బీజేపీ వల్లే ఓడిపోయాం : జనసేన నేత ఆరోపణలు

by srinivas |
Janasena party spokesperson pothina Mahesh
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో జనసేన-బీజేపీల మధ్య వివాదం రాజుకుంటుంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఈ విభేదాలు బయటపడ్డాయి. ఏపీలో జనసేన కీలక నేత పోతిన మహేశ్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ వల్ల తాము ఘోర ఓటమిని చవిచూసినట్లు ఆరోపించారు. విజయవాడలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీతో పొత్తు వల్ల ముస్లిం ఓటర్లు జనసేనకు దూరమైనట్లు వెల్లడించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని అమరావతి ఉండాలని అన్ని రాజకీయపార్టీలు ప్రకటించాయన్నారు. అలాంటప్పుడు ఈ రెండో చోట్ల ఎన్నికలను అంత సీరియస్‌గా ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

అమరావతి రాజధానిని వ్యతిరేకించినవాళ్లకు ఓటు వేయొద్దని ఎందుకు పిలుపునివ్వలేదని ఆయన నిలదీశారు. దీనికి వారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కడికి వెళ్లినా ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు తమను వ్యతిరేకించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పశ్చిమ నియోజకవర్గంలో గెలుస్తామనుకున్న స్థానాల్లో ఓడిపోయినట్లు వెల్లడించారు. విజయవాడలో బీజేపీ తమకు అండగా నిలవలేదని పోతిన మహేష్ ఆరోపించారు. బీజేపీతో పొత్తుపై జనసేన పార్టీ కార్యకర్తలు రోజు రోజుకు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో భవిష్యత్ లో పొత్తు కటీఫ్ అయ్యే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.

Advertisement

Next Story