IPL 2023: సన్ రైజర్స్ కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్!

by Vinod kumar |   ( Updated:2023-03-31 13:45:39.0  )
IPL 2023: సన్ రైజర్స్ కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్!
X

దిశ, వెబ్‌డెస్క్: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌ 2023 సీజన్‌ కోసం మార్కరమ్‌ను కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. కానీ.. మార్కరమ్‌ స్థానంలో భువనేశ్వర్‌ కుమార్‌ సన్‌రైజర్స్‌ను నడిపించనున్నాడు. ఈ రోజు జట్ల కెప్టెన్లు కప్‌తో ఫొటోలకు ఫోజులివ్వగా.. SRH కెప్టెన్‌గా భువనేశ్వర్ పాల్గొన్నాడు. దీంతో మార్కరమ్‌ వచ్చే వరకు భువీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకి దక్షిణాఫ్రికా ఆటగాళ్లు దూరం కానున్నారు. నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్ రీషెడ్యూల్ ఇందుకు కారణం అని తెలుస్తుంది. దీని ప్రకారం స్వదేశంలో నెదర్లాండ్స్ మీద దక్షిణాఫ్రికా మార్చ్ 31, ఏప్రిల్ 2న రెండు వన్డేల సిరీస్ ఆడనుంది. దీంతో ప్రస్తుతం దక్షిణాఫ్రికా తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడే ప్లేయర్లు వారి వారి జట్లకు తమ తొలి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. ఈ క్రమంలో డికాక్, రబడా, మార్కరమ్‌, మిల్లర్, స్టబ్స్, జెన్సన్, వాండర్ డస్సెన్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరం అయ్యే అవకాశం ఉంది.

ఇటీవల మార్కరమ్‌ను తమ కెప్టెన్‌గా సన్‌రైజర్స్‌ యాజమాన్యం ప్రకటించింది. దీంతో తొలి మ్యాచ్‌లకు మార్కరమ్‌ దూరం అయితే.. సన్‌రైజర్స్‌ను ఎవరు నడిపిస్తారనే విషయంపై ఆసక్తి నెలకొన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఏప్రిల్‌ 2న సన్‌రైజర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు మార్కరమ్‌తో పాటు బౌలింగ్ ఆల్ రౌండర్ జన్సెన్ కూడా అందుబాటులో ఉండడం లేదు. అయితే మళ్లీ తిరిగి ఏప్రిల్‌ 4న వాళ్లిద్దరూ జట్టుతో కలిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఏప్రిల్‌ 2న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌కు మార్కరమ్‌ అందుబాటులో లేని కారణంగా ఆ మ్యాచ్‌కు భువీ సారథ్యంలో SRH జట్టు ఆడనుంది.

Advertisement

Next Story

Most Viewed