కొయ్యూరు అమరులకు లాల్ సలాం.. ఎన్కౌంటర్ జరిగి 22 ఏళ్లు

by Shyam |   ( Updated:2021-12-01 04:57:01.0  )
కొయ్యూరు అమరులకు లాల్ సలాం..  ఎన్కౌంటర్ జరిగి 22 ఏళ్లు
X

దిశ, కాటారం : రెండు దశాబ్దాలు మాయని గాయంగా నాటి పీపుల్స్ వార్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఉత్తర తెలంగాణలో ఉవ్వెత్తున విప్లవ పోరాటం ఎగిసిపడుతున్న సమయమది. గెరిల్లా యుద్ధం వైపు సాగుతున్న ఉద్యమ నేల, పచ్చని అడవులు ఎరుపెక్కాయి. రాజ్యం వేసే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కంచుకోటగా మార్చుకున్న ఆ అటవీ ప్రాంతం తూటాలతో దద్దరిల్లిపోయాయి. విప్లవోద్యమానికి ఊపిరి పోసి, వెన్నుదన్నుగా నిలిచే ఆ ముగ్గురు అక్కడ జరిగిన ఎన్ కౌంటర్‌లో హతం కావడం పార్టీని ఒక్క కుదుపు కుదిపేసిందని చెప్పక తప్పదు.

ఉమ్మడి రాష్ట్రంలోనే సంచలనం

1999 డిసెంబర్ 2న ఉమ్మడి కరీంనగర్ జిల్లా మల్హర్ మండలం కొయ్యూరు అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ జాతీయస్థాయి చర్చకు దారితీసింది. నాటి పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న నల్ల ఆదిరెడ్డి అలియస్ శ్యాం, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేష్ లో ఇక్కడి అటవీ ప్రాంతంలో విగతజీవులు పడి ఉన్నారు. డిసెంబర్ 2 ఉదయం వరకు నిశ్శబ్దంగా ఉన్న రాష్ట్రం అంతా ఒక్క సారిగా అల్లకల్లోలంగా మారిపోయింది. ముఖ్య నాయకులు ఎన్ కౌంటర్ లో మరణించారన్న వార్త రాష్ట్రం మొత్తం వ్యాపించింది. మధ్యాహ్నం కల్లా జాతీయ స్థాయిలో ఈ అంశం ప్రధాన చర్చకు దారి తీసింది.

అప్పటి వరకు పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ స్థాయి నాయకులు పోలీసులకు చిక్కలేదు. కానీ నల్ల ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేష్‌లు ఎన్ కౌంటర్ లో హతం కావడం కలకలం సృష్టించింది. వీరిని స్మరించుకునేందుకు పీపుల్స్ వార్ పార్టీ 2000 డిసెంబర్ 2 నుండి వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. పీపుల్స్ వార్ సాయుధ పోరాటంలో అత్యంత కీలకమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) ఆవిర్భావం‌లో నల్ల ఆదిరెడ్డి ముఖ్య భూమిక పోషించారు. అప్పటి నుండి ఆయనతో పాటు కొయ్యూరు ఎన్ కౌంటర్ లో చనిపోయిన వారిని స్మరిస్తూ సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తారు. ఉత్తర తెలంగాణలో పట్టున్న సమయంలో అయితే అటవీ ప్రాంతాల్లో తాత్కాలిక స్థూపాలు నిర్మించి వారం రోజుల పాటు కొయ్యూరు అమరవీరులను స్మరించుకునే వారు. అంతేకాకుండా శత్రువును మట్టుబెట్టేందుకు కూడా గెరిల్లా పోరాటాలు చేసేందుకు ప్రయత్నించే వారు. క్రమక్రమంగా పీపుల్స్ వారికి పట్టు రావడంతో ఉత్తర తెలంగాణలో వారోత్సవాలు నిర్వహించడం తగ్గిపోయింది. కానీ దండకారణ్య అటవీ ప్రాంతంలో మాత్రం నేటికీ వారోత్సవాలు నిర్వహిస్తూనే ఉన్నారు.

స్మారక స్థూపం

మల్హర్ మండలంలోని కొయ్యూరు అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ మృతుల త్యాగాలకు చిహ్నంగా నాటి పీపుల్స్ వార్.. నేటి మావోయిస్టు పార్టీ ప్రథమ వర్ధంతి సందర్భంగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు పి.ఎల్.జి ఈ వారోత్సవాలను చేపట్టాలని నిర్ణయించారు. వారి స్మారకంగా రామగిరి మండలం బేగంపేట గ్రామంలో మావోయిస్టు పార్టీ 53 అడుగుల ఎత్తుతో స్మారక స్థూపాన్ని నిర్మించింది. దీనిని 2005 నవంబర్ 13న కుటుంబసభ్యులు బంధుమిత్రులు ఆవిష్కరించారు.

సరిహద్దుల్లో రెడ్ అలర్ట్

పి.ఎల్.జి.ఎ వారోత్సవాలు గురువారం నుంచి జరగనున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తం అయ్యారు. వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని మావోయిస్టు పార్టీ ఇప్పటికే పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బలగాలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాలతో పాటు గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నది పరివాహక ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. గత నెలలో మహారాష్ట్ర ఎన్ కౌంటర్‌లో 26 మంది నక్సల్స్ మృతి చెందడం ఆ పార్టీకి తీరని లోటు. అంతేకాకుండా మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి భూషణ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌కు పార్టీ తాత్కాలిక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. యుద్ధతంత్రం దామోదర్ నేతృత్వంలో సరిహద్దుల్లో దాడులు జరుగుతాయని భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి. దామోదర్‌కు ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర ఛత్తీస్ గఢ్ సరిహద్దు అడవుల్లో గతంలో కార్యకలాపాలు నిర్వహించిన అనుభవం ఉంది. ప్రజా యుద్ధంతో గెరిల్లా సైన్యాన్ని అనుసంధానం చేసేందుకు కేంద్ర కమిటీ ఇప్పటికే కిందిస్థాయి కేడర్‌కు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల వారోత్సవాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని బలగాలు దండకారణ్యంలో గాలింపులు తీవ్రతరం చేశాయి.

Advertisement

Next Story