గోడలు కట్టుకు జీవిస్తున్నాం!

by  |
గోడలు కట్టుకు జీవిస్తున్నాం!
X

మాట్లాడకపోవడం నేరం కాకపోవచ్చు కానీ మాట్లాడటం అవసరం-అత్యవసరమైన చోట మాట్లాడిన వారిలో ఈ తరం కవయిత్రి మెర్సీ మార్గరెట్ ఎప్పుడూ తొలివరుసలోనే ఉన్నారు. తను కవిత్వం రాయటం మొదలుపెట్టిన తర్వాత వ్యవస్థను, వ్యవస్థలోని లోటుపాట్లను స్పష్టంగా, సూటిగా భద్రపరుస్తున్నారు. రాసింది రెండు పుస్తకాలే. 2015లో ‘మాటల మడుగు. 2019లో ‘కాలం వాలిపోతున్న వైపు’. మెర్సీ మార్గరెట్ తొలి పుస్తకంతోనే సంచలనం రేపి తెలుగు సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు. కొత్త వస్తువులను ఎంచుకోవడం, సామాజిక అంశాలను సూటిగా కవిత్వం చేయడం మెర్సీ శైలి. మహిళా దినోత్సవం సందర్భంగా ‘కవిత్వం నేను ఎంచుకున్న మార్గం’ అంటున్న మెర్సీ మార్గరెట్ గారి ఇంటర్వ్యూ మన ‘దిశ’ పాఠకుల కోసం..!

1. మెర్సీగారు! ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. దిశ పాఠకుల కోసం మీ గురించి చెప్పండి?

నా పేరు మెర్సీ మార్గరెట్. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ముషీరాబాద్‌లోని రంగానగర్ ఏరియాలో. మా నాన్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి. మా అమ్మ గృహిణి. నేను సెయింట్ ఫిలోమినాలో ప్రైమరీ స్కూల్, టెన్త్ వరకూ వెస్లీలో చదివాను. ఇంటర్ రాణి రుద్రమదేవి కాలేజ్‌లో చేశాను. M.com సర్దార్ పటేల్ కాలేజ్‌లో, MBA డా.బీఆర్ అంబేద్కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కాలేజ్‌లో చేశాను.

2. మీ కవిత్వ ప్రయాణం ఎప్పటినుంచి మొదలైంది?

ఇంటర్ రెండో సంవత్సరం నుంచి కవిత్వం రాస్తున్నాను. సీరియస్‌గా కవిత్వం రాయటం మొదలుపెట్టింది 2009 నుంచే. అప్పుడు నేను ‘మనసు పలికే మౌన గీతం’ అనే బ్లాగులో కవిత్వం రాయడం మొదలుపెట్టాను. తర్వాత ఫేస్‌బుక్ లాంటి మాధ్యమం తోడవటంతో 2011లో మొదటి కవిత్వ పేజీని ప్రారంభించాను. క్రైస్తవ కుటుంబంలో పుట్టి, సెక్యులర్ ప్రపంచానికి దూరంగా పెరగడం వల్ల ఆధ్యాత్మిక సాహిత్యాన్ని ఎక్కువగా చదివాను. ఆ సమయంలో కొంత సంఘర్షణకు లోనయ్యాను.

దేవుడికి రావాల్సిన ఘనతను, ఆయనకి చెందవలసిన దాన్ని నేనేమైనా దొంగతనం చేస్తున్నానా అనే ఒత్తిడి కూడా చాలా ఉండేది. అలాంటి సందర్భంలో నేను రాస్తున్న ఫేస్‌బుక్‌లోని ‘మనసు పలికే మౌన గీతం’ పేజీలో చాలా రోజులు పేరు లేకుండానే పోస్ట్ చేయడం మొదలుపెట్టాను. అలా పోస్ట్ చేస్తున్న క్రమంలో నేను రాసే కవితలు ఎక్కువమంది షేర్ చేసుకునేవారు. అప్పుడు నాకొక సంతృప్తి ఉండేది. నేను రాస్తున్నదాంట్లో ఎంతోకొంత కవిత్వం ఉంది కాబట్టే కదా అందరూ షేర్ చేస్తున్నారు అని. అక్కడి నుంచి నా పేరుతోనే కవిత్వం రాయటం మొదలుపెట్టాను. అప్పుడే ఫేస్‌బుక్‌లో రకరకాల కవిత్వ గ్రూపులు ప్రారంభమయ్యాయి. ఫెంటోస్ అని, కవి సంగమం అని..నా కవిత్వాన్ని వాటిలో పోస్ట్ చేయడం అలవాటు చేసుకున్నాను. అలా మరింతమంది పాఠకులకు దగ్గరయ్యాను.

అదే సమయంలో అమెరికా నుంచి అఫ్సర్ గారు ఇండియాకు వచ్చారు. ఎంతో ఉత్సాహంతో ఆయనను కలిశాను. ఆయనతో జరిగిన సంభాషణలో కవిత్వ మెళకువలు, కవిత్వాన్ని ఎడిట్ చేసుకునే విధానాలను నేర్చుకున్నాను. కవిసంగమం నిర్వహిస్తున్న యాకూబ్ గారు నా కవితలను చదివేందుకు కవి సంగమం గ్రూప్ తరపున అవకాశం ఇవ్వడం, నెలకోసారి కవి సంగమం వేదిక ద్వారా కవులతో చర్చలు నిర్వహించడంతో నా సాహిత్య విస్తృతి పెరిగింది. అప్పటి వరకూ ఎటువంటి సాహిత్యం ఎక్కువగా చదివింది లేదు. ఎందుకంటే, కాలేజ్ టైంలో నేను చదివిన మొదటి కవిత్వం శ్రీశ్రీ గారి మహా ప్రస్థానం, సినారె రాసిన విశ్వంభర, తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి. అప్పటివరకూ శ్రీశ్రీ, సినారె,తిలక్ కవిత్వమే నాకు తెలుసు. ఇవి అప్పుడు పాఠాలుగా ఉండేవి కాబట్టి చదవగలిగాను.

అలా నా కవిత్వ ప్రయాణం మొదలైంది. నాలాగే ఎంతోమంది కవిత్వం గురించి వెతుకుతున్న విషయాన్ని గమనించాను. దానికోసం, కవిత్వం నేర్చుకోవడానికే వేదిక అవసరమని ‘కవిత్వశాల’ అనే గ్రూపుని ప్రారంభించాను.

3. మీ కవిత్వానికి ప్రేరణ ఏంటి? మీ కవిత్వ దృష్టి ఎలా ఉంటుంది ?

నా కవిత్వానికి ప్రేరణ అంటే.. ఏవైతే సంఘటనలు అతలాకుతలం చేస్తాయో వాటిని కవిత్వ రూపంలో రికార్డు చేస్తాను. ఏవైనా సందర్భాల గురించి మాట్లాడకుండా, రాయకుండా ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సహజంగా ఏ కవికైనా ఉండే సంధిగ్ధత ఇది. ఏ కవైనా తన చుట్టూ ఉన్న పరిస్థితులని, సంఘటనలని, ప్రాథమికంగా చూసి వాటిపట్ల స్పందిస్తూ ఉంటాడు. సున్నితత్వం, భావుకత్వం ఎక్కువున్న వాళ్లైతే భావకవిత్వం రాస్తారు. సమాజం పట్ల చింతన, బాధ్యతను ఎక్కువగా స్వీకరించే వారైతే సామాజిక కవిత్వాన్ని రాస్తారు. అట్లా నా విషయం వచ్చేప్పటికీ నేను భావకవిత్వంతో రాయటం మొదలుపెట్టినప్పటికీ కూడా తర్వాత ఎలాంటి కవిత్వం రాయాలి అని నన్ను నేను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాను. అంటే, ఎటువైపు ఉండి రాయాలి, ఎవరి పక్షాన ఉండి మాట్లాడాలి, నా కవిత్వం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండాలనే ప్రశ్నలు నన్ను విపరీతంగా వెంటాడాయి.

అలాంటి సందిగ్ధ స్థితిలో ఉన్నప్పుడు లక్ష్మింపేటకు సంబంధించిన సంఘటన జరిగింది. ఆ దురాగతం మీద కవితా సంకలనం కోసం నా కవిత అడిగారు. అదే నేను రాసిన మొదటి సామాజిక కవిత్వం అనుకుంటాను. ఆ తర్వాత, ఆ సంఘటన ప్రభావంతో నా మూలాల్లోకి వెళ్లి తెలుసుకోవడం మొదలుపెట్టాను. అణచివేత గురించి అవగాహన చేసుకున్నాను. దళితవాదం, బహుజన వాదం, స్త్రీ వాదం ఇలా అనేక వాదాలను తెలుసుకున్నాను. సమాజాన్ని లోతుగా పరిశీలించడం మొదలుపెట్టాక ఎందుకు రాయాలి అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కున్నాను. అలా ప్రేమ కవిత్వం, భావ కవిత్వం నుంచి చాలా ముందుకు ప్రయాణించాను.

నన్ను ప్రేరేపించే అంశాలేవంటే..ఏవైతే ఎదుటివారి సంఘర్షణ నా సంఘర్షణగా మారుతాయో, వారు మాట్లాడలేని వాటిని, వారు ప్రతిఘటించాలనుకునే అంశాల పట్ల వారి గొంతుగా మారి నేను నిలబడతాను. బాధితుల కష్టాలతో నేను మమేకమై వారి బాధను నా బాధగా చేసుకోగలుగుతాను. బలహీన పక్షాల తరపున నుంచోవటాన్ని నేను ఎక్కువగా ఇష్టపడతాను.

4. స్త్రీల కవిత్వానికీ, పురుషుల కవిత్వానికీ వ్యత్యాసం గురించి?

స్త్రీల కవిత్వమని, పురుషుల కవిత్వమని తేడాలుండవనుకుంటాను. అయితే, వస్తువులను ఎంచుకోవడంలో ఆ తేడా కనిపిస్తుంది. అంటే, స్త్రీల సమస్యల గురించి రాయాల్సి వచ్చినప్పుడు కవి రాసిన దానికంటే కవయిత్రి రాసిన కవిత్వంలో తీక్షణత ఎక్కువగా ఉంటుంది. నా కవితలను నా పేరు లేకుండా మీరు చదవగలిగితే, అవి కవి రాసిందా, కవయిత్రి రాసిందా గుర్తించడం కష్టమవుతుంది. నా వరకూ కవిత్వ వస్తువు విస్తృతిని పెంచడానికి, దాని పరిధులని విస్తరించడానికి కొన్నిసార్లు జండర్‌ని దాటి చూడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఒక వస్తువు తీసుకున్నాక అందులోని అంశం గురించి గట్టిగా మాట్లాడాల్సి వచ్చినపుడు ఒక స్త్రీగా నేనెలా ప్రతిస్పందించాలి అనుకున్నప్పుడు మాత్రమే నేనొక కవయిత్రిగా మాట్లాడతాను.

5. మీరు రెండు పుస్తకాలు అచ్చు వేశారు కదా! తొలి పుస్తకానికి, రెండో పుస్తకానికి మధ్య ఎలాంటి మార్పుని గమనించారు?

నా మొదటి పుస్తకంలోని కవితలన్నీ 2014లోనే ముందుమాట రాయటానికి ఇచ్చాను. ముందుమాట వచ్చేనాటికి కొన్ని కవితలను తొలగించి, ఇతర కవితలను చేర్చడం జరిగింది. అంటే, ప్రతిసారి మనిషి కాలంతో పాటు మారుతుంటాడు, కాలంతో పాటే పరిగెడుతుంటాడు. ఎప్పటికప్పుడు పరిణతి పెరుగుతూ ఉంటుంది. అలా సమస్యల పట్ల, సంఘటనల పట్ల, తీసుకుంటున్న వస్తువుల పట్ల అవగాహన ఏర్పడుతుంది. అది పరిణతిమీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు అంతకుముందు విషయం పట్ల అవగాహన పూర్తీగా మారొచ్చు కూడా. అయితే, నేను మాటలమడుగు సంపుటి వేసినప్పుడు నా కవితల్లో దాక్కుని మాట్లాడిన కవిత్వం ఎక్కువ ఉంటుంది. అంటే, నైరూప్యత కలిగిన కవిత్వం అన్నమాట. అక్కడినుంచి నా రెండో సంపుటి ‘కాలం వాలిపోతున్న వైపు’ వచ్చే వరకూ..మధ్య కాలంలో ఎన్నో రాజకీయ పరమైన, సామాజికపరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటికి నా దృష్టికోణం కూడా మారింది.

నోట్ల రద్దు, బీఫ్ తినకూడదనే ఆంక్షలు..దాడులు, ఉనికికి సంబంధించిన ప్రశ్నలు, దళితుల మీద జరుగున్న దాడులు పెరగడం..ఇలాంటి సంఘటనలన్నీ చాలా వేదన కలిగిస్తాయి. ‘మాటల మడుగు’ నుంచి ‘కాలం వాలిపోతున్న వైపు’ వరకూ నాతో పాటు నా చుట్టూ వారందరూ వీటికి బాధితులుగా కనిపించారు. ఎవరిని కదిలించినా అదే వేదన. ఎవరితో మాట్లాడినా దుఃఖం పొంగుకొచ్చేది. వాటన్నిటినీ బయటకు ఎలా చెప్పాలి. ఇదంతా కూడా సామూహిక రోదన. ఇది బయటకు పోవడానికి ఒక గొంతు కావాలి. ఆ గొంతు నేనే అవ్వాలనిపించింది.

‘కాలం వాలిపోతున్న వైపు’లో అన్నీ అలాంటి కవితలే ఉంటాయి. అందులోని కవిత్వాన్ని చదివితే మీకు అర్థమైపోతుంది. ‘కాలం వాలిపోతున్న వైపు’లో నేను దాక్కోడానికి ఇష్టపడలేదు. జరుగుతున్న విషయాన్ని ధైర్యంగా మాట్లాడిన కవిత్వమది. నా రాజకీయ దృక్పథం ఏంటనేది చాలా స్పష్టంగా ఉంటుంది. కవిత్వ వస్తువులన్నీ చదివితే ప్రతీ కవితలో స్పష్టంగా నేను ఏ దృక్పథంలో కవిత్వం రాస్తున్నాను, ఎంచుకున్న అంశాలేంటి, నా రాజకీయ అవగాహన ఏంటి, ఒక స్త్రీగా నేను సమాజాన్ని ఎలా చూస్తున్నాను, కవయిత్రిగా సమాజాన్ని ఎలా పరిశీలిస్తున్నాను అనేది సుస్పష్టంగా తెలుస్తుంది.

6. దళిత సాహిత్యంలో మహిళల పాత్ర గురించి ?

మెయిన్ లైన్ సాహిత్యంలో అందునా స్త్రీల సాహిత్యంలో .. సాహిత్యానికి ఎక్కువ contribute చేస్తున్నది దళిత రచయిత్రులేనని నా నమ్మకం. దళిత సాహిత్యంలో కూడా స్త్రీల రచనలు విరివిగా వస్తున్నాయి. వినోదిని మాదాసు, జూపాక సుభద్ర, గోగు శ్యామల, మానస ఎండ్లూరి, జాజుల గౌరీ, రజిత కొమ్ము ఇంకా చాలా మంది దళిత రచయిత్రులు, కవయిత్రులు తమ అనుభవాలను రచనల ద్వారా సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు. అయితే మారుతున్న ఈ కాలంలో ఇంకా సంఘటితంగా రచనలు చేస్తూ మా గొంతుల్ని బలంగా వినిపించాల్సిన సమయం ఇది.

7. పెరుగుతున్న టెక్నాలజీతో మహిళల్లో, సమాజంలో మీ కవిత్వం ఏ మార్పు తెస్తుందని భావిస్తున్నారు ?

ఒకప్పుడు స్త్రీలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు వేరు. ఇప్పుడు స్త్రీలు ఎదుర్కుంటున్నటువంటి సమస్యలు వేరు. ఒకప్పుడు విద్యావంతులైన స్త్రీలు తక్కువమంది. ఇప్పుడు స్త్రీల విద్యకు ప్రాధాన్యత పెరిగింది. స్త్రీలు అన్ని రంగాల్లో నైపుణ్యాన్ని సాధించారు, సాధిస్తున్నారు. ఇప్పటి మహిళలు ఇంతకుముందు తరం కంటే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కానీ వాళ్లు వాటన్నిటినీ అధిగమిస్తూ రాణిస్తున్నారు. ఎంత సాధిస్తున్నప్పటికీ మహిళల మీద ఒత్తిడి ఇంకా పెరుగుతోంది. మహిళలను ప్రోత్సహిస్తున్న స్థితి ఒకవైపు ఉంది. అలాగే వారిపై వివక్ష చూపిస్తున్న సందర్భాలు కూడా పెరుగుతున్నాయి. ఆ వివక్ష కొత్త రూపాలను సంతరించుకుంటోందంతే. అన్నిరకాలుగా ఎదుగుతున్న స్త్రీలను నిరూత్సాహపరిచే సంఘటనలను కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ ప్రత్యక్షంగా జరిగేవి కొన్నైతే, పరోక్షంగా ఎక్కువ ఉన్నాయి. దీనికి సాహిత్య ఏం చేయగలదు అంటే, అద్దంలాగా..వాళ్లను వారు విశ్లేషించుకోవడానికి, పునఃపరిశీలించుకోవడానికి, మూల్యాంకనం చేసుకుని తమలో తాము మార్పు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది.

8. ప్రస్తుతం సమాజంలోని పరిస్థితులను కవయిత్రిగా మీరు ఎలా చూస్తారు?

సాహిత్యం ఎప్పుడూ సమాజహితాన్ని కోరుతుంది. సమాజం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటుంది. అంటే సాహిత్యాన్ని చదవటం వల్ల. మనిషి తనని తాను పునః సమీక్షించుకుంటాడన్నమాట. మనం ఇందాక మాట్లాడుకున్నాం..తనని తాను సమాజంలో ఎలా ప్రతిబింబించేలా చూసుకోవాలి అనేదానికి సాహిత్యం తోడ్పడుతుందని. ప్రస్తుతమున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పోటీ తత్వం పెరిగిపోవడం, మనిషికి మనిషే శత్రువు అనే భావన ఏర్పడటం. వర్గ విభజనలు, జాతి విభేధాలు ఇవ్వన్నీ కూడా మనుషులు ఒకరినొకరు నమ్మలేని పరిస్థితి. ప్రపంచం టెక్నాలజీతో ఎంత విశాలమవుతోందో, మనిషి అంతకంతకూ కుంచించుకుపోతున్నాడు. అలాంటి సందర్భాలు ఏర్పడుతున్నాయి. పక్కన మనిషి ఉన్నా పలకరించని స్థితిలోకి వచ్చేశాం. ఎటువంటి గోడలు కట్టుకుని మనం బ్రతుకుతున్నామంటే..ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

సీఏఏ, ఎన్ఆర్‌సీకి సంబంధించి మతాల వారీగా విడిపోయిన మనుషులు భయపడుతూ జీవిస్తున్నారు. షాహీన్ భాగ్, జామియా యూనివర్శిటీలోని విద్యార్థులు ఇంకా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రజల మీద దాడులు ఆందోళన కలిగించే అంశాలు. అంటే, ఎప్పుడు ఏ రకమైన దాడి జరుగుతుందో ఊహించలేని భయానక వాతావరణం. మూక దాడులు జరగడం లాంటివి చూస్తే కొందరి ఉనికే ప్రశ్నార్థమైన స్థితిలో మనుషులందరూ అలజడిని ఎదుర్కొంటున్నారు. అటువంటి సందర్భంలో మనం ఉన్నామిపుడు. హర్షించదగ్గ విషయమేంటంటే, ఇట్లాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా స్త్రీలు ముందుకొచ్చి తమ గొంతును చాలా బలంగా వినిపిస్తున్నారు.

ఇంటర్వ్యూ : సత్యగోపి



Next Story

Most Viewed