వైసీపీలో గ్రూపుల లొల్లి.. ఆధిపత్యం కోసం నేతల హైరానా

by srinivas |   ( Updated:2021-12-17 22:39:48.0  )
vishaka news
X

దిశ, ఏపీ బ్యూరో : ఇన్నాళ్లూ గుంభనంగా ఉన్న వైసీపీలో గ్రూప్ రాజకీయాలు ఒకొక్కటిగా బయట పడుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు జగన్‌‌కు ఎక్కడ కోపం వస్తుందేమో అన్నట్టుగా సైలెంట్‌గా ఉన్న నేతలు 2024 ఎన్నికలకు దూరం తగ్గుతున్న వేళ తమ వర్గాన్ని బలోపేతం చేసే దిశగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకే పార్టీలోని నేతల మధ్య వర్గ పోరు బయట పడుతోంది. తాజాగా నగరి నియోజకవర్గంలోని విభేదాల గురించి ఫైర్ బ్రాండ్ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆసక్తి రేపుతున్న నగరి రాజకీయం

పార్టీ ప్రారంభం నుంచే రోజా వైసీపీకి మద్దతుగా ఉన్నారు. అయినా రోజాను మాత్రం టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తిగానే నగరి వైసీపీలోని ఆమె వ్యతిరేక వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. 2019 ఎన్నికల నాటి నుంచి నగరి వర్గ పోరులో నెట్టుకొస్తున్న ఎమ్మెల్యే ఆర్.కె.రోజా కొద్ది కాలంగా వాళ్ళని ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తనకు వ్యతిరేకంగా పనిచేసిన వర్గాన్ని కంగుతినిపించిన రోజా పార్టీ హైకమాండ్ వద్ద తనదే పైచేయిగా నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వ్యతిరేక వర్గాలన్నీ ఒక్కటయ్యాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి బర్త్ డే వేడుకలను పోటాపోటీగా నిర్వహించేందుకు రోజా వ్యతిరేక వర్గీయులు నగరి కేంద్రంగా సమావేశమై కార్యాచరణ రూపొందించుకున్నారు.

ఈనెల 21న సీఎం జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించే పేరిట ఎమ్మెల్యే రోజా భర్త ఆర్ కె సెల్వమణి, అసమ్మతి వర్గాలు వేర్వేరుగా నిన్న ఆత్మీయ సమావేశాలు నిర్వహించాయి. మున్సిపల్ మాజీ అధ్యక్షుడు కేజే కుమార్, ఆయన భార్య రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్ కే.జే శాంతి, శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, వడలమాలపేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి, పుత్తూరు నుంచి అమ్ములు, విజయపురం నుంచి పార్టీ మాజీ అధ్యక్షుడు లక్ష్మీపతిరాజు సమావేశానికి హాజరయ్యారు. ఎమ్మెల్యేలతో కలిసి కాకుండా ప్రత్యేకంగా సీఎం జన్మదిన వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే నుంచి తమకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆత్మీయ సమావేశంలో చర్చించారు.

Roja

రోజాను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. ఆది నుంచి పార్టీకి పని చేస్తున్న నేతలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ వర్గం ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని అందలం ఎక్కించి నగరిలో పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రమంతా వైసీపీ అధికారంలో ఉంటే నగరిలో మాత్రం టీడీపీ నాయకుల పాలన సాగుతోందని రోజాను కార్నర్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. అయితే ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి నిర్వహించిన సమావేశంలో మాత్రం కేవలం ముఖ్యమంత్రి జన్మదిన ఏర్పాట్లపైనే చర్చించారు.

ఎమ్మెల్యే రోజాకు అనుకూలంగా ఉన్న వర్గం ముఖ్యమంత్రి జన్మదిన ఉత్సవాలను వేడుకగా నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారు. రోజా మాత్రం పార్టీ కోసం తానెంత కష్టపడిందీ అన్నది హైకమాండ్‌‌కు తెలుసు అన్న ధీమాతోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ పుట్టిన రోజు డిసెంబర్ 21 న ఏం జరుగుతుంది అన్న ఆసక్తి అందరినీ నగరి వైపు చూసేలా చేసింది.

తూర్పుగోదావరి జిల్లాలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే

తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ ప్రజా ప్రతినిధుల మధ్య విబేధాలు ఇటీవల రచ్చకెక్కాయి. ఈ జిల్లాలో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య గతం నుంచి విభేదాలు ఉన్నాయి. వీరి మధ్య ఆధిపత్య పోరు ఇతర వివాదాల నేపథ్యంలో గతంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వారితో మాట్లాడి సయోధ్య కుదిర్చారు. ఆ తర్వాత కొంత కాలంగా బాగానే ఉన్నా ఇటీవల చోటుచేసుకున్న ఓ వివాదంతో వారి మధ్య విబేధాలు తారస్థాయికి చేరి బాహాటంగానే విమర్శించుకుంటున్నారు. వీరి మధ్య ఏర్పడిన విభేదాలు సీఎం జగన్ దృష్టిలోనూ పడ్డాయి. ఈ ఇద్దరు యువ నేతలకూ తమ తమ సామాజిక వర్గాల్లో తిరుగులేని మద్దతు ఉండడంతో రానున్న ఎన్నికల నాటికి వీరు ఏకతాటిపైకి రావడం పార్టీకి చాలా కీలకం.

YCP

పశ్చిమలోనూ ఇదే తంతు

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు మొదటి నుండి పార్టీకి ఇబ్బంది కరంగా మారింది . గత కొన్ని రోజులుగా వైసీపీలో విభేదాలు నెలకొన్నాయని.. ఒకరంటే ఒకరికి పడట్లేదని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు కొంతకాలం క్రితం ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఉండి నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు ఉన్న మాట నిజమేనన్నారు. నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోవడానికి కారణం ఈ గ్రూపు రాజకీయాలే అని ఆయన వ్యాఖ్యానించారు. గ్రూప్ రాజకీయాలు మానకపోతే తమ నాయకులకు ఏమీ కాదని.. మధ్యలో పోయేది మీరేనంటూ సర్రాజు వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. నిజానికి పార్టీ మొదలుపెట్టినప్పుటి నుంచి ఇక్కడ వైసీపీ అసలు బోణీనే చేయలేదు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ ఓటమి పాలయ్యింది. 2019లో వీచిన వైసీపీ ప్రభంజనంలో సైతం ఇక్కడ పార్టీ ఓడిపోవడానికి వర్గ పోరే కారణం అని విశ్లేషకులు అంటారు.

కృష్ణాజిల్లా గన్నవరంలో మూడు ముక్కలాట

వైసీపీలో కృష్ణా జిల్లా గన్నవరం రాజకీయాలే వేరు. ఇక్కడ రాజకీయంగా మూడు ముక్కలాటగా కొనసాగుతోంది. టీడీపీలో గెలిచి వైసీపీకి మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నియోజకవర్గంలో మాత్రం వైసీపీ నుంచి మద్దతు కరువవుతోంది. సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు, వంశీ పై పోటీ చేసి ఓడిన యార్లగడ్డ వెంకట్రావు వర్గాలు ఇప్పటికీ వంశీని తమ నేతగా ఒప్పుకోవడం లేదు. పైగా కొంతకాలం క్రితం వంశీని అద్దె నాయకుడుగా యార్లగడ్డ వ్యాఖ్యానించడం పెద్ద దుమారాన్నే లేపింది.

YCP

పెద్ద తలకాయలది ఇదే దారి

ఎంపీ విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మధ్య కూడా అంతర్గత ఆధిపత్య పోరు ఉందని ఆ పార్టీ నేతలే అంటుంటారు. ఒకప్పుడు జగన్‌కు అత్యంత ఆప్తుడైన సలహాదారు స్థానంలోకి ప్రస్తుతం సజ్జల చేరారని అంటున్నారు. వైసీపీ అసమ్మతి నేత ఐన రఘురామకృష్ణంరాజు కూడా కొన్నాళ్ల క్రితం విజయసాయిరెడ్డి, సజ్జల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నదని బహిరంగంగా వ్యాఖ్యానించారు. విపక్షాలు కూడా సజ్జలను షాడో సీఎం అంటూ కామెంట్ చేస్తున్నాయి. పార్టీ గెలిచిన మొదట్లో జగన్‌కు అన్నీ తానై వ్యవహరించిన విజయసాయి ప్రస్తుతం పార్టీ పరంగా ఢిల్లీ రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి రానున్న రోజుల్లో సజ్జల వర్సెస్ విజయసాయి ఎపిసోడ్ ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

జగన్ దృష్టి పెట్టాల్సిందే

ఒక్కసారిగా 151 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి దూసుకొచ్చిన జగన్‌కు పాలనా పరంగా ఎదురవుతున్న సమస్యలతో పాటు, రెండున్నరేళ్ల తర్వాత పార్టీ పరంగా ఎదురవుతున్న చిక్కులు ఇబ్బంది పెడుతున్నాయి. ఇవి మరింత ముదిరి చిక్కుముడిగా మారక ముందే పార్టీలోని అంతర్గత విభేదాలకు చెక్ పెట్టాలని పార్టీ అభిమానులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed