పింక్ బాల్ టెస్ట్ డ్రా

by Shyam |
Cricket
X

దిశ, స్పోర్ట్స్: ఇండియా – ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరిగిన తొలి పింక్ బాల్ టెస్టు డ్రాగా ముగిసింది. గోల్డ్‌కోస్ట్ వేదికగా గత నాలుగు రోజులపాటు జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. వర్షం కారణంగా తొలి రెండు రోజుల ఆటలో పలు సెషన్లు తుడిచిపెట్టుకొని పోయాయి. దీంతో ఫలితం తేలడం కష్టంగా మారింది. ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతమైన సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా 377/8 వద్ద డిక్లేర్ చేసింది. ఇక ఆస్ట్రేలియా మూడో రోజు 143/4 స్కోర్ వద్ద ముగించింది. నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియాకు సరైన ఆరంభమే లభించింది. ఎల్లిస్ పెర్రీ ఒక వైపు క్రీజలో పాతుకొని పోయి పరుగులు రాబట్టింది. మరో ఎండ్‌లో ఆష్లే గార్డెనర్ కూడా నిలకడగా ఆడింది. అయితే పెర్రీ చాలా నెమ్మదిగా పరుగులు రాబట్టగా.. గార్డెనర్ మాత్రం భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నది. వీళ్లిద్దరూ కలసి ఐదో వికెట్‌కు 89 పరుగులు జోడించారు. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ఆష్లే గార్డెనర్ (51) దీప్తి శర్మ బౌలింగ్‌లో మిథాలీ రాజ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యింది. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవరూ క్రీజులో నిలబడలేక త్వరగా వికెట్లు పారేసుకున్నారు. అన్నాబెల్ సూథర్‌లాండ్ (3), సోఫీ మోన్యులెక్స్ (2), జార్జియా వారెహమ్ (2), డార్సి బ్రౌన్ (8) పూర్తిగా నిరాశ పరిచారు. ఎల్లిస్ పెర్రీ (68) ఒక్కతే ఒంటరి పోరాటం చేసింది. ఇక డిన్నర్ విరామానికి ముందు ఆస్ట్రేలియా జట్టు 241/9 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఇండియాకు 142 పరుగుల ఆధిక్యం లభించింది.

లంచ్ తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ఇండియా ధాటిగా ఆడింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ (52), స్మృతి మంధాన కలసి తొలి వికెట్‌కు 70 పరుగులు చేసింది. అయితే స్మృతి మంధాన.. మోన్యులెక్స్ బౌలింగ్‌లో ఆష్లే గార్డెనర్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరింది. తర్వాత వచ్చిన యాస్తికా భాటియా (3) నిరాశ పరిచింది. పూనమ్ రౌత్ (41) మరోసారి నిలకడైన బ్యాటింగ్ చేసింది. అయితే షెఫాలీవర్మ (52) వారెహమ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. ఇక భారత జట్టు టీ విరామం ముగిసిన తర్వాత కొద్ది సేపు మాత్రమే ఆడి 135/3 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. 277 పరుగుల విజయ లక్ష్యంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆలీసా హీలీ (6), బెత్ మూనీ (11) నిరాశ పరిచారు. ఆస్ట్రేలియా జట్టు 36/2 స్కోర్ వద్ద ఉన్నప్పుడు అంపైర్లు మ్యాచ్ డ్రాగా ముగిసినట్లు ప్రకటించారు. పింక్ బాల్ టెస్టులో అద్భుత సెంచరీ చేసిన స్మృతి మంధానకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

స్కోర్:
ఇండియా ఉమెన్ తొలి ఇన్నింగ్స్ 377/8 డిక్లేర్డ్
ఆస్ట్రేలియా ఉమెన్ తొలి ఇన్నింగ్స్ 241/9 డిక్లేర్డ్
ఇండియా ఉమెన్ రెండో ఇన్నింగ్స్ 135/3 డిక్లేర్డ్
ఆస్ట్రేలియా ఉమెన్ రెండో ఇన్నింగ్స్ 36/2

Advertisement

Next Story