ఉగ్ర కృష్ణమ్మ.. ఆల్మట్టికి 2లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

by  |
ఉగ్ర కృష్ణమ్మ.. ఆల్మట్టికి 2లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
X

దిశ, న్యూస్‌బ్యూరో: కృష్ణా పరివాహన ప్రాంతంలో వరద ముంచెత్తుతోంది. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద పెరిగింది. కోయినా ప్రాజెక్టుకు మూడు లక్షలకుపైగా వరద వచ్చి చేరుతోంది. ఇక కృష్ణా బేసిన్‌లోని ఆల్మట్టి ప్రాజెక్టుకు గురువారం రాత్రి వరకు 2.20 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. బుధవారం వరకు 6వేల క్యూసెక్కులతో ఉన్న వరద ఒక్కసారిగా గురువారం ఉదయం వరకు 57వేల క్యూసెక్కులకు పెరగ్గా రాత్రి 8గంటలకు 1.20 లక్షలు వచ్చి చేరుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు 98టీఎంసీల నిల్వతో ఉండగా వరద కొనసాగే అవకాశాలుండటంతో వచ్చిన వరదను వచ్చినట్టే వదులుతున్నారు. దిగువన ఉన్న నారాయణపూర్ రిజర్వాయరుకు గురువారం ఉదయం 13వేల క్యూసెక్కుల వరద వస్తుండగా రాత్రివరకు 1.50 లక్షల క్యూసెక్కులు నమోదైంది. గంట గంటకూ వరద పెరుగూత వస్తోంది. నారాయణపూర్‌కు గురువారం రాత్రి 9గంటల వరకు ఇన్‌ప్లో 70వేల క్యూసెక్కులకు పెరగడంతో ఔట్‌ఫ్లో కూడా పెంచారు. ఔట్ ఫ్లో 78,900 క్యూసెక్కులుగా ఉండగా, అర్థరాత్రి వరకు 1.50లక్షల క్యూసెక్కులు అయింది. దీంతో ఈ ప్రాజెక్టు కూడా 33టీఎంసీల నిల్వతో ఉండగా వరద మొత్తాన్ని వదిలేస్తున్నారు.

ఎగువ నుంచి వరద కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టుల్లో నీటినిల్వ పెట్టరాదని, వరదను స్పిల్ వే గేట్ల ద్వారా దిగువకు వదలాలని సీడబ్ల్యూసీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎగువ నుంచి వచ్చిన వరదను మొత్తం నదిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు గురువారం ఉదయం వరకు 15వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా… రాత్రి 12వేల క్యూసెక్కులు కొనసాగుతోంది. అయితే నారాయణపూర్ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజాము వరకు లక్ష క్యూసెక్కులు వస్తుందని అధికారులు అప్రమత్తమయ్యారు. జూరాల నుంచి కూడా దిగువనకు వరదను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం 8 టీఎంసీల నీరు నిల్వ ఉండగా విద్యుత్ కేంద్రాన్ని కొనసాగిస్తూ 30వేల క్యూసెక్కులను వదులుతున్నారు. శుక్రవారం ఉదయం వరకు గేట్ల ద్వారా వరదను వదలనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఈసారి ఎగువ నుంచి వరదల ప్రవాహం చూస్తే సాగర్ కూడా నిండే అవకాశాలున్నాయి.

మరోవైపు భారీ వరదలు వస్తాయని కేంద్ర జలసంఘం కృష్ణా బేసిన్ అధికారులను అప్రమత్తం చేసింది. గురువారం రాత్రి కూడా అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 7.30 గంటల వరకే ఆల్మట్టి ప్రాజెక్టుకు 80వేల క్యూసెక్కుల నుంచి 1.20లక్షల క్యూసెక్కులకు పెరిగింది, అర్థరాత్రి దాటిన తర్వాత ఈ వరద 2.20 లక్షలకు పెరిగిందని, ఇంకా వరద వస్తుందని, దిగువన ప్రాజెక్టులు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ప్రాజెక్టు దగ్గర ఉండాలని ఆదేశాలిచ్చింది.

గోదావరి పరవళ్లు

కాళేశ్వరం ఎత్తిపోతల్లో పరిమాణం పెరగడంతో గోదావరి వరద పెరుగతోంది. లక్ష్మీ పంప్ హౌజ్‌లో 10మోటార్లతో నీటిని ఎత్తిపోస్తున్నారు. దీంతో 22వేల క్యూసెక్కులు సరస్వతి బరాజ్‌కు చేరుతున్నాయి. సరస్వతి బరాజ్‌లో 10.87 టీఎంసీలకు ప్రస్తుతం 8.34 టీఎంసీలున్నాయి. మానేరు నుంచి కూడా 2100 క్యూసెక్కులు వస్తున్నాయి. లక్ష్మీ పంపుహౌజ్ నుంచి 22వేలక్యూసెక్కులు, మానేరు నుంచి 2100 కలుపుకుని 24 వేల క్యూసెక్కులు బరాజ్‌కు వస్తున్నాయి. దీంతో సరస్వతి నుంచి ఆరు మోటార్లతో 17వేల క్యూసెక్కులను పార్వతి బరాజ్‌కు వస్తున్నాయి.

పార్వతి నిల్వ 8.83 టీఎంసీలకు ప్రస్తుతం 5.8 టీఎంసీలకు చేరింది. ఇన్‌ఫ్లో వస్తుండటంతో పార్వతి పంప్ హౌజ్ నుంచి 15,600 క్యూసెక్కులు ఎల్లంపల్లికి వస్తున్నాయి. 20టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎల్లంపల్లిలో ప్రస్తుతం 8 టీఎంసీల నిల్వ దాటింది. పార్వతి నుంచి 15,600, స్థానిక వరద వెయ్యి క్యూసెక్కులు వస్తుంది. ఎల్లంపల్లి నుంచి నంది పంపుహౌజ్‌కు 13,234 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి నంది, గాయత్రీ పంపుహౌజ్‌కు నాలుగు మోటర్లతో శ్రీ రాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నారు. రాజేశ్వర జలాశయం సామర్థ్యం 25టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.8 టీఎంసీల నిల్వ ఉంది. లింక్ -1, 2లో30 మోటార్లను నడిపిస్తున్నారు. అర్థరాత్రి వరకు వీటి సంఖ్యను 37కు పెంచుతామని అధికారులు ప్రకటించారు.


Next Story

Most Viewed