హరితహారం టార్గెట్ రీచ్ అయ్యేనా!

by Shyam |
హరితహారం టార్గెట్ రీచ్ అయ్యేనా!
X

దిశ, మహబూబ్‌నగర్: తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ఈ సారి ఆశించిన స్థాయిలో ఫలితం వచ్చేలా కనపడటం లేదు. అనుకున్న సమయానికి మొక్కలు అందుబాటులోకి వస్తాయనే నమ్మకం లేకపోవడమే ఇందుకు కారణంగా చెప్పాలి. పంచాయితీరాజ్ శాఖ ద్వారా గ్రామ పంచాయతీలను భాగస్వామ్యం చేస్తూ మొక్కలను పెంచేందుకు సిద్ధం అయ్యింది. అయితే పనులు మందకొడిగా సాగుతుండడంతో లక్ష్యాన్ని చేరుకోవడం కష్టంగా కనిపిస్తుంది. ప్రతీ పంచాయితీకి నర్సరీ ఏర్పాటు చేసి నాటిన మొక్కను బతికించే బాధ్యతను అప్పజెప్పారు. నేటికీ చాలా నర్సరీల్లో మొక్కల పెంపు కార్యక్రమం మొదలు కాకపోవడం గమనార్హం.

జూలైలో వర్షాలు కురిసే సమయానికి మొక్కలు సిద్ధం చేయాల్సి ఉండగా నేటికీ చాలా నర్సరీల్లో బ్యాగ్ ఫిల్లింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్ చేరుకోవడం కష్టంగా కనిపిస్తుంది. బిల్లుల చెల్లింపులో ఆలస్యమే కావడంతోనే మొక్కల పెంపుదలపై గ్రామ పంచాయితీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్షాకాలం నాటికి మొక్కలు కొంతమేర పెరగడంతోపాటు వాటిని నాటాల్సిన ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచాలి. ఇంకా 3 నెలల గడువే ఉండటంతో పనులను ఎంత స్పీడ్‌గా చేసినా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమే అవుతుంది.

ప్రజెంట్ మహబూబ్‌నగర్‌లో 93.23 లక్షల మొక్కలు పెంచడం లక్ష్యంగా పెట్టుకుంటే 69లక్షల బ్యాగ్లు మాత్రమే ఫిల్లింగ్ చేశారు. వనపర్తి జిల్లాలో 54.62 లక్షలకు 28.1లక్షలు, నారాయణపేటలో 55.67 లక్షలకు 37.3 లక్షలు, జోగుళాంబ గద్వాలలో 45.09 లక్షలకు 33లక్షలు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 65.19 లక్షల మొక్కలు టార్గెట్‌గా పెట్టగా కేవలం 47.74 శాతం మాత్రమే బ్యాగ్ ఫిల్లింగ్ పూర్తయ్యింది. ఇంకా విత్తనాలను శుద్ధిచేసి వాటిని సంరక్షించి చదును చేసి మొక్కలను పెంచడానికి చాలా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం ఆయా నర్సరీలకు నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోవడం కష్టమనే చెప్పాలి.

Tags : Mahabubnagar, Harithaharam, Plants, Nurseries, July, rain, Government, Wanaparthi, Narayanpet, Jogulamba Gadwala, Target

Advertisement

Next Story

Most Viewed