- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర బడ్జెట్‌తో ఆ జిల్లాకు ప్రయోజనం లేదు..!
దిశ ప్రతినిధి, మెదక్: కోటి ఆశలతో తమ జిల్లాకు అధిక నిధులు కేటాయిస్తారని ఎదురుచూసిన మెతుకుసీమ ప్రజలకు ఈ బడ్జెట్ నిరాశే మిగిల్చింది. 2021-22 సంవత్సరానికి గాను జిల్లా నుంచి ఆర్థిక మంత్రిగా ఉన్న తన్నీరు హరీశ్ రావు గురువారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాకు ఎటువంటి ప్రయోజనం లేదు. పథకాల ద్వారా వచ్చే లబ్ధినే ఉమ్మడి జిల్లా ప్రజలకు వర్తించనుంది. బడ్జెట్‌లో నిరుద్యోగ భృతిపై, ఉద్యోగులకు పీఆర్సీపై ఎటువంటి ప్రస్తావన లేకపోవడం వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా, గతేడాది లాగే రైతు రుణమాఫీ కోసం నిధులు కేటాయించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అధికార పార్టీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. ప్రతిపక్షాలు, ఇతరులు బడ్జెట్ నిరాశజనకంగా ఉందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలోని ప్రజలు ఆశించిన మేర బడ్జెట్‌లో కేటాయింపుల్లేవు. కొత్తపల్లి -మనోహరాబాద్ రైల్వేలైన్‌కు నిధుల్లేక నత్తనడకన సాగుతున్నాయి. ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని భావించినప్పటికీ దీని ప్రస్తావనే లేకపోవడంతో ఈ సారి రైలు కూత వినడం కష్టమే అంటున్నారు. 57ఏళ్ల వృద్ధులకు ఆసరా పింఛన్ ఇస్తామని గత బడ్జెట్‌లో ప్రకటించినా ఇప్పటి వరకు దానిపై క్లారిటీ ఇవ్వలేదు. సుమారు జిల్లాలో మరో 30వేల మంది వృద్ధులు ఆసరా పింఛన్ కోసం ఎదురుచూస్తున్నట్టు సమాచారం. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రకటనే లేదు. దీంతో జిల్లాలోని సుమారు 2లక్షల మంది నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సొంత స్థలం ఉన్న వారికి ఇళ్లు నిర్మించుకునేందుకు నిధులు కేటాయించకపోవడంతో వారంత నిరాశలో ఉన్నారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ అంశంపై బడ్జెట్‌లో ప్రతిపాదన లేదు. ఏది ఏమైనా జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంతో జిల్లా ప్రజలు రాష్ట్ర బడ్జెట్‌పై పెదవి విరుస్తున్నారు.
వ్యవసాయానికి పెద్దపీట..
గతంలో హామీ ఇచ్చిన మేరకు రూ.లక్షలోపు రుణం ఉన్న రైతులందరికీ విడుతల వారీగా రుణం మాఫీ చేస్తామని ప్రకటించడం, రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయ యంత్రీకరణ పనిముట్ల కోసం బడ్జెట్లో రూ.25వేల కోట్లు కేటాయించారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని సుమారు నాలుగు లక్షల రైతులకు ప్రయోజనం చేకూరనుంది. అంతేగాకుండా గత బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులైన మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మ, ఇతర ప్రాజెక్టులకు నిధులు కేటాయించగా.. ఈసారి సాగునీటి సదుపాయాన్ని మరింత పెంచే లక్ష్యంలో ఉమ్మడి జిల్లాలో కొత్త లిఫ్టులను మంజూరు చేసింది. దుబ్బాక నియోజకవర్గంలో ఎల్లారెడ్డిపేట లిఫ్టును మంజూరు చేసి డీపీఆర్‌ను సైతం సిద్ధం చేసింది. ఇదేకాక సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో సంగమేశ్వర లిఫ్టు, నారాయణఖేడ్‌లోని బసవేశ్వర లిప్టుకు డీపీఆర్‌లు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటికి నిధులు కేటాయించి పూర్తిచేయనుంది. మొత్తానికి వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విద్యా రంగానికి తక్కువ నిధులు..
ప్రతి యేటా ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ను పెంచుతూ విద్యా రంగానికి తక్కువ నిధులు కేటాయిస్తుంది. 2014లో 10.89శాతం నిధులు కేటాయించగా ఈసారి మొత్తం బడ్జెట్‌లో విద్య రంగానికి 5.89శాతం మాత్రమే నిధులు కేటాయించింది. దీన్ని బట్టి ప్రభుత్వానికి విద్యారంగం మీద ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్ధమవుతుంది. ఉద్యమానికి ఊపిరి పోసిన ఓయూ, కేయూలకు ఒక్క పైసా కేటాయించకపోవడం బాధాకరం. త్వరలోనే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర బడ్జెట్‌ను నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం. – అరవింద్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
అభివృద్ధి నిరోధక బడ్జెట్..
ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ప్రత్యేక నిధులు కేటాయించారే తప్ప .. రాష్ట్రంలోని మిగతా మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు కేటాయించలేదు. ఇది పక్కాగా అభివృద్ధి నిరోధక బడ్జెట్. విద్య, వైద్య రంగానికి తక్కువ నిధులు కేటాయించారు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, విద్యార్థుల భవిష్యత్ పై ఎంత శ్రద్ధ ఉందో ఇట్టే అర్ధమవుతుంది.
– తుమ్మనపల్లి శ్రీనివాస్, లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు
అంకెల గారడీ బడ్జెట్..
బంగారు తెలంగాణ అంటూనే అప్పుల తెలంగాణగా మార్చారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ పూర్తిగా అంకెల గారెడీ బడ్జెట్. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు. నిరద్యోగ భృతి ప్రకటించలేదు. డబుల్ బెడ్రూంలకు ఇచ్చే నిధులు ఏమాత్రం సరిపోవు. ఇళ్ల స్థలాల ఊసేలేదు. అరకొర నిధులతో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. అప్పులు ఎలా తీరుస్తారో బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. – మంద పవన్, సీపీఐ జిల్లా కార్యదర్శి