కొత్తగా వచ్చిన వారికి మంత్రి పదవులు :ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

by Shyam |
కొత్తగా వచ్చిన వారికి మంత్రి పదవులు :ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
X

దిశ, జ‌న‌గామ‌: జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌లో తాను కొన్నేళ్లుగా ఎంతో కష్టపడి పని చేస్తున్నానని తెలిపారు. పార్టీలోకి నిన్న, మొన్న వ‌చ్చిన వారికి మంత్రి పదవులు వచ్చినా తాను ఎలాంటి గొడవ పడలేదన్నారు. సీఎం కేసీఆర్‌.. కార్యకర్తలు, నేతలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చి ఏ సమస్యకైనా పరిష్కారం చూపుతారంటూ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హమన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి త‌న అసంతృప్తిని తెలియ‌జేస్తునే మ‌రోవైపు కేసీఆర్‌పై న‌మ్మకం ఉంద‌ని, ప‌నిచేసే వారికి న్యాయం చేస్తార‌ని కార్యక‌ర్తల‌ను ఉద్దేశించి పేర్కొన‌డం విశేషం.

జ‌న‌గామ జిల్లా స‌భ్యత్వ న‌మోదు కార్యక్రమ‌ ఇంచార్జ్ మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవితతో కలిసి నియోజకవర్గ స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌లో కార్యకర్తలకు సముచితమైన ప్రాధాన్యాన్ని కల్పించేందుకు అధిష్టానం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇక నుంచి పార్టీ శ్రేణులు చెప్పిందే వేదమని తెలిపారు. ఇకపై గ్రామాలు, పట్టణాలలో పార్టీ కార్యకర్తలు సూచించిన వారికే ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల మంజూరు జరుగుతుందన్నారు. తాను కూడా కార్యకర్తల ప్రాధాన్యం కోసం ఇదే పద్ధతిని అవలంభిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సూర్యచంద్రులు ఉన్నంత వరకూ టీఆర్‌ఎస్‌ పార్టీ బతికే ఉంటుందని, రెండు దశాబ్దాల తరువాత కేసీఆర్‌ తదనంతరం సీఎం పగ్గాలు చేపట్టేందుకు పార్టీలో సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడని అన్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed