దేశ విదేశాల్లో జంతికల భారతమ్మకు ప్రత్యేక స్థానం 

by  |
దేశ విదేశాల్లో జంతికల భారతమ్మకు ప్రత్యేక స్థానం 
X

“నెసెస్సిటీ ఈజ్ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్” ఈ సూక్తి భారతమ్మకు సరిపోతుంది. ఒకనాడు కల్యాణ మండపంలో శుభ్రం చేసే పని మనిషి. పేదరికంతో కన్నీళ్లు పెట్టుకోలేదు. చదువు లేదు. మొక్కవోని మనో ధైర్యంతో ముందుకు సాగింది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు. అన్నింటినీ ఒంటి చేత్తో అధిగమించింది. బిడ్డలను ఎక్కదీసింది. కష్టాల్లో అక్కున చేర్చుకుంది. నేడు పది మందికి ఆదరువునిస్తోంది. మారుమూల ప్రాంతంలో జంతికలు అమ్ముకునే భారతమ్మ నేడు దేశ విదేశాల్లో తనకంటూ ఓ స్థానాన్ని నిలబెట్టుకుంది. భారతమ్మ చేతి వంటకం అంత రుచికరమైంది. జిల్లాలు, రాష్ట్రాలు దాటి ఇతర దేశాలకూ భారతమ్మ జంతికలు వెళ్తుంటాయి. ఒక్కసారి ఆమె జీవితంలోకి తొంగి చూస్తే..

అది మొగిలి గ్రామం. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని చిన్న పల్లెటూరు. ఎప్పుడు చూసినా ఆ దుకాణం మందు వాహనాలు బారులు తీరి ఉంటాయి. భారతమ్మ వండే జంతికల కోసం క్యూ కట్టి ఉంటాయి. హైదరాబాద్లో పుల్లారెడ్డి స్వీట్స్.. ఒంగోలులో అల్లూరయ్య స్వీట్స్లాగా భారతమ్మ వండే జంతికలు అంత ప్రాచుర్యం ఉంది. అటు బెంగళూరు వెళ్లేవాళ్లు, ఇటు చెన్నై వెళ్లే వాళ్లు పార్శలు కట్టించుకుపోతుంటారు. ఎవరింటికి వెళ్లినా మర్యాద కోసం జంతికలు పట్టుకెళ్లడం విశేషం. ఇలా రాష్ట్రాల సరిహద్దులు దాటి అమెరికా, కువైట్, అరేబియా, లండన్లాంటి ప్రవాసాంధ్రులకూ భారతమ్మ జంతికలు చేరుతుంటాయి.

భారతమ్మకు ఐదుగురు సంతానం. ఓ కొడుకు మానసిక వికలాంగుడు. మిగతా పిల్లలతో రెక్కలు ముక్కలు చేసుకుంటూ భార్యాభర్తలు కల్యాణ మండపంలో పనిచేసేది. వాళ్ల బాధలు చూడలేక యజమాని రూ.130 ఇచ్చి టీ కొట్టు పెట్టుకోమన్నాడు. భర్త రాజన్న టీ పెడితే.. భారతమ్మ జంతికలు వండి అమ్మేది. ఇది మూడున్నర దశాబ్దాల కిందటి సంగతి. నాడు ఒక్కోటి అర్థరూపాయి. టీ కోసం వచ్చేవాళ్ల కన్నా భారతమ్మ చేసే మురుకుల కోసం వచ్చే వాళ్లే ఎక్కువయ్యారు. అలా వచ్చిన ఆదాయంతో ముగ్గురు ఆడపిల్లల పెళ్లిళ్లు చేసింది.

అంతటితో ఆమె కష్టాలు తీరలేదు. ఓ అమ్మాయి అనారోగ్యంతో చనిపోయింది. మిగతా ఇద్దరు ఆడపిల్లలు పసుపు కుంకుమలు పోగొట్టుకొని వస్తే తానున్నాని అక్కున చేర్చుకుంది. వాళ్లనీ అదే పనిలో పెట్టింది. ఐదేళ్ల క్రితం ఎదిగొచ్చిన కొడుకూ అకాల మరణం చెందాడు. అయినా కుంగిపోలేదు. ఇంకిన కన్నీళ్లు భారతమ్మలో మరింత మానవతను ప్రోది చేశాయి. కష్టాల్లో ఉన్నామని వచ్చిన వాళ్లకు ఆదరువుగా నిలిచింది. మరో పది మందికి ఉపాధినిస్తోంది. మురుకులతోపాటు పాకం ఉండలు తయారీలో మెళకువలు నేర్పింది. ఒక్కొక్కరికి నెలకు ఆరు వేల వేతనం, ఉచిత భోజనం, వసతి కల్పించింది.

ఇప్పుడు మనవళ్లు ఎదిగొచ్చారు. మంచి చదువులతో జీవితంలో సెటిలయ్యారు. అయినా భారతమ్మ జంతికలను వదల్లేదు. ఒక్కో మురుకు ఐదు రూపాయలు. పాకం పప్పుండ పది రూపాయలు. కొంచెం ధర ఎక్కువయినా ఆ రుచికి ఫిదా అయిపోవాల్సిందే. ఇంకెంత కాలం కష్టపడతావని భారతమ్మను పలకరిస్తే.. “ ఒకనాడు ఏమీ లేదు. చివరకు తీసుకెళ్లేదీ ఏమీ ఉండదు. ఒంట్లో ఓపికున్నన్నాళ్లూ పనిచేస్తుంటేనే హాయిగా ఉంటది నాయనా! నా చేతి వంట ఇంత మందికి నచ్చిందంటే.. ఏదో ఆ మొగిలేశ్వర సామి దయ! పది మందికి దారి చూపిస్తే ఆ సామి చల్లగా చూస్తాడు !’’ అంటూ అరవై ఐదేళ్ల భారతమ్మ జీవిత పరమార్థాన్ని ఎంత బాగా చెప్పిందో.. హ్యాట్సాఫ్ టూ యూ బామ్మ!


Next Story

Most Viewed