అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు బంద్…

by Shyam |
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు బంద్…
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ను పది రోజుల పాటు కంటిన్యూ చేస్తున్నా జనం గుమికూడే కొన్ని కార్యకలాపాలను మాత్రం బంద్ చేసింది. సినిమాహాళ్ళు, ఎమ్యూజ్‌మెంట్ పార్కులు, క్లబ్‌లు, పబ్‌లు, స్విమ్మింగ్ పూల్, జిమ్‌లు, స్టేడియంలు తదితరాలతో పాటు హోటళ్ళలో సిట్టింగ్‌ను బంద్ పెట్టింది. కేవలం పార్సిల్ సేవలకు మాత్రమే హోటళ్ళు పరిమితం కావాలని ప్రధాన కార్యదర్శి ఆదివారం జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. మంత్రివర్గం నిర్ణయం మేరకు లాక్‌డౌన్‌ను పది రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయించినందున ఏయే కార్యకలాపాలపై ఆంక్షలు, సడలింపులు ఉన్నాయో ప్రధాన కార్యదర్శి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులను పూర్తిగా రద్దు చేసినందున ఆయా ప్రభుత్వాలు జారీ చేసిన ఈ-పాస్‌లు ఉన్నవారిని మాత్రమే తెలంగాణలోకి అనుమతించనున్నట్లు స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలకు నడిచే ప్రైవేటు ట్రావెల్ బస్సులు పూర్తిగా నిలిచిపోనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీ బస్సులు సైతం రాష్ట్రం లోపల జిల్లాల మధ్యన మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే తిరుగుతాయని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో గూడ్సు వాహనాలు రాత్రి 9.00 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 11.00 గంటల మధ్యలోనే రాకపోకలు సాగిస్తాయన్నారు. కానీ కొత్త వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకోడానికి సడలింపుల సమయంలో మాత్రమే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

పెళ్ళిళ్ళకు గరిష్ఠంగా 40 మంది, అంత్యక్రియలకు ఇరవై మందిని మాత్రమే అనుమతించనున్నట్లు స్పష్టం చేశారు. అన్ని మతాల ప్రార్థనాలయాలు మూసివేసే ఉంటాయని తెలిపారు. రాజకీయ సభలు, సమావేశాలు, క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యకలాపాలు కూడా బంద్ అవుతాయని తెలిపారు.

Advertisement

Next Story