జనాలు భారీగా వచ్చే అవకాశం ఉంది..ఏర్పాట్లు చేయండి: జగన్

by srinivas |
జనాలు భారీగా వచ్చే అవకాశం ఉంది..ఏర్పాట్లు చేయండి: జగన్
X

లాక్‌డౌన్ సడలింపుతో విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు భారీగా జనాలు వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంచనా వేస్తున్నారు. కరోనా నివారణ చర్యలపై సమీక్ష సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారందర్నీ నేరుగా స్వస్థలాలకు తరలించకుండా క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచి, కరోనా నిర్ధారణ పరీక్షల అనంతరం వారిని పంపాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని క్వారంటైన్ కేంద్రాల సంఖ్యలను, కేంద్రాల్లో సౌకర్యాలను పెంచాలని అధికారులను ఆదేశించారు.

క్వారంటైన్ లో పరిశుభ్రత, భోజనం, సదుపాయాలపై క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. విదేశాల నుంచి వచ్చే వారికి నాన్‌కోవిడ్ సర్టిఫికెట్ ఉంటుందని, వారందరినీ హోం క్వారంటైన్‌కు తరలించాలని జగన్ చెప్పారు. గుజరాత్ నుంచి వచ్చిన మత్స్యకారులకు పూల్ శాంపిల్స్ చెక్ చేసిన ఫలితాల ఆధారంగా ఇళ్లకు పంపించాలని ఆదేశించారు. టెలి మెడిసిన్, విలేజ్ క్లినిక్, పీహెచ్సీల మధ్య సరైన సమన్వయం ఉండాలని ఆదేశించారు. టెలి మెడిసిన్‌కు ఫోన్ చేస్తే ప్రిస్క్రిప్షన్‌తో పాటు విలేజ్ క్లినిక్ ద్వారా మందులు బాధితుల ఇళ్లకు చేరాలని సూచించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,00,997 కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించామని, నిన్న ఒక్కరోజే 7902 పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రతి మిలియన్‌కు 1919 చొప్పున పరీక్షలు నిర్వహిస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 235 క్లస్టర్లు, 79 వెరీ యాక్టివ్‌ క్లస్టర్లు, 68 యాక్టివ్‌ క్లస్టర్లు, 53 డార్మంట్‌ క్లస్టర్లు, 35 క్లస్టర్లలో 28 రోజుల నుంచి కేసులు లేవని అధికారులు వెల్లడించారు. కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన దాదాపు 32,792 మందిలో 17,585 మందికి పరీక్షలు చేశామని, మిగిలిన వారికి 2–3 రోజుల్లో పరీక్షలు పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. వీరిలో 4వేల మంది హైరిస్క్‌ ఉన్నవారిగా గుర్తించినట్లు పేర్కొన్నారు.

కరోనా కారణంగా మరణాలు సంభవించకుండా చూడాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. జిల్లాల వారీగా ప్రత్యేక నంబర్లు కేటాయిస్తున్నామని, హైరిస్క్‌ ఉన్నవారు శ్వాసకోసతో సంబంధిత సమస్యలతోగాని, ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్నవారు ఏమాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే ఈ నంబర్లకు కాల్‌ చేస్తే.. వెంటనే వైద్యం అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. టెలీమెడిసన్, విలేజ్‌ క్లినిక్, పీహెచ్‌సీల మధ్య సరైన సమన్వయం ఉండాలని సూచించారు.

ధాన్యం సేకరణ అన్ని జిల్లాల్లో చురుగ్గా సాగుతోందని ఈ సందర్భంగా జగన్‌కు అధికారులు తెలిపారు. ఒక్క కృష్ణా జిల్లాలో ధాన్యం సేకరిస్తున్న సమయంలో బస్తాకు కొంత ధాన్యాన్ని మినహాయిస్తున్నారంటూ రైతులనుంచి వచ్చిన ఫిర్యాదులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, చీఫ్‌ సెక్రటరీ, సెక్రటరీ, డీజీపీ లాంటి వారంతా ఉన్న జిల్లాలో ఇలా చేయడం ఉపేక్షించదగని అంశం కాదన్నారు. వెంటనే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించించారు. చీనీ, అరటి, టమోటో, మామిడి ప్రాసెసింగ్‌ ప్లాంట్లపై దృష్టి పెట్టాలని సూచించారు.

tags: ysrcp, jagan, high level review meeting, corona

Advertisement

Next Story