జూన్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ లాభాలు రూ. 5,195 కోట్లు

by Harish |
జూన్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ లాభాలు రూ. 5,195 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 5,195 కోట్ల నికర లాభాలను ఆర్జించినట్టు బుధవారం వెల్లడించింది. అంతకుముందు త్రైమాసికంలో నమోదైన రూ. 5,076 కోట్లతో పోలిస్తే ఈసారి 2.3 శాతం పెరిగిందని కంపెనీ తెలిపింది. వార్షిక ప్రాతిపదికన 22.7 శాతం పెరిగిందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇన్ఫోసిస్ ఆర్థిక పనితీరు మార్కెట్ అంచనాల కంటే తక్కువగా ఉన్నప్పటికీ కంపెనీ పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి మెరుగ్గా ఉంది. దీంతో జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 17.8 శాతం పెరిగి రూ. 27,986 కోట్లకు చేరుకుందని, గతేడాది ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ. 23,665 కోట్లుగా నమోదైనట్టు వివరించింది.

సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం 2.6 బిలియన్ డాలర్ల(రూ. 19.38 వేల కోట్ల) విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలిపింది. ‘ఉద్యోగుల అంకితభావంతో పాటు ఖాతాదారుల నమ్మకం నేపథ్యంలో దశాబ్దం కాలంలోనే జూన్ త్రైమాసికం కంపెనీకి వేగవంతమైన వృద్ధిగా ఉందని’ ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ సలీల్ పరేఖ్ అన్నారు. కంపెనీ డిజిటల్ ఆదాయం మొత్తం ఆదాయంలో 53.9 శాతంగా ఉందని ఇన్ఫోసిస్ పేర్కొంది. కాగా, కంపెనీ ఆర్థిక ఫలితాల నేపథ్యంలో షేర్ ధర 2 శాతానికి పైగా పెరిగి రూ. 32.45 వద్ద ట్రేడయింది. బుధవారం నాటి ర్యాలీలో దేశీయ మార్కెట్ల లాభాలకు ప్రధాన మద్దతుగా ఇన్ఫోసిస్ షేర్లు నిలిచాయి.

Advertisement

Next Story

Most Viewed