- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సాగు’తున్న ప్రాజెక్టులు
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా అనగానే ఆదివాసీలు.. అడవులు.. అధిక వర్షపాతం.. ఎత్తయిన గుట్టలు.. రెండు గుట్టల మధ్య కట్ట వేస్తే నీటి నిల్వకు అవకాశం ఎక్కువగా ఉన్న ప్రాంతం. రాష్ట్రంలోనే అత్యధికంగా వర్షాలు కురుస్తున్న ప్రాంతంలో సాగునీటి నిల్వకు అవకాశాలు ఎక్కువ. అలాంటి జిల్లాలో ఏళ్ల తరబడి ప్రాజెక్టుల నిర్మాణం సాగుతూనే ఉంది. భూసేకరణ, అటవీ అనుమతులు ప్రధాన అడ్డంకి కాగా, ప్రాజెక్టులు నిర్మించిన చోట కాలువల్లేవు.. కాల్వలు నిర్మించిన చోట ప్రాజెక్టులు పూర్తి కాలేదు.. దీంతో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందించే పరిస్థితి లేకుండా పోయింది. తాజాగా ప్రభుత్వం అన్ని శాఖలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చింది. ఇకనైనా సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతాయని ఆశతో రైతులు ఉన్నారు.
జలయజ్ఞంలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పన్నెండు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. అందులో కొన్ని పూర్తయినప్పటికీ కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో సాగునీరు అందడం లేదు. మరికొన్ని ప్రాజెక్టుల కాలువలు పూర్తయినప్పటికీ పిల్ల కాలువలు లేక పూర్తిస్థాయిలో సాగునీరందడంలేదు. పాత ప్రాజెక్టులకు సంబంధించి కూడా కాలువలు సరిగా లేక సాగునీటికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వర్షపాతం అధికంగా ఉన్నప్పటికీ వాన నీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయి. ఏళ్ల తరబడి ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా భూసేకరణ అటవీ అనుమతులు సకాలంలో రాకపోవడం నిధులు పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడం పర్యవేక్షణకు లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో వచ్చిన పెను మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. రాష్ట్రంలో ఆ శాఖ స్వరూపాన్ని ఖరారు చేశారు. భారీ, మధ్య, చిన్నతరహా నీటిపారుదల విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తేవడంతోపాటు, ఒకే ప్రాంతంలో ఉన్న అన్ని జలవనరులను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఆదిలాబాద్, మంచిర్యాల జల వనరుల ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తించి, ఒక్కొక్క దానికి ఒక్కో సీఈని పర్యవేక్షణాధికారిగా బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
2021 జూన్లోగా పూర్తి చేయడమే టార్గెట్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్షించారు. ఛనాక-కొరాట ప్రాజెక్టు బ్యారేజీ, పంప్ హౌస్, కెనాళ్లను 2021 జూన్ లోగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. చెన్నూరు లిఫ్టు ఇరిగేషన్ స్కీంతోపాటు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మధ్యతరహా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించి, మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. జల వనరులశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తో పాటు ఉన్నతాధికారులు ఉమ్మడి జిల్లాలో పర్యటించి పరిస్థితిని సమీక్షించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల పరిధిలో ఆయకట్టును అభివృద్ధి చేయడానికి ప్రాణహిత ప్రాజెక్టుపై అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని సీఎం ఆదేశించారు. చనాఖా–కొరాట పనులు కొంతమేరకు జరుగుతున్నప్పటికీ మిగతా ప్రాజెక్టుల పనులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రాణహిత చేవెళ్ల పనులు మాత్రం ముందుకు సాగడం లేదు.
* ఆదిలాబాద్ జిల్లాలో కుప్పి ప్రాజెక్టు టెండర్లను వెంటనే పిలిచి, పనులు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. బోథ్ నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగునీరందించే ఈ ప్రాజెక్టుతో కడె౦ ప్రాజెక్టుకు సరిపడా నీరు కూడా అందుబాటులో ఉంటుంది. సాత్నాల ప్రాజెక్టు సంబంధించి 24 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, 18 వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగునీరందుతోంది. కాగా, మత్తడివాగు కింద పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగు నీరు ఇవ్వడం లేదు.
* ఆసిఫాబాద్ జిల్లాలో 2006 లో చేపట్టిన కుమ్రం భీం ప్రాజెక్టు సగం ఆయకట్టుకు కూడా సాగునీరు ఇవ్వడం లేదు, ఒక కుడికాలువ మాత్రమే పూర్తవ్వగా డిస్ట్రిబ్యూషన్ కెనాల్ వ్యవస్థ లేదు. ఎడమ కాలువ పనులు ఇంకా పూర్తికాలేదు. 45 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా 20 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. చెలిమల వాగు ప్రాజెక్టుకు కెనాల్ వ్యవస్థ లేకపోవడంతో సాగునీరందడం లేదు. జగన్నాథ్ పూర్ ప్రాజెక్టు గేట్లు పెట్టినప్పటికీ నీటి నిల్వ చేయడం లేదు. పీపీ రావు ప్రాజెక్టు పనులు మధ్యలో ఆగిపోగా అసంపూర్తిగా ఉంది. వట్టివాగు ప్రాజెక్టు ఆయకట్టు 24 వేల ఎకరాలు ఉండగా ప్రస్తుతం 5 వేలకు మించి ఆయకట్టుకు నీరందడం లేదు.
* మంచిర్యాల జిల్లాకు సంబంధించి నీల్వాయి ప్రాజెక్టుకు అటవీ అనుమతులు ఇటీవల రాగా పనులు కొనసాగుతున్నాయి. ర్యాలీ వాగు ప్రాజెక్టు కింద ఆయకట్టు లేకపోగా ఆ ప్రాజెక్టు ఉత్సవ విగ్రహంలా మారింది. గొల్లవాగు కింద కాలువలు పూర్తి కాకపోవడంతో అధ్వానంగా మారింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద చుక్కనీరు ఆయకట్టుకు అందకపోగా బ్యాక్వాటర్తో గూడెం ఎత్తిపోతల పథకానికి నీరు ఇస్తున్నారు.
* నిర్మల్ జిల్లాకు సంబంధించి కడెం సరస్వతీ కాల్వల కింద పూర్తిస్థాయిలో నీరందుతుండగా కాళేశ్వరం ప్యాకేజీ 27, 28 పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఆయకట్టుకు సాగునీటి విడుదల లేదు. ప్యాకేజీ 27 దాదాపు పనులు పూర్తయ్యే దశలో ఉండగా ప్యాకేజీ 28లో ఇంకా పనులు అసంపూర్తిగా ఉన్నాయి. పుల్కల్ వద్ద నిర్మిస్తున్న సదర్మాట్ బ్యారేజీ పనులు కొనసాగుతున్నాయి.
ఇటీవల కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న అన్ని చెరువులకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో 2,702 చెరువులు ఉండగా వీటి కింద 3,01,788 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు మెజారిటీ చెరువులు నిండగా.. 45 చెరువులు దెబ్బతిన్నాయి. వీటిని బాగు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.