సీఎం వద్దకు ఫైల్.. తెలంగాణలో త్వరలో ఉద్యోగాలు..!

by Anukaran |   ( Updated:2021-06-05 11:04:32.0  )
సీఎం వద్దకు ఫైల్.. తెలంగాణలో త్వరలో ఉద్యోగాలు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అడుగులు పడుతున్నట్లు అవుతోంది. జోనల్‌ వ్యవస్థలో రాష్ట్రపతి ఉత్తర్వులకు చేపట్టిన సవరణలు త్వరలో అమలులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన ఫైల్‌ సీఎం కేసీఆర్‌ వద్దకు వెళ్లింది. ఫైల్‌పై సంతకం చేయగానే సవరణ ఉత్తర్వులను అమల్లోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేస్తుంది. అప్పటి నుంచి జోనల్‌ వ్యవస్థలో చేపట్టిన సవరణలు అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం గతంలో 31 జిల్లాలకు ఉన్న జోనల్‌ ఉత్తర్వులు 33 జిల్లాలకు వర్తిస్తాయి.

2018 ఎన్నికల తరువాత ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేయడంతో పాటుగా గతంలో జోగులాంబ జోన్‌లో ఉన్న వికారాబాద్‌ జిల్లాను చార్మినార్‌ జోన్‌లో కలుపుతూ సవరణలు చేశారు. దీనికి రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. గతంలో స్థానికతను 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏడేండ్ల కాలంలో నాలుగేండ్లు ఎక్కడ చదివితే అదే లోకల్​గా నిర్ధారించేవారు. ప్రస్తుతం సవరించిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఒకటి నుంచి 7వ తరగతి వరకు రాష్ట్రంలోనే చదివి ఉంటేనే రాష్ట్ర లోకల్​గా నిర్ధారిస్తారు. ఇదే జిల్లాలకు కూడా వర్తిస్తోంది. జోన్ల మార్పులు, రెండు కొత్త జిల్లాలతో పాటు వీటన్నింటికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఫైల్‌ పంపించగా… పరిశీలించిన కేంద్రం సవరణ ఉత్తర్వులను ఆమోదిస్తూ గెజిట్‌ విడుదలచేసిన విషయం తెలిసిందే.

సీఎంకు ఫైల్​

తాజాగా ఈ ఫైల్​ సీఎంకు చేరింది. ఈ ఫైల్‌పై సీఎం సంతకం చేసి గెజిట్‌ విడుదలవగానే నూతన జోనల్‌ వ్యవస్థ అమల్లోకి రానుంది. దీనికి ప్రభుత్వం జీవోలు జారీ చేయనుంది. ఆ తర్వాత స్థానికతను ఆధారంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియన మొదలుకానుంది. కొత్త జోనల్‌ వ్యవస్థలో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు, 5 శాతం ఓపెన్‌ క్యాటగిరీని పొందుపరిచారు. 5 శాతంలోనూ తెలంగాణ నిరుద్యోగ యువత పోటీపడవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో ఓపెన్‌ కోటా 20, 30, 40 శాతాలుగా ఉంచి తెలంగాణ యువతకు ఉద్యోగాలు దక్కకుండా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫైల్​ సీఎం దగ్గర నుంచి వస్తే మన కొలువులు మనకే దక్కనున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులకు చేపట్టిన సవరణలు త్వరలోనే అమల్లోకి రానున్నాయి.

కమిషన్‌లో ఖాళీలు

ఇక తెలంగాణ పబ్లిక్ కమిషన్‌లో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. ఒక విధంగా కమిషన్‌‌కు పూర్తిస్థాయి పాలకవర్గం నియమించారు కానీ… ఉద్యోగాల భర్తీ మాత్రం చేయడం లేదు. కమిషన్‌లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫైల్‌‌ను కూడా కొద్ది నెలల కిందటే సీఎంకు పంపించారు. టీఎస్​పీఎస్సీలో ముందుగా ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు. అయితే సీఎం నుంచి ఫైల్​ తిరిగి రాలేదు. అయితే ప్రస్తుతం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను త్వరలో చేపట్టనుననట్లు టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్దన్​రెడ్డి ఇటీవల ప్రకటించారు. దీనిలో ముందుగా టీఎస్​పీఎస్సీలో ఖాళీలను భర్తీ చేయాలంటూ సీఎంకు మరోసారి గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీపీఎస్సీ నుంచి టీఎస్​పీఎస్సీకి 128 మంది ఉద్యోగులు అలాట్ చేయగా… చాలా పోస్టులను అప్​గ్రేడ్​ చేశారు. ఆ తర్వాత కిందిస్థాయిలో కేడర్ స్ట్రెంత్‌ను భర్తీ చేయడం లేదు.

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, అటెండర్ల విభాగాల్లో పోస్టులన్నీ దాదాపుగా ఖాళీ ఉన్నాయి. ప్రస్తుత వివరాల ప్రకారం 165 మంది కేడర్ స్ట్రెంత్​ ఉండాల్సి ఉండగా… రెగ్యులర్ ఉద్యోగులు 82 మంది మాత్రమే ఉన్నారు. దాదాపు 60 మందికిపైగా కాంట్రాక్ట్​ సిబ్బంది పని చేస్తున్నారు. కానీ కీలకమైన స్థానాల్లో 75 పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు ఇప్పటి వరకు ప్రక్రియను కూడా మొదలుపెట్టడం లేదు.

అదే విధంగా కమిషన్‌లో ప్రస్తుతం సెక్రెటరీ వాణీప్రసాద్ ఉండగా… ఉన్నతస్థాయిలో ఇద్దరు అడిషనల్ సెక్రెటరీలు, ఐదుగురు డిప్యూటీ సెక్రెటరీలు, 10 మంది అసిస్టెంట్ సెక్రెటరీలు ఉన్నారు. అయితే ఉద్యోగాల భర్తీ చేసే కమిషన్ కావడంతో… పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, దీనికోసం ముగ్గురు జాయింట్ సెక్రెటరీలు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై ముందుగా ప్రభుత్వం కూడా ఒకే చెప్పింది. ముగ్గురు జాయింట్​ సెక్రెటరీలు అవసరమని, దానికి ఆమోదం కూడా తెలిపింది. కానీ నియామకంలో మాత్రం ఉత్తిచేయి చూపిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫైల్‌ను కూడా సీఎంకు మరోసారి పంపించేందుకు సిద్ధం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed