ఫేస్‌బుక్‌‌ పై సీఎం వందకోట్లకు దావా

by Anukaran |   ( Updated:2020-08-08 07:44:05.0  )
ఫేస్‌బుక్‌‌ పై సీఎం వందకోట్లకు దావా
X

దిశ, వెబ్‌డెస్క్: తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కోర్టులో దావా వేశారు. ఈ పిటిషన్‌లో బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబె పై ఫిర్యాదు చేసిన హేమంత్.. అతడికి సహకరించిందని ప్రతివాదిగా సోషల్ మీడియా అగ్ర వేదిక ఫేస్‌బుక్‌(ఇండియా)ను చేర్చారు. అయితే, తన పరువుకు భంగం కలిగించారని హేమంత్ సోరెన్ ఏకంగా 100 కోట్ల పరువు నష్టం దావా వేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసు విచారణ ఆగస్టు 5న ప్రారంభమైంది. కాగా, తదుపరి విచారణ ఆగస్టు 22న జరుగనుంది.

ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై గోడ్డా నియోజక వర్గానికి చెందిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబె ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు చేస్తుండేవారు. ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా పలు అంశాలను లేవనెత్తేవారు. ఇందులో భాగంగానే 2013లో హేమంత్ సోరెన్ ముంబయిలో ఓ మహిళను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన హేమంత్ సోరెన్ న్యాయస్థానంలో తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే రాంచీ సివిల్ కోర్టులో రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పిటిషన్‌లో తెలుపుతూనే.. అతడి అసత్య ప్రచారానికి ఫేస్ బుక్, ట్విట్టర్ అడ్డుకట్టవేయాలేకపోయాయని వివరించారు. దీంతో ప్రతివాదిగా ఫేస్‌బుక్‌ను చేర్చుతూ హేమంత్ సోరెన్ దావా వేయడం గమనార్హం.

Advertisement

Next Story