ఐపీఎల్… వివాదాలకు కేరాఫ్

by Shyam |
ఐపీఎల్… వివాదాలకు కేరాఫ్
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ ప్రేమికులకు పండుగే. బీసీసీఐ ఖజానా నింపడమే కాకుండా టీమ్ఇండియాకు భవిష్యత్ క్రికెటర్లను అందిస్తున్నది. కానీ, మరోవైపు వివాదాలు మెగా లీగ్ ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. ఆటగాళ్ల మధ్య గొడవలు, స్పాట్ ఫిక్సింగ్, లలిత్ మోడీ బహిష్కరణ, చీర్ లీడర్స్‌తో అసభ్య ప్రవర్తన, మన్కడింగ్ తదితర వివాదాలు ఐపీఎల్‌కు మచ్చల్లా మిగిలిపోయాయి. గత 12 సీజన్లలో ప్రతిసారి ఏదో ఒక వివాదం తలెత్తడం, వాటిని బీసీసీఐ పరిష్కరించడం పరిపాటిగా మారింది. అలా 12ఏళ్లలో చోటుచేసుకున్న 12 వివాదాలను ఒకసారి చూద్దాం.

శ్రీశాంత్, భజ్జీ గొడవ

ఐపీఎల్ తొలి సీజన్‌లో శ్రీశాంత్, హర్భజన్ మధ్య గొడవ సంచలనమైంది. పంజాబ్ తరఫున ఆడుతున్న శ్రీశాంత్‌ను ముంబయి తాత్కాలిక కెప్టెన్‌ హర్భజన్ సింగ్ చెంప దెబ్బ కొట్టాడు. ఈ వివాదం ‘స్లాప్ గేట్’గా చర్చకు దారి తీసింది. కెమెరాల ఎదుట శ్రీశాంత్ ఈ విషయం వెల్లడిస్తూ బోరున విలపించాడు. బీసీసీఐ కమిటీ విచారణలో హర్భజన్‌దే తప్పని వెల్లడైంది. టోర్నీ మొత్తానికి భజ్జీని బ్యాన్ చేయడంతోపాటు జీతం కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా ఐదు వన్డేల నుంచి హర్భజన్‌ను బీసీసీఐ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత చాలా ఏళ్లకు శ్రీశాంత్‌కు భజ్జీ క్షమాపణలు చెప్పాడు.

పాక్ క్రికెటర్లపై నిషేధం

2008, నవంబర్‌.. ముంబయిలో టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. పాకిస్థాన్‌ ప్రేరిపిత ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు తేలడంతో కేంద్ర ప్రభుత్వం ఆ దేశంతో అన్ని రకాల దౌత్య సంబంధాలను తెంచుకుంది. క్రీడా సంబంధాలనూ రద్దు చేసింది. అప్పటికే ఐపీఎల్‌లో పలు ఫ్రాంచైజీల్లో పాక్ క్రీడాకారులు ఆడుతున్నారు. ప్రజా ఆందోళనకు లొంగిన బీసీసీఐ ఐపీఎల్-2009 నుంచి పాక్ క్రికెటర్లపై నిషేధం విధించింది. అప్పటి నుంచి ఏ పాక్ క్రికెటర్ ఐపీఎల్‌లో ఆడలేదు. ఇమ్రాన్ తాహిర్‌కు దక్షిణాఫ్రికా పౌరసత్వం ఉండటంతో ఐపీఎల్ ఆడుతున్నాడు.

లలిత్ మోడీపై వేటు

ఐపీఎల్‌ మాస్టర్ మైండ్ లలిత్ మోడీని లీగ్ చైర్మన్, కమిషనర్ పదవుల నుంచి బీసీసీఐ సస్పెండ్ చేసింది. బీసీసీఐ చరిత్రలో ఇది అత్యంత సంచలన సంఘటన అని చెప్పుకోవచ్చు. అధికార దుర్వినియోగం, ఆర్థిక నేరాలు తదితర ఆరోపణలతో ఐపీఎల్-2010 ఫైనల్ మ్యాచ్ ముగిసిన రెండో రోజే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. లీగ్ మధ్యలోనే లలిత్ మోడీ సస్పెన్షన్‌పై నిర్ణయం తీసుకున్నా ఆ ప్రభావం లీగ్‌పై పడుతుందనే ఉద్దేశంతో బీసీసీఐ లీగ్ ముగిసిన తర్వాత సస్పెండ్ చేసింది. ఆరోపణలు నిరూపితం కావడంతో 2013లో లలిత్ మోడీపై జీవితకాలం నిషేధం విధించింది. కానీ, అప్పటికే అతను లండన్ వెళ్లిపోయాడు.

చీర్ లీడర్స్ వివాదం

ఐపీఎల్‌లో చీర్ లీడర్స్‌ను ఎంత చులకనగా చూస్తారో బహిర్గతమైంది. ముంబయి ఇండియన్స్ చీర్ లీడర్‌ గాబ్రియేలా ఐపీఎల్‌పై తన బ్లాగ్‌లో రాసుకుంది. తమను క్రికెటర్లు చులకనగా చూస్తారని, తమ నుంచి ఇంకా ఏవేవో ఆశిస్తారని వెల్లడించింది. 22ఏళ్ల ఈ దక్షిణాఫ్రికా అమ్మాయి పలువురు క్రికెటర్లపై లైంగిక ఆరోపణలు కూడా చేసింది. ఈ విషయం వివాదం అవుతున్న సమయంలో నీతా అంబానీ సమస్యను పరిష్కరించినట్లు మీడియా వెల్లడించింది. ఆ తర్వాత కొన్నిరోజులకే ముంబయి ఇండియన్స్ చీర్ లీడర్స్ టీమ్ నుంచి గాబ్రియేలాను తప్పించారు. చివరకు బీసీసీఐ జోక్యం చేసుకుని చీర్ లీడర్ల డ్రెస్ కోడ్ అమలు చేసింది.

షారుక్ ఖాన్ బహిష్కరణ

కోల్‌కతా నైట్‌రైడర్స్ యజమాని షారుక్ ఖాన్‌ను ఒక స్టేడియం నుంచి బహిష్కరించడం వివాదంగా మారింది. ముంబయి వాంఖడే స్టేడియంలోకి రాకుండా ఐదేళ్లపాటు ముంబయి క్రికెట్ అసోసియేషన్ నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్‌లో ఒక మ్యాచ్‌కు ముందు షారుక్‌ఖాన్ పిల్లలు గ్రౌండ్‌లో ఆడుకోవడానికి వెళ్తుంటే సెక్యూరిటీ గార్డ్ అడ్డుకున్నాడు. దీంతో సెక్యూరిటీ గార్డ్‌ను షారుక్ అసభ్య పదజాలంతో దూషించాడు. అంతేకాకుండా నాన్ స్మోకింగ్ జోన్‌లో షారుక్ సిగరెట్ తాగడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనపై విచారణ అనంతరం షారుక్‌ఖాన్ తప్పు ఉన్నట్లు తేలడంతో నిషేధం విధించారు.

స్పాట్ ఫిక్సింగ్ వివాదం

ఐపీఎల్-2013 ఒక మచ్చలాంటిది. కొన్ని మ్యాచ్‌లను రాజస్థాన్ జట్టుకు చెందిన శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌లు స్పాట్ ఫిక్సింగ్ చేయడానికి బుకీల నుంచి డబ్బులు తీసుకున్నట్లు తేలింది. ఈ ముగ్గురినీ ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరోవైపు సీఎస్కే యజమాని ఎన్ శ్రీనివాసన్ మేనల్లుడు గురునాథ్ మనియప్పన్, విందు ధారాసింగ్‌తో కలిసి బెట్టింగ్‌కు పాల్పడినట్లు, బుకీలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన ముంబయి పోలీసులు వారినీ అరెస్టు చేశారు. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన క్రికెటర్లను బీసీసీఐ జీవితకాలం నిషేధించింది రాజస్థాన్, చెన్నై జట్లపై వచ్చిన ఆరోపణలపై విచారించిన సుప్రీంకోర్టు ఆ జట్లపై రెండేళ్ల నిషేధం విధించింది.

ప్రీతి జింటా, నెస్ వాడియాల వివాదం

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ సహ యజమానులు ప్రీతి జింటా, నెస్ వాడియాల వ్యవహారం ఐపీఎల్-2014 మొత్తం హల్‌చల్ చేసింది. గతంలో నాలుగేళ్లు డేటింగ్ చేసిన వీరు 2009లో విడిపోయారు. తనను నెస్ వాడియా లైంగికంగా వేధిస్తున్నాడని ప్రీతి జింటా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై చేయి చేసుకున్నాడని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టింది. ఫ్రాంచైజీ ఓనర్లు రచ్చకెక్కడంతో బీసీసీఐ కూడా ఇరుకున పడింది. అప్పటికే స్పాట్ ఫిక్సింగ్ దెబ్బకు బీసీసీఐపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. దీంతో కొంతమంది బీసీసీఐ పెద్దలు వారిద్దరికీ రాజీ కుదిర్చినట్లు సమాచారం.

కోహ్లీ నిబంధనల ఉల్లంఘన

స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం తర్వాత బీసీసీఐ ఆటగాళ్ల కోసం మార్గదర్శకాలను రూపొందించింది. మ్యాచ్ జరిగే సమయంలో బయటి వ్యక్తులతో మాట్లాడటంపై నిషేధం విధించింది. కానీ, ఒక మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నిబంధనలను ఉల్లంఘించాడు. డ్రెస్సింగ్ రూమ్‌ను వదిలి గ్యాలరీల్లోకి వెళ్లి అనుష్క శర్మ (అప్పటికి పెళ్లి కాలేదు)తో మాట్లాడాడు. ఈ దృశ్యాలు కెమెరాల్లో కనిపించడంతో బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ తీవ్రంగా పరిగణించింది. ఒక జట్టు‌కు కెప్టెన్‌గా ఉండి నిబంధనలు ఉల్లంఘించడంపై విచారణ చేపట్టింది. ఆ తర్వాత బీసీసీఐ ఆ అభియోగాలను తోసిపుచ్చింది.

నీటి వివాదం

ఐపీఎల్-2016లో మహారాష్ట్రలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అదే సమయంలో ఐపీఎల్ కోసం భారీగా నీటిని వినియోగించడం వివాదాస్పదమైంది. పూణె సమీపంలోని ఒక డ్యామ్ నుంచి నీటిని క్రికెట్ పిచ్‌లు తడపడానికి వినియోగించారు. దీంతో రైతులు ఆందోళన చేపట్టారు. అంతేకాకుండా బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కరువు సమయంలో నీటిని అక్రమంగా వాడుకుంటున్నారని న్యాయస్థానం ఎదుట వేడుకున్నారు. ఈ కారణంగా ఆ సీజన్‌లో జరగాల్సిన 12 మ్యాచ్‌లను మహారాష్ట్ర బయటకి బీసీసీఐ తరలించింది.

పొలార్డ్, సంజయ్ వివాదం

ఐపీఎల్-2017లో సంజయ్ మంజ్రేకర్ తన వ్యాఖ్యానంతో వివాదం సృష్టించాడు. ముంబయి ఆటగాడు కిరాన్ పొలార్డ్‌ను తెలివి తక్కువ మనిషి అంటూ కామెంట్ చేశాడు. దీంతో పొలార్డ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సంజయ్‌ని ఉద్దేశించి సోషల్ మీడియాలో పెద్ద పోస్టు పెట్టాడు. ఆ మాట సంజయ్ అన్నట్లు ఎక్కడా నిరూపించలేకపోయాడు. అయినా పొలార్డ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ సీజన్‌లో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ వివాదం చాలాకాలం కొనసాగుతుండటంతో బీసీసీఐ ఇద్దరికీ సయోధ్య కుదిర్చింది.

మరోసారి రైతుల ఆగ్రహం

దేశంలో ఐపీఎల్‌ నిర్వహణపై మరోసారి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు, కర్నాటక మధ్య కావేరి వివాదం నేపథ్యంలో చెన్నై సహా పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. కోల్‌కతాతో జరిగిన తొలి మ్యాచ్‌పై ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు స్టేడియం బయట రైతులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఆ ఏడాది చెపాక్ మ్యాచ్‌లను పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియానికి తరలించింది.

మన్కడింగ్ వివాదం

ఐపీఎల్‌లో తొలిసారి మన్కడింగ్‌పై పెద్ద వివాదం జరిగింది. పూణె బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మన్ జాస్ బట్లర్‌ను మన్కడింగ్ (బంతి వేయక ముందే క్రీజ్ దాటితే రనౌట్ చేయడం) చేశాడు. ఈ విషయంపై ఆ ఏడాది మొత్తం చర్చ జరిగింది. అశ్విన్‌కు క్రీడా స్ఫూర్తి లేదంటూ పలువురు విమర్శించారు. అయితే, తాను ఐసీసీ నిబంధనల మేరకే అవుట్ చేశానని, అంపైర్లు కూడా టీవీల్లో రిప్లే వీక్షించిన తర్వాతే అవుటిచ్చినట్లు గుర్తు చేశాడు. ఈ మన్కడింగ్‌పై ఐపీఎల్‌‌లో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కూడా చర్చ జరుగుతున్నది. ఈ నిబంధనను ఐసీసీ మార్చాలని పలు డిమాండ్లు కూడా వచ్చాయి.

Advertisement

Next Story