తెరపై ఫ్యాక్షనిజానికి ప్రాణం పోసింది తనే..

by  |
తెరపై ఫ్యాక్షనిజానికి ప్రాణం పోసింది తనే..
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు ఇండస్ట్రీ అద్భుత నటుడిని కోల్పోయింది. తన సహజ అభినయంతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన జయప్రకాష్ రెడ్డి ఇక లేరు. నాటకరంగం, సినిమా రంగాన్ని రెండు కళ్లుగా భావించే జయప్రకాష్ రెడ్డి.. కెరియర్‌లో ఎన్నో పాత్రలకు తనదైన నటనతో ప్రాణం ప్రోశారు. సినిమాల్లో ఫ్యాక్షనిజంతో ప్రేక్షకులను భయపెట్టిన తానే.. కమెడియన్‌గానూ కితకితలు పెట్టాడు. పాత్ర ఏదైనా సరే ఇట్టే లీనమైపోయే ఆ విలక్షణ నటుడు లేరన్న బాధ తమను తొలచివేస్తుందని.. తనలాంటి గొప్ప నటుడితో పనిచేయడం పూర్వజన్మ సుకృతం అంటూ.. తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ప్రముఖులు.

ఆ అవకాశం పొందలేకపోయా : చిరు

సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటని అన్నారు చిరంజీవి. తనతో ‘ఖైదీ నం. 150’ సినిమాలో చివరిసారిగా నటించానని.. ఆయన గొప్ప నటుడని కీర్తించారు. ‘నాటకరంగం నన్ను కన్న తల్లి.. సినిమా రంగం నన్ను పెంచిన తల్లి’ అనేవారని గుర్తు చేసుకున్నారు. అందుకే ఇప్పటికీ శని, ఆదివారాల్లో షూటింగ్‌లు పెట్టుకోనని.. స్టేజ్ మీద పర్‌ఫార్మెన్స్ ఇస్తానని.. మీరెప్పుడైనా రావాలని అడిగేవారని తెలిపారు చిరు. ఆ అవకాశాన్ని నేను పొందలేకపోయానని బాధపడ్డారు. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది జయప్రకాశ్ రెడ్డి అని.. తనకంటూ ఒక ప్రత్యేకమైన ట్రెండ్ సృష్టించుకున్నారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్న చిరు.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

పదిమందికి సహాయం చేయాలనే తత్వం : మోహన్ బాబు

జయప్రకాష్ రెడ్డి మరణవార్త తనను ఎంతగానో బాధించిందన్నారు మోహన్ బాబు. మా శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌లో ఎన్నో మంచి పాత్రలు చేశారని, నటుడిగా జయప్రకాష్ రెడ్డి బిజీగా ఉన్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన నాటక రంగాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ నాటకాల్లో పాత్రలు పోషిస్తూ ఉండేవారని తెలిపారు. పదిమందికి సహాయం చేయాలనే వ్యక్తి జయప్రకాష్ రెడ్డి అని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నానని తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

మాది విశిష్టమైన బంధం : బాలకృష్ణ

జయప్రకాష్ రెడ్డి తనకు అత్యంత ఆత్మీయులన్నారు నందమూరి బాలకృష్ణ. సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు లాంటి ఎన్నోవిభిన్న చిత్రాల్లో కలిసి నటించామని గుర్తు చేసుకున్నారు. రంగస్థలం నుంచి వచ్చిన ఆయన.. సినిమా రంగాన్ని, నాటక రంగాన్ని రెండు కళ్లుగా భావించేవారని.. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సరే నాటకాలు ప్రదర్శించేవారని తెలిపారు. మా ఇద్దరి మధ్య ఎంతో విశిష్టమైన అనుబంధం ఉందన్న బాలయ్య.. ఆయన లేరనే వార్త దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన బాలయ్య.. వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని, జయప్రకాశ్ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు.

మా కాంబినేషన్ గొప్పది : వెంకీ
ప్రియమైన స్నేహితుడు జయప్రకాష్ రెడ్డి మరణం తనను కలిచివేసిందన్నారు వెంకటేష్. స్క్రీన్ మీద మా కాంబినేషన్‌ చాలా గొప్పగా ఉండేదని.. తనను తప్పకుండా మిస్ అవుతామని తెలిపారు. ఆయన ఎక్కడున్నా ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

https://www.instagram.com/p/CE3MaxRB8Um/?igshid=11yjydosor0ti

ఆయన ప్రతిభ ఆశ్చర్యపరిచేది : అల్లు అర్జున్

జయప్రకాష్ రెడ్డి మరణంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ అద్భుత నటుడిని కోల్పోయిందన్నారు అల్లు అర్జున్. తన ప్రతిభను చూసి ఎప్పుడూ ఆశ్చర్యపోయేవాడినని.. ప్రత్యేకమైన గొంతు, గొప్ప జ్ఞాపకశక్తి ఆయన సొంతమని తెలిపారు. తను ఎప్పుడూ థియేటర్ ఆర్టిస్టులకు సపోర్ట్ చేసేవాడని.. తనను కూడా రిక్వెస్ట్ చేశాడని తెలిపారు. తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించిన అల్లు అర్జున్.. తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.


Next Story

Most Viewed