కొలిక్కిరాని చర్చలు.. కదలని ప్రగతి రథచక్రాలు!

by srinivas |
కొలిక్కిరాని చర్చలు.. కదలని ప్రగతి రథచక్రాలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణతో పక్క రాష్ట్రాల రవాణా వ్యవస్థ అగాథంలో పడుతోంది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై తెలంగాణ పెట్టే ప్రతిపాదనలకు వ్యతిరేకత ఎదురవుతోంది. ఫలితంగా బస్సులకు బ్రేక్ పడుతోంది. ఇప్పటికే ఏపీతో ఈ వ్యవహారం ఎటూ తెగక బస్సులు తిరగడం లేదు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర కూడా తెలంగాణకు సర్వీసులను నిలిపివేసింది. అటు కర్ణాటక కూడా కేవలం ఈశాన్య కర్ణాటక సంస్థ నుంచి మాత్రం ఒకే జోన్‌లో బస్సులు నడుపుతోంది. నార్త్ సంస్థ నుంచి బస్సులను ఆపేశారు. ఈశాన్య సంస్థ నుంచి తిప్పుతున్న దానిపై కూడా కర్ణాటక త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. తెలంగాణ పెడుతున్న కిలోమీటర్ల ప్రతిపాదనలకు ఏపీ మినహా మిగిలిన రెండు రాష్ట్రాల నుంచి సమాధానం రావడం లేదు. తెలంగాణ ప్రభుత్వం పంపిన లేఖలను పట్టించుకోవడం లేదు. ఏండ్ల నుంచి లేని ఈ విధానం కొత్తగా తెరపైకి తేవడంపై పక్క రాష్ట్రాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.

మేం తిప్పం..

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు కూడా తెలంగాణ ఆర్టీసీ నుంచి లేఖలు అందాయి. ఏపీతో పెట్టిన విధంగానే కిలోమీటర్ల ప్రాతిపదికన బస్సు సర్వీసులు నడుపుదామంటూ లేఖలో పేర్కొన్నారు. దీనిపై మహారాష్ట్ర వెంటనే స్పందించి అటు నుంచి వచ్చే సర్వీసులన్నీ నిలిపివేసింది. మహారాష్ట్ర నుంచి ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలకు బస్సులు నడిపిస్తున్నారు. దీంతో ఏ రాష్ట్రం నుంచి ఎన్ని కిలోమీటర్లు తిప్పుతున్నారని, ఆ విధంగానే తెలంగాణతో అంగీకారం చేసుకోవాలని, ఆ రాష్ట్రాల భూభాగంలో తెలంగాణ తిప్పుతున్న సర్వీసులపై తేల్చుకుందామంటూ పక్క రాష్ట్రాలకు సూచించారు. ఈ పరిణామాల్లో పండుగ సమయంలో మహారాష్ట్ర నుంచి సర్వీసులన్నీ ఆపేశారు. అటు కర్ణాటక నుంచి కూడా సర్వీసులు ఆపేశారు. కేవలం ఈశాన్య కర్ణాటక సంస్థ నుంచి ఉమ్మడి పాలమూరు మీదుగా ఆ రాష్ట్ర బస్సులు విచ్చలవిడిగా ఉంటాయి. కానీ తెలంగాణ లేఖ రాసిన నాటి నుంచి సర్వీసులను గణనీయంగా తగ్గించారు. కేవలం 2 శాతం మాత్రమే నడుపుతున్నారు. త్వరలోనే దీనిపై కూడా నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

విజయవాడ బస్సులు తగ్గించాలి

ఏపీతో అంతర్రాష్ట్ర సర్వీసులపై ఈ నెల 23న ప్రతిపాదనలు పంపించారు. తెలంగాణ డిమాండ్ మేరకు కిలోమీటర్లను తగ్గిస్తూ, రూట్లను ఖరారు చేస్తూ ఏపీ ప్రతిపాదనలు పంపింది. పండుగ సమయంలో అవకాశం ఇవ్వాలని, కనీసం 200 బస్సులను అత్యవసరంగా నడుపుదామంటూ ఏపీ సూచించింది. అయితే ఏపీ ప్రతిపాదనలు తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. కొన్ని సవరణలు చేయాలని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పినట్లు ఆర్టీసీ అధికారులు చెప్పారు. దీనిలో ప్రధానంగా విజయవాడ రూట్‌పైనే చాలా ఆంక్షలు పెట్టినట్లు తెలుస్తోంది.

ఏపీ, తెలంగాణ అంతర్రాష్ట్ర సర్వీసుల్లో విజయవాడ రూటే ప్రధానం. ఇక్కడికే ఎక్కువ బస్సులు నడుపుతున్నారు. కానీ విజయవాడకు సర్వీసులను తగ్గించాలని సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రతిపాదనలపై ఏపీ స్పందించింది. శనివారం ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. తెలంగాణ చెప్పిన ప్రతి డిమాండ్‌కు ఏపీ ఒప్పుకుందని, కిలోమీటర్లు తగ్గించుకుంటామని, దీనికి సిద్ధంగా ఉన్నామంటూ తేల్చి చెప్పారు. కాగా ఏపీ, తెలంగాణ మధ్య అంతరాష్ట్ర సర్వీసులపై మంగళవారం చర్చించనున్నారు. ఆ సమావేశంలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Advertisement

Next Story