ఏం జరుగుతుందో..? రెండు రాష్ట్రాల్లో టెన్షన్.. టెన్షన్

by srinivas |   ( Updated:2021-10-08 09:48:25.0  )
Krishna-River
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై ఆసక్తి మొదలైంది. కేవలం మరో ఐదు రోజుల్లో ప్రాజెక్టులన్నీ బోర్డుల పరిధికి వస్తాయా..? లేదా? అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికైతే కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల చైర్మన్లతో కేంద్ర జలశక్తి వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. మరోవైపు గెజిట్ అమలుకు సూచించిన విధంగా ఇప్పటికీ రెండు రాష్ట్రాలూ ఎటూ ముందడుగు వేయలేదు. నిధులు విడుదల చేయలేదు. అంతేకాకుండా ఇంజినీర్లను కేటాయించలేదు. అయితే తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్‌లో మాత్రం గెజిట్ అమలు వాయిదా పడుతుందనే ధీమా వ్యక్తమవుతోంది.

కామన్ ప్రాజెక్టులకే పరిమితమా..?

రెండు రాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి నదుల పరిధిలోని ప్రాజెక్టులన్నీ బోర్డుల పరిధికి తీసుకువచ్చేందుకు కేంద్ర జలశక్తి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికోసం ఇప్పటికే గెజిట్ జారీ చేశారు. ఈ నెల 14 నుంచి గెజిట్ అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ రెండుసార్లు ఢిల్లీ టూర్ గెజిట్ అమలుపై అనుమానాలకు దారి తీసింది. దీంతో గెజిట్ అమలు వాయిదా పడుతుందనే చర్చ జరుగుతుండగా.. ఏపీ మాత్రం అమల్లోకి వస్తుందనే ధీమాతో ఉంది. మరోవైపు ముందుగా కామన్ ప్రాజెక్టులను బోర్డుల పరిధికి తీసుకువస్తారనే కొత్త ప్రచారం మొదలైంది. తెలుగు రాష్ట్రాల కామన్ ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలను బోర్డుల పరిధికి తీసుకువస్తారంటున్నారు. ఈ రెండు ప్రాజెక్టులను బోర్డుల పరిధికి తీసుకువచ్చినా తెలంగాణకు బ్రేక్ పడినట్టే.

ఎందుకంటే ఇప్పటికీ కృష్ణా వరదను అంచనా వేస్తూ ఈ రెండు ప్రాజెక్టుల్లో నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఏపీ పోతిరెడ్డిపాడు నుంచి వేల క్యూసెక్కులు, ఇతర అనుమతి లేని కాల్వల నుంచి నీటిని తరలిస్తుందని ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై ముందు నుంచీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీంతో కృష్ణా నదిపై ప్రధాన ప్రాజెక్టు శ్రీశైలం నుంచి నీటిని దిగువకు విడుదల చేసే వీలుగా విద్యుత్ ఉత్పత్తిని నిరంతరం కొనసాగిస్తోంది. అటు ఏపీ ఎంత ఫిర్యాదు చేసినా ఆపలేదు. శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు అంటూ చూపిస్తూ కొనసాగిస్తున్నారు. అటు సాగర్‌లో కూడా రన్ చేస్తున్నారు. దీంతో వరద నీరు మొత్తం సముద్రంలో కలుస్తుందని ఏపీ ఫిర్యాదులు చేస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల కామన్ ప్రాజెక్టులుగా ఉన్న ఈ రెండింటినీ బోర్డుల పరిధికి తీసుకువస్తే ముందుగా తెలంగాణకే బ్రేక్ వేసినట్టు అవుతోంది.

Advertisement

Next Story