ఆగస్టు నాటికి ప్రతి గ్రామపంచాయతీకి ఇంటర్నెట్

by Shyam |
ఆగస్టు నాటికి ప్రతి గ్రామపంచాయతీకి ఇంటర్నెట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆగస్టు నాటికి ప్రతీ గ్రామ పంచాయతీకి ఇంటర్‌నెట్‌ కనెక్షన్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పరిధిని తెలంగాణలోని అన్ని మునిసిపాలిటీలకు వర్తించేలా విస్తరించాలని టీ ఫైబర్ గ్రిడ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ బోర్డ్ మీటింగ్ ‌ను గురువారం టీ-హబ్ లో నిర్వహించారు. ఫైబర్ గ్రిడ్ పనుల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు.

మిషన్ భగీరథ పనులు పూర్తయిన గ్రామీణ ప్రాంతాల్లో టీఫైబర్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని, ఈ ఏడాది అగస్టు నాటికి ప్రతి గ్రామానికి టీ-ఫైబర్ కనెక్టివిటీ అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ విస్తరణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా సర్వే చేసి నివేదిక అందజేయాలన్నారు. రాష్ట్రంలోని 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు, రైతు వేదికలకు జూన్ నుంచి ప్రాధాన్యతా క్రమంలో ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని ఆదేశించారు. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు.

సమావేశంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, అర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రాస్ , మిషన్ భగీరథ ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డి, టీఫైబర్ ఎండీ. కారంపురి సుజాయ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed