‘ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు సిద్ధం చేయండి’

by  |
‘ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు సిద్ధం చేయండి’
X

దిశ ఏపీ బ్యూరో: వచ్చే ఖరీఫ్ సీజన్ కల్లా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అమరావతి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు పండించిన పంటను అమ్ముకునేందుకు కష్ట పడకూడదని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహిస్తే రైతుకు లబ్ది కలుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఏపీలో పండే పంటలు ప్రాసెస్ చేసే పరిశ్రమల గురించి అధ్యయనం చేయాలని సూచించారు.

అరటి, చీనీ, టమోటా రైతులు ప్రతి ఏటా ఆందోళన చెందుతున్నారని జగన్ చెప్పారు. పండిన పంటలకు కనీస గిట్టుబాటు ధర రాక తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడాలంటే వారి పంటలను ఏ మేరకు కొనుగోలు చేయాలి? ఏ మేర ఫుడ్ ప్రాసెసింగ్‌కు తరలించాలన్నదానిపై స్ఫష్టమైన సమాచారం కావాలని ఆయన అధికారులను అడిగారు. ఇందుకోసం ఎంత ఖర్చవుతుందన్నది ఆలోచించకూడదని జగన్ అధికారులకు చెప్పారు. రైతుల సమస్యలను పరిష్కరించగలిగే స్పష్టమైన పరిష్కారం వెతకాలని అధికారులను ఆదేశించారు.

నీళ్లందక పంట సమయంలో పాడైపోయిందన్న ఫిర్యాదులు ప్రతి ఏటా అరటి, చీనీ, టమోటా, ఉల్లి, నిమ్మలాంటి రైతుల నుంచి వస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. ఈ కష్టాలు కడతేరాలని ఆయన అధికారులకు సూచించారు. మరోసారి రైతుల కష్టాలు వినిపించకుండా ప్రణాళికలు రచించాలన్నారు. కేవలం ప్రధాన పంటలపైనే దృష్టిపెట్టకుండా, చిరు ధాన్యాలపై కూడా దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో ప్రఖ్యాత కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోవాలని తెలిపారు.

ప్రతి ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో ఇబ్బందులు వస్తున్న 7–8 పంటలను గుర్తించాలని ఆయన అధికారులను ఆదేశించారు. తద్వారా ఆ పంటలను ప్రాసెసింగ్‌ చేసి, వాల్యూ ఎడిషన్‌ ఎలా చేయగలమో ఆలోచించాలని అధికారులకు వివరించారు. అంతే కాకుండా ఆ పంటల ప్రాసెసింగ్‌కు సంబంధించి ఎక్కడెక్కడ ఏఏ విధానాలు అవలంబిస్తున్నారో తనకు నివేదిక ఇవ్వాలన్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక నెలరోజుల్లో తనముందు ఉంచాలని తేల్చి చెప్పారు. ఆర్బీకే స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ చేయాలని.. మండల, నియోజకవర్గ స్థాయి అంచనాలను తయారు చేయాలని సీఎం జగన్ ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


Next Story

Most Viewed