నిలిచిపోయిన జియో ఫోన్ నెక్ట్స్ .. ఎందుకంటే

by Harish |
jio
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అత్యంత ఆసక్తికరంగా మారిన రిలయన్స్ జియో నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్‌ విడుదల వాయిదా పడింది. ఇదివరకు వినాయకచవితి సందర్భంగా విడుదల చేయనున్నట్టు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అత్యంత చౌక ధరలో, అధునాతన ఫీచర్లతో జియో నెక్స్ట్ తీసుకొస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ భాగస్వామ్యంతో విప్లవాత్మకంగా జియో తీసుకొస్తున్న మొదటి స్మార్ట్‌ఫోన్ కావడంతో మొబైల్ మార్కెట్లో సైతం ఆసక్తి నెలకొంది. అయితే, అనుకోని పరిస్థితుల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను దీపావళికి తీసుకురావాలని నిర్ణయించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

గూగుల్ అందించే సరికొత్త ఫీచర్లను జియో నెక్స్ట్ ఫోన్‌లో అందించనున్నారు. ఇదివరకే ఈ స్మార్ట్‌ఫోన్ పనితీరును పరిశీలించారు. గత కొంతకాలంగా దేశీయ మార్కెట్లో చిప్‌ల కొరత కారణంగా అనుకున్న సమయానికి స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావడం ఆలస్యమైనట్టు ఇరు కంపెనీలు పేర్కొన్నాయి. దీంతో జియో నెక్స్ట్ ఫోన్‌ను దీపావళికి వాయిదా వేశాయి. ప్రస్తుత ఏడాది రిలయన్స్ సంస్థ వార్షిక సమావేశంలో జియో నెక్స్ట్ ఫోన్ ప్రకటన తర్వాత చాలామందిలో ఆసక్తి నెలకొంది. మొదటి ప్రయత్నంలో ఏకంగా 10 కోట్ల మందికి జియో నెక్స్ట్ ఫోన్‌ను చేర్చాలనే లక్ష్యాన్ని నిర్దేశించినట్టు ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు. దీనికోసం ఈ ఫోన్ కొనాలనుకునే వారు రూ. 500 చెల్లించి మిగిలిన మొత్తాన్ని నెలవారీ కంతుల రూపంలో చెల్లించాలని తెలిపింది. దీనికోసం పలు ఆర్థిక సంస్థలు సైతం ఫైనాన్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ఈ ఫోన్ లాంచింగ్ వాయిదా పడింది.

Advertisement

Next Story