చెన్నై మళ్లీ గర్జించేనా?

by Shiva |
చెన్నై మళ్లీ గర్జించేనా?
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత నిలకడైన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్‌కు పేరుంది. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఎంఎస్ ధోనీ ఈ జట్టుకు నాయకత్వం వహించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోనీ రిటైర్ అయినా.. చెన్నై జట్టు తరపున మాత్రం మ్యాచ్‌లు ఆడుతూనే ఉన్నాడు. మూడు సార్లు చెన్నైని విజేతగా నిలిపి.. మొత్తానికి 8 సార్లు ఫైనల్‌కు చేరిన ఏకైక జట్టుగా చెన్నై రికార్డు సృష్టించింది. ఇంత మంచి రికార్డు ఉన్న చెన్నై జట్టు యూఏఈలో నిర్వహించిన 13వ సీజన్‌లో మాత్రం పేలవ ప్రదర్శన చేసింది. సురేష్ రైనా, హర్బజన్ జట్టుకు దూరమవడంతో పాటు ధోనీ, కేదార్ జాదవ్ ఫామ్‌లో లేకపోవడంతో వరుసగా మ్యాచ్‌లు ఓడింది. ఒకానొక సమయంలో పాయింట్ల పట్టికలో అట్టడుగు నిలుస్తుందేమో అనుకున్నా.. చివరిలో మ్యాచ్‌లు గెలిచి కాస్త పరువు కాపాడుకున్నది. సీజన్ ముగిసిన తర్వాత జరిగిన మినీ వేలంలో సీఎస్కే పలువురు ఆటగాళ్లను విడుదల చేసింది. మొయిన్ అలీ, చతేశ్వర్ పుజార, క్రిష్ణప్ప గౌతమ్, హరినిషాంత్, హరిశంకర్ రెడ్డి, రాబిన్ ఊతప్పలను కొనుగోలు చేసింది.

రైనా రాకతో..

ఐపీఎల్ 2020లో సీఎస్కే జట్టు నెంబర్ 4లో బ్యాటింగ్ చేసే సరైన బ్యాట్స్‌మెన్ లేక చాలా ఇబ్బంది పడింది. సురేష్ రైనా వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. కేదార్ జాదవ్ ఘోరంగా విఫలమవడంతో బ్యాటింగ్ ఆర్డర్ సరిగా లేక మ్యాచ్‌లు కోల్పోయింది. గత సీజన్‌లో యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ అంచనాలను మించి రాణించాడు. కోవిడ్ కారణంగా కొన్ని మ్యాచ్‌లు దూరమైనా.. అతడు తుది జట్టులో చేరిన తర్వాత చెన్నై విజయాలు సాధించడం మొదలు పెట్టింది. ఈ సారి కూడా డుప్లెసిస్‌కు జోడీగా రుతురాజ్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉన్నది. ఆ తర్వాత స్థానాల్లో సురేష్ రైనా, అంబటి రాయుడు జట్టుకు తోడుగా ఉన్నారు. మిడిల్ ఆర్డర్‌లో ఎంఎస్ ధోనీ, మొయిన్ అలీ, సామ్ కర్రన్ రాణిస్తే భారీ స్కోర్లకు ఆస్కారం ఉంటుంది. టెస్టు ప్లేయర్‌గా ముద్ర పడిన చతేశ్వర్ పుజారాను ఏ స్థానంలో ఆడిస్తారో చూడాల్సి ఉన్నది. రాబిన్ ఊతప్ప, డ్వేన్ బ్రావో అవసరమైన సమయంలో జట్టును ఆదుకోగలరు. ఈ సారి జట్టును చూస్తే బలంగానే కనిపిస్తున్నది.

శార్దుల్, చాహర్‌పైనే ఆధారం..

టీమ్ ఇండియా బౌలర్లు శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్‌లపై చెన్నై ఆధారపడుతున్నది. వీరిద్దరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజెల్‌వుడ్ జట్టులో లేకపోవడం నష్టమే అని చెప్పుకోవాలి. అయితే కొత్తగా వచ్చిన హరిశంకర్ రెడ్డి మంచి పేస్‌తో బంతులు విసురుతున్నాడు. లుంగి ఎన్‌గిడి, ఇమ్రాన్ తాహిర్, కరన్ శర్మ, డ్వేన్ బ్రావో అవసరమైన సమయంలో వికెట్లు తీయగల సత్తా కలిగి ఉన్నారు. మొత్తానికి జట్టు కూర్పు కుదిరితే చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆపడం కష్టం అవుతుంది. ఈ సారి ఎలాగైనా మంచి ప్రదర్శన చేసి గత సీజన్‌లో పోయిన పరువును తిరిగి తీసుకొని రావాలని భావిస్తున్నది. నిలకడైన ప్రదర్శన చేస్తే చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి గర్జించడం ఖాయమే.

పూర్తి జట్టు :

ఫాఫ్ డు ప్లెసిస్, అంబటి రాయుడు, సురేష్ రైనా, చతేశ్వర్ పుజార, హరి నిషాంత్, రుతురాజ్ గైక్వాడ్, డ్వేన్ బ్రావో, మొయిన్ అలీ, క్రిష్ణప్ప గౌతమ్, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, సామ్ కర్రన్, భగత్ వర్మ, ఎంఎస్ ధోని (కెప్టెన్), రాబిన్ ఊతప్ప, నారాయణ్ జగదీషన్, ఇమ్రాన్ తాహిర్, కరన్ శర్మ, సాయి కిషోర్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, కేఎం ఆసిఫ్, లుంగి ఎన్‌గిడి, హరిశంకర్ రెడ్డి.

చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లు

ఢిల్లీ – ఏప్రిల్ 10
పంజాబ్ – ఏప్రిల్ 16
రాజస్థాన్- ఏప్రిల్ 19
కోల్‌కతా – ఏప్రిల్ 21
బెంగళూరు – ఏప్రిల్ 25
హైదరాబాద్ – ఏప్రిల్ 28
ముంబై – మే 1
రాజస్థాన్ – మే 5
హైదరాబాద్ – మే 7
పంజాబ్ – మే 9
కోల్‌కతా – మే 12
ముంబై – మే 16
ఢిల్లీ – మే 21
బెంగళూరు – మే 23

గత సీజన్ – 7వ స్థానం

Advertisement

Next Story