‘జేకే అప్నీ పార్టీ’.. ఎవరి పార్టీ?

by Shamantha N |
‘జేకే అప్నీ పార్టీ’.. ఎవరి పార్టీ?
X

దిశ, వెబ్‌డెస్క్: పీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయాక.. జమ్ము కశ్మీర్‌లో రాజకీయ సంక్షోభం మొదలైంది. గతేడాది ఆర్టికల్ 370, 35ఏ రద్దు నిర్ణయాలు కశ్మీర్‌లో పరిస్థితులను దారుణంగా దిగజార్చాయి. జమ్ము కశ్మీర్ స్వయంప్రతిపత్తిని తొలగించడమే కాకుండా.. రాష్ట్రాన్ని ముక్కలు చేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం విభజించింది. ఇంతటి కఠిన నిర్ణయాలు తీసుకున్నాక ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోరాదనే ఉద్దేశంతో కశ్మీర్‌లోయలో తీవ్ర ఆంక్షలు అమలయ్యాయి. వీటితో కశ్మీరీలు ఆర్థికంగా నష్టపోవడమే కాదు.. సామాజికంగా స్వేచ్ఛ కోల్పోయి ఒకరకమైన మానసిక ఒత్తిళ్లను అనుభవించారు. దేశం నుంచి వెలివేసిన భావనకు లోనయ్యారు. ముగ్గురు మాజీ సీఎంలు సహా ప్రధాన స్రవంతి రాజకీయ నేతలను కేంద్ర నిర్బంధించడంతో కశ్మీర్ సమస్యకు రాజకీయంగా పరిష్కారానికి అవకాశం లేకుండా పోయింది.

కశ్మీర్‌పై సాహసోపేత నిర్ణయాలైతే తీసుకున్నది కానీ, మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ఏం చేయాలో సందిగ్దావస్థలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ తరుణంలో ఎన్‌సీ, పీడీపీలను కాకుండా థర్డ్ ఫ్రంట్ అని పేర్కొంటూ జమ్ము కశ్మీర్ అప్నీ పార్టీ(జేకేఏపీ)ని పీడీపీ మాజీ నేత అల్తాఫ్ బుఖారీ స్థాపించారు. మరి ఇది నిజంగానే ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఉంటుందా? లేక కేంద్రంలోని బీజేపీకి బీ పార్టీగా ఉంటుందా? అని సహజంగానే అనుమానాలు వచ్చాయి.

ఎన్‌సీ, కశ్మీర్ కాంగ్రెస్ నేతలు జేకేఏపీని బీజేపీకి కీలుబొమ్మగా వర్ణించాయి. జమ్ము, కశ్మీర్‌పై దుస్సాహసమైన నిర్ణయాలు తీసుకున్న బీజేపీకి ఇప్పుడిప్పుడే అక్కడ ఆమోదం లభించకపోవచ్చు. అందుకే బీజేపీ కనుసన్నల్లో నడిచే పార్టీ కావలసి వచ్చిందని, ఆ పార్టీలో కూడా స్థానిక నేతలే కీలకంగా ఉన్నట్టు కనిపించాలనే బీజేపీ ప్రణాళికలోనే జేకేఏపీ ఆవిర్భవించిందని అభిప్రాయాలు వస్తున్నాయి.

జేకేఏపీ స్థాపించిన బుఖారి తాను బక్షి గులాం మొహమ్మద్ నుంచి ప్రేరణ పొందారని చేసిన వ్యాఖ్య అతని పార్టీ వైఖరిని తెలుపుతున్నది. 1953-64 మధ్య కాలంలో జమ్ము, కశ్మీర్ పీఎంగా ఉన్న బక్షి 1953 వరకు పీఎంగా ఉన్న షేక్ అబ్దుల్లా రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారన్న అభియోగాలు మోపి పదవీచ్యుతుణ్ణి చేసి అరెస్టయిన తర్వాత బాధ్యతలు తీసుకున్నారు. అప్పుడు బక్షి ఢిల్లీ సర్కారుకు ఒక స్టాంప్‌గా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. అధికారంలో ఉండేందుకు కేంద్రంతో ఒప్పందం చేసుకున్న మొదటి కశ్మీరీ నేత అని బక్షిని విమర్శిస్తుంటారు. అటువంటి బక్షిని ఆదర్శంగా తీసుకున్న బుఖారి పార్టీ.. ఆర్టికల్ 370 రద్దు గురించి మాట్లాడట్లేదు. కేవలం జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా గురించి మాత్రమే చర్చిస్తున్నది. సరిగ్గా చెప్పాలంటే.. ఆర్టికల్ 370 రద్దు సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏమైతో హామీలనిచ్చిందో వాటినే ముందుకు పెడుతూ.. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయింది. 370 అధికరణం రద్దు అయినప్పటి నుంచి కశ్మీర్ ప్రధాన స్రవంతి రాజకీయపార్టీ నేతలతో భేటీ కాని ప్రధాని.. కొత్త పార్టీకి నేరుగా ఆ అవకాశమివ్వడంపైనా అనుమానాలు వచ్చాయి. మోడీ, షా భేటీలోనూ వారు ముందుగా చెప్పిన హామీనే.. అదే కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పిస్తామన్న హామీనే కొంచెం గంభీరంగా కశ్మీరీలహితంగా గుర్తుచేశారు. బీజేపీ అనుకూలురే జేకేఏపీలో ఉన్నారని తెలుస్తున్నది. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులున్నాయని చూపించే ప్రయత్నంలో పిలిచిన విదేశీయులను కలిసిన కశ్మీరీ నేతలే ఇప్పుడు జేకేఏపీలో ఉన్నారని తెలిసింది. అందుకే, జేకేఏపీ నిజంగా జమ్ము కశ్మీర్‌లో ఒక నూతన ఒరవడిని తీసుకురాకపోవచ్చని, కేవలం కేంద్రం రాజకీయాలకు కొనసాగింపుగా మాత్రమే ఉంటుందన్న అభిప్రాయాలు వస్తున్నాయి.

Tags: jammu kashmir, JKAP, bjp, b team, statehood, usual politics, third front

Advertisement

Next Story

Most Viewed