లాక్‌డౌన్‌ను మరికొంతకాలం కొనసాగిస్తే మంచిది : సీఎం కేసీఆర్

by Shyam |   ( Updated:2020-04-26 11:58:30.0  )
లాక్‌డౌన్‌ను మరికొంతకాలం కొనసాగిస్తే మంచిది : సీఎం కేసీఆర్
X

దిశ, న్యూస్ బ్యూరో : రాష్ట్రంలో లాక్‌డౌన్ పకడ్బందీగా అమలవుతున్న కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని ముఖ్యమంత్రి కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. మరికొద్ది రోజులు ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించి, కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటిస్తే పరిస్థితి మరింత మెరుగవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. కరోనా వైరస్ సోకినప్పటికీ రాష్ట్రంలో మరణాల రేటు జాతీయ సగటుకన్నా తక్కువ వుందని, ఇది కొంత ఊరటనిచ్చే అంశమని అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ను మరికొంత కాలం ఇదే పద్ధతిలో కొనసాగిస్తూ.. ప్రజలు స్వచ్ఛందంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే రాబోయే రోజుల్లో వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని అన్నారు. సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో దేశ సగటు పరిస్థితి కూడా తెలుస్తుందని వ్యాఖ్యానించారు. తదుపరి చర్యలు ఎలా ఉండాలనే విషయంలో కూడా ఈ కాన్ఫరెన్స్‌లో అభిప్రాయాలు వస్తాయని, తద్వారా భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అన్నారు.

కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ అమలవుతున్న తీరు, కొనసాగుతున్న సహాయక చర్యలు తదితర అంశాలపై కేసీఆర్ ఆదివారం ప్రగతి‌భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో కరోనా వ్యాప్తి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, నిబంధనలు అమలు కావడం పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కంటైన్‌మెంట్ జోన్లలో అమలవుతున్న సహాయక చర్యలపై ఆరాతీశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిత్యావసరాల సరుకులు అందచేయాలని ఆదేశించారు. కరోనా వైరస్ సోకి గాంధి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్ రావు, శాంత కుమారి, రామకృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు.

Tags: Telangana, Corona, CM KCR, Review Meeting, Lock Down Extension

Advertisement

Next Story

Most Viewed