ఐపీఎల్‌ వచ్చేస్తోంది.. గతేడాది ఏమైందో గుర్తుందా?

by Anukaran |
ఐపీఎల్‌ వచ్చేస్తోంది.. గతేడాది ఏమైందో గుర్తుందా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్.. ఈ పేరు వింటేనే క్రికెట్ అభిమానుల్లో నరాలు తెగే ఉత్కంఠ. ప్రపంచ క్రికెట్‌లో మోస్ట్ ఫేవరేట్ లీగ్ ఏదైనా ఉందంటే అది ఐపీఎల్‌ మాత్రమే. అదరగొట్టే బ్యాట్స్‌మెన్ల నడుమనే బెదరగొట్టే బౌలర్లు ఉంటారు. అందులోనూ గేమ్ ఛేంజర్లు మరీ ముఖ్యమైతే గేమ్ డ్యామేజర్లు పతనంలో పాలు పంచుకుంటారు. ఆల్‌రౌండర్ల అద్భుత ఆటకు ఐపీఎల్ సరైన వేధిక. భారీ సిక్సర్లు, బౌండరీల మోతలతో ఈ లీగ్ ప్రతీ ఏటా చేసే హంగామా అంతా ఇంతా కాదు. వందల కోట్ల బిజినెస్‌తో జరిగే ఈ లీగ్‌ అతి త్వరలోనే అభిమానుల ముందుకు రాబోతోంది.

కరోనా కొనసాగుతున్నా..

2020లో ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 విలయతాండవం చేస్తున్నప్పటికీ.. ఐపీఎల్‌ మాత్రం అదే సంవత్సరంలో నిర్వహించారంటే లీగ్ వ్యాల్యు అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు స్వదేశంలో కాకుండా.. యూఏఈ వేదికగా, అది అభిమానులు రాకుండా తొలిసారిగా ఐపీఎల్ నిర్వహించడం విశేషం. అటువంటి లాక్‌డౌన్ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఫ్రాంఛైజీలకు, ఆటగాళ్లకు ఆర్థికంగా ఐపీఎల్ ఆదుకుంది అనడంలో సందేహం లేదు. గతేడాది ఆలస్యంగా ప్రారంభమైన ఈ సీజన్.. ఈ ఏడాది ఆగనంటూ అతి త్వరలోనే అభిమానులను అలరించడానికి సిద్ధమైంది.

అతి త్వరలోనే..

ఐపీఎల్ సీజన్ 13 ముగిసి మూడు నెలలు తిరగక ముందే ఐపీఎల్ 14కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అన్ని జట్లు గతేడాది అత్యంత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను అక్కునచేర్చుకొని.. పేలవ ప్రదర్శన చేసిన వారిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వచ్చే నెల 18న చెన్నైలోని గ్రాండ్ చోళ హోటల్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మినీ వేలం నిర్వహించనున్నారు. ఇక స్టేడియంల ఎంపిక, తదితర విషయాలపై బీసీసీఐ కూడా ప్రణాళికలు చేస్తోంది. ప్రస్తుతం ఫ్రాంఛైజీలు కూడా మిగులు బడ్జెట్‌లోనే కొత్త ఆటగాళ్లను తీసుకోనున్నారు. దీంతో ఐపీఎల్ సీజన్ మొదలవుతోందంటూ క్రికెట్ ప్రియులు తెగ సంబరపడిపోతున్నారు.

గతేడాది ఏమైంది..?

కొవిడ్ కష్టకాలంలో.. సొంతగడ్డపై కాకుండా.. యూఏఈలో నిర్వహించిన ఐపీఎల్‌ మ్యాచ్ అభిమానులకు ఏమాత్రం నిరుత్సాహం కలిగించలేదు. అభిమానులకు అనుమతి లేకున్నా.. లైవ్ స్ట్రీమింగ్‌లో ఎంతో ఎంజాయ్ చేశారు. క్రికెట్ ‌ ప్రియులైతే టీవీలకు అత్తుకుపోయారు.

అయితే, ఐపీఎల్ సీజన్‌-13లో చాలా అనూహ్య పరిణామాలే చోటుచేసుకున్నాయి. చెన్నై జట్టు ఎన్నడు లేనంతగా పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌ వరకు రాకుండా ఇంటికెళ్లడం అందరినీ ఆశ్యర్యానికి గురిచేయగా.. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఢిల్లీ జట్టు ముంబై‌కి గట్టి పోటీనిచ్చి ఫైనల్ వరకొచ్చింది. ముంబై ఇండియన్స్‌ మాత్రం ఎప్పటిలాగే విక్టరీ కొట్టి 2020 కప్‌ను ముద్దాడింది. ఇక సన్‌రైజర్స్, బెంగళూరు తమ వంతు కృషి చేసి ప్లే ఆఫ్స్ చేరుకున్నా ఎలిమినేటర్ మ్యాచ్‌లో చేతులెత్తేశారు.

మిగతా జట్లు.. కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లల్లో అత్యంత సమర్థవంతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. ప్లే ఆఫ్స్ రేసులోనే తప్పుకున్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా గతేడాది ఐపీఎల్‌ అభిమానుల మధ్యన జరగకున్నా.. అంచనాలను మాత్రం అందుకుంది. ఇప్పుడు స్వదేశంలో జరగబోయే లీగ్‌ కోసం అన్ని సన్నాహాలు పూర్తి చేస్తున్నారు. ఇక ఐపీఎల్ 14వ సీజన్‌ ఏ స్థాయిలో అలరిస్తుందో అని క్రికెట్ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed