సిరిసిల్ల జిల్లాలో మళ్లీ ‘జనశక్తి’?

by  |
సిరిసిల్ల జిల్లాలో మళ్లీ ‘జనశక్తి’?
X

దిశ, సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లాలో మళ్లీ జనశక్తి పార్టీ కదలికలు వెలుగులోకి వచ్చాయి. చందుర్తి మండలం బండపల్లి, రాంరావుపల్లి, సనుగుల, కిష్టంపేట గ్రామాల్లో సీపీఐ ఎం‌ఎల్‌ జనశక్తి పేరుతో బుధవారం ఎర్రజెండాలు, వాల్ పోస్టర్లు వెలిశాయి. వాటిని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు అక్కడికి గ్రామానికి చేరుకుని ఎర్రజెండాలు, వాల్ పోస్టర్లను తొలగించారు. ఎవరు పెట్టారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

15 ఏండ్లుగా సైలెంట్..

జనశక్తి ప్రాబల్య ప్రాంతంగా పేరుగాంచిన చందుర్తి మండలంలో పదిహేనేళ్లుగా జనశక్తి, పీపుల్స్ వార్ కదలికలు లేవు. గతంలో ఆయా గ్రూపుల్లో పని చేసిన సానుభూతిపరులు ప్రస్తుతం ఎవరి పనివారు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చందుర్తి మండలంలోని నాలుగు గ్రామాల్లో జనశక్తి జెండాలు, వాల్ పోస్టర్లు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. పదిహేనేళ్ల క్రితం వరకు జిల్లాలోని చందుర్తి, ప్రస్తుత రుద్రంగి మండలాల్లో జనశక్తి, పీపుల్స్ వార్ సాయుధ దళాలు తమ కార్యక్రమాలు నిర్వహించాయి.

పీపుల్స్ వార్ నక్సల్స్ పార్టీ దళాలు ప్రస్తుత రుద్రంగి మండలం మానాల ప్రాంతంలో తమ కార్యక్రమాలు నిర్వహించగా, చందుర్తి మండలం సనుగుల, రాంరావుపల్లి, లింగంపేట, బండపల్లి ప్రాంతాల్లో జనశక్తి సాయుధ దళాలు తమ కార్యక్రమాలు నిర్వహించాయి. 2000 సంవత్సరం వరకు మారుమూల గ్రామాలు పూర్తిగా నక్సల్స్‌ ఆధీనంలో ఉండేవి. రాజకీయ నాయకులతో సహా పోలీసులు, అధికారులు గ్రామాలకు వెళ్లడానికి బయపడేవారు. రాత్రి నక్సలైట్ల ప్రజా కోర్టులు, ఉదయం పోలీసుదాడులు సర్వసాధారణంగా ఉండేవి. యువకులు గ్రామాల్లో ఉండలేక వలసబాట పట్టారు. గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లారు.

2001లో సాధారణ పరిస్థితులు

2001 నుంచి గ్రామాల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సల్స్‌ మీద నిషేధం ఎత్తివేసి చర్చలు జరిపింది. చర్చల సమయంలో జనశక్తి దళకమాండర్ రణధీర్ అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 26 మంది దళ సభ్యులతో లొంగిపోయారు. ఆ తర్వాత నక్సల్స్‌ ప్రభావం కనిపించలేదు.

నక్సలైట్లా? నకిలీలా?

చందుర్తి మండలంలోని నాలుగు గ్రామాల్లో జెండాలు పెట్టిన వారు అసలు నక్సలైట్లా? నకిలీలా అనేది ప్రశ్నగా మారింది. జనశక్తి నక్సలైట్ల పేరిట జెండాలు, వాల్ పోస్టర్లు వెలియడంతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సనుగుల, బండపల్లి, రాంరావుపల్లి, లింగంపేట గ్రామాల్లో ఒకప్పుడు పీపుల్స్‌వార్‌, జనశక్తి కార్యకలాపాలకు పెట్టని కోటగా ఉండేది. పదిహేనేళ్ల తర్వాత గ్రామంలో జెండాలు, వాల్ పోస్టర్లు వెలవడంతో మాజీల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.


Next Story