భారత ఐటీ, ఫార్మా సంస్థలపై పన్నుల భారం తప్పదా!

by Harish |   ( Updated:2021-04-14 05:17:58.0  )
భారత ఐటీ, ఫార్మా సంస్థలపై పన్నుల భారం తప్పదా!
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా ప్రభుత్వం కొత్త లెవీలను విధించాలని నిర్ణయించనుండటంతో అమెరికాలో కార్యకలాపాలను నిర్వహిస్తున్న భారత ఐటీ, ఫార్మా దిగ్గజ కంపెనీలకు పన్నుల భారం పెరగనున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ లాభాలపై బహుళ జాతి సంస్థలు కనీస పన్నును విధించేలా అమెరికా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అంటే, ఇతర దేశాల్లో నిర్దిష్ట పన్ను 28 శాతం కంటే తక్కువ చెల్లించే బహుళజాతి సంస్థలు అంతర్జాతీయ లాభాలపై ‘కనీస పన్ను’ చెల్లించేలా చూడాలని అమెరికా భావిస్తోంది. స్పెషల్ ఎకనమిక్ జోన్స్(సెజ్ ) ద్వారా అమెరికాలో కార్యకలాపాలను కొనసాగిస్తున్న భారత ఐటీ, ఫార్మా కంపెనీలపై ఈ పన్ను భారం తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కొత్త నిబంధనల ప్రకారం.. కంపెనీలు తమ లాభాలపై కనీస పన్ను చెల్లించని ఏ సంస్థ అయినా సరే అమెరికాలో అదనపు పన్నులను చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ఇది అమెరికాలో బ్రాంచ్ లేదా కంపెనీలను కలిగిన భారత ఐటీ, ఫార్మా కంపెనీలపై ప్రభావం ఉండనుంది. అక్కడి ఎక్స్ఛేంజీలో లిస్ట్ అయిన కంపెనీలకు కూడా ఈ భారం తప్పదు. ఈ కంపెనీలు భారత సెజ్‌ల ద్వారా కొనసాగుతున్నాయి. రాయితీలను పొందుతున్నాయి. అందుకే అమెరికాలో అదనపు పన్నులను చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు వివరించారు. కాగా, ఎగుమతులను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం సెజ్‌లను ప్రవేశపెట్టింది. వీటి ద్వారా కార్యకలాపాలను నిర్వహిస్తున్న కంపెనీలకు 50 శాతం నుంచి 100 శాతం వరకు ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇప్పుడు అమెరికా నిర్ణయంతో సెజ్ ద్వారా కొనసాగుతున్న ఫార్మా, ఐటీ కంపెనీలు అంతర్జాతీయ లాభాల నుంచి పన్ను చెల్లించక తప్పదు.

Advertisement

Next Story

Most Viewed