- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడులు సరే.. బార్ల సంగతేంది?
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ‘సెకండ్ వేవ్’ వస్తుందేమోనని వైద్యారోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, విద్యాసంస్థలకు వర్తించిన నిబంధనలు థియేటర్లు, షాపింగ్ మాల్స్, బార్లు, రాజకీయ సభలకు ఎందుకు వర్తించవన్న డిమాండ్ వినిపిస్తోంది. గతేడాది మార్చిలో పాటించినట్లుగా ఇప్పుడు ప్రజలు నిబంధనలను సీరియస్‌గా తీసుకోవడం లేదు. షాపింగ్ మాల్స్, థియేటర్లు, దుకాణాలు, ప్రభుత్వ ఆఫీసులు ,చాలాచోట్ల శానిటైజర్లు అందుబాటులో ఉండడంలేదు.
‘కొవిడ్’ నిబంధనలను పాటించడంలో ప్రజలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో పకడ్బందీగా అమలు చేయించడంలో ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కొవిడ్ నిబంధనలను గాలికొదిలేశాయన్నది బహిరంగ రహస్యం. త్వరలో జరిగే నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికలోనూ అదే రిపీట్ అయ్యే అవకాశం లేకపోలేదు.
షాపులు, ప్రభుత్వ ఆఫీసులు, సినిమా థియేటర్లు, వైన్ షాపులు, బార్‌లు, షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్, రాజకీయ సభలు, సమావేశాల్లో చాలాచోట్ల కొవిడ్ నిబంధనలు పాటించడం లేదు. ప్రజలు సమూహాలుగా ఉండొద్దని పదేపదే జాగ్రత్తలు చెప్పే ప్రభుత్వ పెద్దలే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా పీఆర్సీ ప్రకటించిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు జరిపిన పాలాభిషేకాలు, నేతలకు సన్మానం పేరుతో వందలాది మంది గుమికూడి నిర్వహించిన కార్యక్రమాల పట్ల పోలీసులు, అధికారులు మౌనంగా ఉండిపోయారు.
ప్రభుత్వం సీరియస్‌గా ఉండాలి
‘కొవిడ్’ నిబంధనలు అమలయ్యేలా చూడడం ప్రభుత్వం బాధ్యత. ఆ చిత్తశుద్ధి లేకపోవడంతో మహారాష్ట్రలో ఏమవుతుందో చూస్తున్నాం. బార్లు, వైన్స్ దగ్గర నిబంధనలు అమలుకావడంలేదు. ప్రజలు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ప్రభుత్వం ‘ఎన్‌ఫోర్స్‌మెంట్’ ద్వారా అమలు చేయించాలి. మాస్కు ధరించకుంటే రూ.వెయ్యి ఫైన్ అని రాష్ట్ర ప్రభుత్వం సర్క్యూలర్ జారీచేయాలి. ఇప్పటివరకు ఎన్ని కేసులు ఫైల్ చేసింది? ఎంత మంది నుంచి జరిమానా వసూలు చేసింది? మాస్కు ధరించకపోవడం ఆ వ్యక్తికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. సమాజానికి వర్తించేది. సిటీ బస్సుల్లో కూడా స్టాండింగ్‌లో ప్రయాణిస్తున్నారు. ఇక మాల్స్, హోల్‌సేల్ షాపులు, రాజకీయ మీటింగుల వద్ద పరిస్థితి చూస్తే కరోనా బాంబు పేలుతుందేమోనన్న అభిప్రాయం కలుగుతుంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతోనే పరిస్థితి చేయిదాటిపోతుంది.
– హరీశ్ డాగా, సామాజిక కార్యకర్త
‘సోషల్ డిస్టెన్స్’తో బ్రేక్ కావాలి
విద్యాసంస్థలను బంద్ చేయడంపై ఎలాంటి అభిప్రాయం ఉన్నా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా దగ్గరగా ఉండడం వల్ల వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంటున్నది. విద్యాసంస్థల్లో పిల్లలు పక్కపక్కనే కూర్చోవడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నది. ఆడుకునే వయసులోని పిల్లలకు సోషల్ డిస్టెన్స్ ప్రాధాన్యం తెలియకపోవచ్చు. ఆఫీసులు, ఆస్పత్రులు, మాల్స్, మార్కెట్లు.. ఇలా అనేకచోట్ల కొవిడ్ నిబంధనలు అమలుకావడంలేదు. దాన్ని సీరియస్‌గా పట్టించుకునేవారూ లేరు. వైరస్ ఎప్పుడో పోయింది అనే అభిప్రాయం జనంలో నెలకొనడంతో మాస్కులు కూడా పెట్టుకోవడంలేదు.
– వెంకట్, స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు..
ప్రజలు గాడి తప్పినప్పుడు ప్రభుత్వం చక్కదిద్దాలి. ప్రభుత్వమే నిర్లక్ష్యంగా ఉంటే పరిస్థితి అదుపు తప్పుతుంది. ఇప్పుడదే జరుగుతోంది. ఏ ఒత్తిడికిలోనై ప్రభుత్వం భౌతిక తరగతులను నిర్వహించాలని నిర్ణయం తీసుకుందోగానీ అప్పటికే తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి కాకుండా అసెంబ్లీలో తీసుకున్న జాగ్రత్తలను రాష్ట్రంలో అమలయ్యేలా చూడడంలో ప్రభుత్వం విఫలమైంది. హాలియాలో సీఎం సభకు వేలాది మందిని తరలించినప్పుడు కొవిడ్ నిబంధనలను పట్టించుకోలేదు. బార్లు, పబ్‌లు, క్లబ్‌లు, షాపింగ్ మాల్స్, సిటీ బస్సుల్లో కొవిడ్ నిబంధనలు అమలవుతున్నాయో లేదో కూడా ప్రభుత్వానికి పట్టలేదు. సీఎం మాస్క్ విషయంలో చేసిన కామెంట్లకు తగ్గట్లుగానే ప్రజలు రోడ్ల మీద కూడా విచ్చలవిడిగా తిరుగుతున్నారు.
– దాసోజు శ్రవణ్, కాంగ్రెస్ నేత