రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్షాలు

by Shyam |
రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్షాలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో రాగల రెండ్రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. పశ్చిమ రాజస్థాన్ మధ్య భాగం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా 7.6కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి ఉన్నదని, దీంతో రాగల రెండ్రోజుల్లో పశ్చిమ దిశగా రాజస్థాన్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ఇక ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా ఆగస్టు 24న మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో తెలంగాణలో సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తుందని పేర్కొన్నారు. మంగళవారం కూడా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story