కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణపై ఎన్జీటీలో విచారణ

by  |
కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణపై ఎన్జీటీలో విచారణ
X

దిశ, న్యూస్‌బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ విస్తరణ పనులపై బుధవారం చెన్నై ఎన్జీటీలో విచారణ జరిగింది. దీనిపై మెదక్ జిల్లా వేములఘాట్ భూ నిర్వాసితులు పిటిషన్ దాఖలు చేశారు. పర్యావరణ అనుమతులు లేకుండా భారీ విస్తరణ పనులు చేపట్టారని పిటిషనర్లు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రెండు టీఎంసీలు ఎత్తిపోతలకు మాత్రమే పర్యావరణ అనుమతులు ఉన్నాయని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా… పనులు చేస్తున్నారని, ఈ పనులు జరపకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. మూడో టీఎంసీకి సంబంధించిన పనులు చేస్తున్నారని వెల్లడించారు. ఇక విచారణ సందర్భంగా కాళేశ్వరం పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ఢిల్లీ బెంచ్‌లో పెండింగ్‌లో ఉన్న విషయంపై ఎన్జీటీ బెంచ్ ఆరా తీసింది. ఒకే ప్రాజెక్టుపై రెండు బెంచ్‌ల్లో విచారణ సాధ్యమవుతుందా అని చెన్నై బెంచ్ న్యాయ విభాగం సభ్యుడు జస్టిస్ రామకృష్ణన్ ప్రశ్నించారు.

ఢిల్లీలో పెండింగ్ కేసుకు ప్రస్తుత కేసుకు సంబంధం లేదని, తెలంగాణ చెన్నై బెంచ్ పరిధిలో ఉందని, దీంతో సౌత్‌జోన్ బెంచ్‌లో కేసు వేశామని పిటిషనర్ల తరుపు న్యాయవాది శ్రావణ్ కుమార్ వివరించారు. కేసు విచారణ చెన్నై బెంచ్ చేసినా… ఢిల్లీ ప్రధాన బెంచ్‌కు బదిలీ చేసినా తమకు అభ్యంతరం లేదని పిటిషనర్ల తరుపు న్యాయవాది పేర్కొన్నారు. ఢిల్లీ బెంచ్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు కేసు పెండింగ్‌లో ఉన్న కారణంగా చెన్నైలో విచారణ సరికాదని తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు ధర్మాసనానికి విన్నవించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణపై దాఖలైన పిటిషన్ చెన్నైలో విచారించే అవకాశాలు ఉన్నాయని లేవా అనే విషయాలపై ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ ప్రధాన బెంచ్‌కు సూచించారు. దీంతో కాళేశ్వరం మూడో టీఎంసీకు పర్యావరణ అనుమతులపై కేసు విచారణ ఆగస్టు 5కు వాయిదా పడింది.

ఇప్పుడేం చేయాలి

మూడో టీఎంసీ విస్తరణ పనులపై ఎన్జీటీ విచారణ చేపట్టిన నేపథ్యంలో ఈ పనులపై ముందుకు పోవాలా… వద్దా అనే విషయంపై తెలంగాణ ప్రభుత్వం ఆరా తీస్తోంది. న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తోంది. ఇప్పటికే చాలా మేరకు పనులు చివరి దశకు వచ్చాయి. లింకు పనులను పూర్తి చేస్తే సెప్టెంబర్ నాటికి మూడో టీఎంసీ నీటిని ఎత్తిపోయవచ్చు. దీనికి సంబంధించిన నిధులు కూడా ప్రభుత్వం అందుబాటులో పెట్టింది. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుమతులపై విచారణ సాగుతుండటంతో ఏం చేయాలనే సమాలోచనలో పడ్డారు. అయితే కొత్తగా పర్యావరణానికి ఇబ్బందులేమీ రావని, ముందుగా తీసుకున్న పరిమితుల్లోనే మూడో టీఎంసీ పనులు చేస్తున్నట్లు ప్రభుత్వం వివరణ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దీనిపై ఢిల్లీ బెంచ్‌కు సైతం నివేదికలు సమర్పించినట్లు తెలుస్తోంది. మూడో టీఎంసీ కోసం విస్తరణ పనులకు కొత్తగా భూ సేకరణ లేదని, పర్యావరణం దెబ్బతినదనే వివరాలన్నీ నివేదికల్లో పొందుపర్చారు. దీంతో ఎన్జీటీలో కేసు నిలుస్తుందా లేదా అనేది కూడా అనుమానంగానే ఉంది.



Next Story

Most Viewed