తెలంగాణలో అనధికారిక కర్ఫ్యూ.. నిర్మానుష్యం

by Shyam |   ( Updated:2020-03-21 21:18:31.0  )
తెలంగాణలో అనధికారిక కర్ఫ్యూ.. నిర్మానుష్యం
X

తెలంగాణలో జనతా కర్ఫ్యూ ఉదయం 6 గంటలకే ఆరంభమైంది. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో హైదరాబాద్‌‌లో అనధికార కర్ఫ్యూ అమలవుతోంది. ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం పూట వాకర్లతో నిత్యం రద్దీగా ఉండే నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాలు వెలవెలబోయాయి.

వేకువ జామునే మార్నింగ్ షిఫ్ట్‌లకు హాజరయ్యే ఉద్యోగులతో రోడ్లు బిజీగా కనిపించేవి. జనతా కర్ఫ్యూ విజయవంతం చెయ్యాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, సెలబ్రిటీలు, వైద్యులు అంతా పిలుపునివ్వడంతో రోడ్లపై వాహనాలు కనిపించడం మానేశాయి. టీఎస్ ఆర్టీసీ సూచనల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, మెట్రో రైళ్లు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో నిత్యం రద్దీగా కనిపించే ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

తెలంగాణలో ఆస్పత్రులు, మెడికల్‌ షాపులు, పాలు, పండ్లు, కూరగాయాలు, పెట్రోల్‌ బంకులకు మినహాయింపునివ్వడంతో వేకువ జామున పత్రికలు, పాల వ్యాపారులు మాత్రం అక్కడక్కడ కనిపించారు. వార్తల కవరేజీలో బిజీగా ఉండే మీడియా ప్రతినిధులు నిర్మానుష్య కూడళ్ల ఫోటోలు, వీడియోలు తీస్తూ కనిపించారు. అంబులెన్స్‌లు, ఫైర్‌ సర్వీస్, విద్యుత్, నీటి సరఫరా, సీవరేజీ సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది మాత్రం విధుల్లో కొనసాగుతున్నారు. అయినప్పటికీ వారు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు.

కరోనా ఆందోళన నేపథ్యంలో అత్యవసర సేవల నిమిత్తం ప్రతి ఆర్టీసీ డిపోలో 5 బస్సులు సిద్ధంగా ఉన్నాయి. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. మెట్రోను నిలిపివేసినప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో రవాణా కోసం ఉపయోగించేందుకు మెట్రో స్టేషన్లలో 5 మెట్రో రైళ్లు సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణలో జనతా కర్ఫ్యూని విజయవంతం చేసేందుకు అంతా ప్రయత్నిస్తున్నారు.

Tags: janata curfew, telangana, hyderabad, emergency services, tsrtc, metro, empty roads

Advertisement

Next Story

Most Viewed