కృష్ణాబేసిన్‌కు తరలించాలని రెండు రాష్ట్రాలూ భావిస్తున్న సమయంలో కావేరికి నీరు తరలిపోతే ఇక ఇక్కడ ఏమీ మిగలదనే భయం ఈ రెండు రాష్ట్రాల సీఎంలను వేధిస్తోంది. పరోక్షంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం సద్దుమణిగే వరకు గోదావరి-కావేరి అనుసంధానం పనులు ప్రారంభమే కావద్దన్నది రెండు రాష్ట్రాల ఉమ్మడి వ్యూహం.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రూపొందించిన ఇంటర్ లింక్ ప్రాజెక్టుకు బ్రేక్ వేసేందుకే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు జల జగడం పెట్టుకున్నారనే అభిప్రాయం సీనియర్ ఇంజనీర్లలో వ్యక్తమవుతోంది. గోదావరిలో మన నీటి వాటాను ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు సిద్ధమైన ప్రాజెక్టును కచ్చితంగా అడ్డుకుని తీరాలనే ప్రయత్నాలు చేస్తున్నాయి రెండు రాష్ట్రాలు. దీనిలో భాగంగానే ఎటూ తెగకుండా నీళ్ల పంచాయతీకి ఆజ్యం పోస్తున్నాయి. రెండు రాష్ట్రాల జల వివాదాలు పరిష్కారం కాకుండా గోదావరి నీటిని తరలించుకుపోయే అవకాశమే లేదు. దీన్ని అదునుగా గుర్తించిన రెండు రాష్ట్రాలు ఇప్పుడు ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చాయి. గతంలో ఎన్నడూ… ఎవరూ చేయని విధంగా ఏపీ ప్రభుత్వం గోదావరి బోర్డుపై ఫిర్యాదు చేయడం, దీనికి ప్రతిగా తెలంగాణ సైతం వెనక్కి తగ్గకుండా మరింత ఆజ్యం పోసే తీరులో కొత్త ఆరోపణలను తీసుకురావడం దీనికి బలం చేకూరుస్తోంది.
గోదావరి-కావేరికి అడ్డుకట్ట!
గోదావరి వరద జలాలను తమిళనాడు రాష్ట్రానికి తరలించేందుకు కేంద్రం ఇంటర్ లింక్ ప్రాజెక్టును రూపొందించింది. 2019లో గోదావరి-కావేరీ ఇంటర్ లింక్ ప్రాజెక్టును ప్రతిపాదించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. దీనితో తమిళనాడులోని చివరి ప్రాంతం వరకు, కర్ణాటక, కేరళ, పాండిచ్ఛేరి రాష్ట్రాలకు నీటిని తరలించే ప్రణాళిక వేశారు. గోదావరి నుంచి ఏ రాష్ట్ర వాటానూ తీసుకోబోమని, కేవలం వరద జలాలను మాత్రమే తరలిస్తామని రాష్ట్రాలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి అనుసంధానం ద్వారా దిగువ రాష్ట్రాల నీటికి ఎసరు పెట్టడం ఖాయమనే భయాలు ఆయా రాష్ట్రాలకూ ఉన్నాయి. దేశం మొత్తం మీద అమలు చేయాలనుకుంటున్న నాలుగు నదుల అనుసంధానానికి ప్రాథమిక డీపీఆర్‌లను సైతం కేంద్రం సిద్ధం చేసింది. కేవలం వరద, మిగులు జలాలను మాత్రమే తరలిస్తామని చెప్పినప్పటికీ ప్రాజెక్టు పూర్తిచేస్తే గోదావరిలో రెండు తెలుగు రాష్ట్రాల వాటాకు గండి కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. సాధ్యాసాధ్యాల (ఫీజిబిలిటీ రిపోర్టు) నివేదిక ప్రకారం గోదావరి నది మీద ఇచ్చంపల్లి లేదా జానంపేట దగ్గర మొదలు పెట్టి అక్కడి నుంచి నాగార్జునసాగర్‌కు, ఆ తర్వాత అక్కడి నుంచి సోమశిల ద్వారా కావేరికి లింక్ చేయనున్నట్టు నిపుణులు ఆ నివేదికలో పేర్కొన్నారు. మార్చి 2019లో ఈ నివేదిక సిద్ధమైంది.
సముద్రంలోకి గోదావరి జలాలు
వరద రోజుల్లో ప్రతి ఏటా గోదావరి జలాలు దాదాపు మూడు వేల టీఎంసీల మేర బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఎగువ రాష్ట్రాలు ఎంతో కొంత వినియోగించుకుంటున్నా దిగువన ఉన్న తెలుగు రాష్ట్రాలు మాత్రం వాడకోవడం లేదు. వాడుకునే స్థాయిలో ప్రాజెక్టులు లేకపోవడమే ఇందుకు కారణం. గోదావరి నదిలో తెలంగాణ వాటా 954 టీఎంసీలు ఉన్నప్పటికీ ఇందులో సగం సైతం వినియోగించుకోలేకపోతోంది. గోదావరిపై ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తే మొత్తంగా వాడుకునేది కూడా 500 టీఎంసీలలోపు మాత్రమే ఉంటుంది. ఈ జలాలపై కన్నేసిన కేంద్రం గోదావరి-కావేరీ ఇంటర్ లింక్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ప్రస్తుతం రెండు రాష్ట్రాలు కేటాయింపుల మేరకు వినియోగించలేకున్నా భవిష్యత్తులో మాత్రం కచ్చితంగా వాడుకోవాలని భావిస్తున్నాయి. దీనిలో భాగంగానే రెండు రాష్ట్రాల సీఎంలు గతేడాది సమావేశమైనప్పుడు సంయుక్తంగా మేజర్ ప్రాజెక్టును నిర్మించే అంశంపై చర్చించుకున్నారు. దానిపై ఏపీ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. దుమ్ముగూడెం నుంచి గోదావరి జలాలను శ్రీశైలం జలాశయం వరకు తరలించేందుకు సీఎం కేసీఆర్ తన ఆలోచనను బహిర్గతం చేశారు. కానీ గోదావరి జలాలను తొలుత తీసుకునే దుమ్ముగూడెం, ఆ తర్వాత చేరే శ్రీశైలం పూర్తిగా తెలంగాణ భూభాగంలోనే ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌కు భవిష్యత్తులో భౌగోళికపరమైన సమస్యలతో ఇబ్బందులు ఏర్పడ్డాయన్న ఆందోళనను ఆ ప్రాంత ఎమ్మెల్యేలు జగన్‌కు వివరించారు. దీంతో పోలవరం ప్రాజెక్టు తర్వాతి నుంచి నాగార్జున సాగర్ దగ్గరకు చేర్చాలనే అభిప్రాయం ఆ రాష్ట్రం తరఫున పరోక్షంగా వినిపించింది. చివరకు ఎటూ తేలకుండా ఉండిపోయింది.
ఇద్దరం కొట్టుకుందాం!
కేంద్రం ప్రవేశపెట్టిన గోదావరి-కావేరీ ఇంటర్ లింక్ ప్రాజెక్టుకు బ్రేక్ వేయడమే ప్రస్తుతానికి ఉత్తమమైన మార్గమనే ఏకాభిప్రాయం రెండు రాష్ట్రాల్లో వ్యక్తమైనట్టు తెలిసింది. ఇందులో భాగమే ఇప్పటి వరకు లేని సరికొత్త జల వివాదాన్ని తెరపైకి తెచ్చి బోర్డుల మొదలు అపెక్స్ కౌన్సిల్ వరకు తీసుకెళ్లాలనుకునే ప్రయత్నం. గోదావరి విషయంలో గతంలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు గానీ ఇప్పుడు జగన్ హయాంలో గానీ తెలంగాణతో ఎలాంటి పేచీ లేదు. కానీ ఇప్పుడు హఠాత్తుగా కొత్త ప్రాజెక్టులు, అనుమతులు లేవు, డీపీఆర్‌లు ఇవ్వలేదు.. లాంటి అంశాలను తెరపైకి తేవడం గమనార్హం.
కృష్ణా జలాల విషయంలో చాలా కాలం నుంచి ఏపీతో తెలంగాణకు వివాదం ఉంది. ఏపీలో చంద్రబాబు హయాం నుంచి ఇప్పటి వరకూ అదే వివాదం కొనసాగుతున్నది. కానీ ఏపీ కృష్ణాపై సంగమేశ్వరంతో పాటు పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యం పెంచే పనులకు పూనుకుంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా బోర్డుకు ఫిర్యాదు చేసింది. కానీ ఏపీ సైతం గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణాపై తెలంగాణ నిర్మించే ప్రాజెక్టులతో పాటుగా గోదావరిపై నిర్మిస్తున్న కాళేశ్వరం, దేవాదుల మూడోదశ, సీతమ్మ సాగర్, లోయర్ పెన్‌గంగ బరాజ్‌లపై ఫిర్యాదు చేసింది. ఇప్పటి వరకు ఈ పరిణామాలు ఊహించలేదనుకున్నా రెండు రాష్ట్రాలు పక్కా ప్రణాళికల్లో భాగంగానే ఎదురెదురు ఫిర్యాదు చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇరిగేషన్ ఇంజినీర్లలోనూ ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం కొలిక్కి రావాలంటే కేంద్రం జోక్యం చేసుకుని అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించడం అనివార్యం. లేదా రాష్ట్రాలు కోర్టుల్ని ఆశ్రయించినట్లయితే దానిపై తీర్పు లేదా ఆదేశాలు వెలువడాల్సి ఉంటుంది. గతంలో అపెక్స్ కౌన్సిల్‌లో తీసుకున్న నిర్ణయాలే ఇప్పటి వరకు ఏ రాష్ట్రామూ చిత్తశుద్ధితో అమలు చేయలేదు. ఇక కోర్టుల్లోనూ ఆదేశాలు వెలువడినా మళ్లీ రివ్యూ పిటిషన్ వేయడం లేదా ట్రిబ్యునళ్లను ఆశ్రయించడం ఆనవాయితీగానే కొనసాగుతోంది. దీంతో ఏండ్ల తరబడి సమయం పడుతోంది. ఇప్పుడు సైతం ఇదే పునరావృతం కాదన్న గ్యారంటీ లేదు. అప్పటి దాకా నితిన్ గడ్కరీ అనుకున్న గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు ప్రారంభమవుతుందనేది అనుమానమే!