సడలింపు ఎవరెవరికి!

by Shyam |
సడలింపు ఎవరెవరికి!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం గత నెల విధించిన లాక్‌డౌన్ వల్ల అన్ని రంగాల్లోని పరిశ్రమల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. కొందరికి ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు ఉన్నప్పటికీ అలాంటి అవకాశంలేని చిన్నా చితక ఉద్యోగులు, కార్మికులు లక్షల మంది ఉపాధి లేక, వేతనాలు రాక, పొదుపు ఖాళీ అయ్యి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతుండటంతో పరిస్థితిని అంచనా వేసిన కేంద్రం లాక్‌డౌన్ పొడిగించడమే ఉత్తమమైన మార్గమని భావించి మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది. అయితే, ప్రజల ఇబ్బందులను తగ్గించేందుకు, జీవనోపాధి లేని వారికి ఊరట ఇచ్చేందుకు, దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం ఏర్పడకుండా ఉండేందుకు ఏప్రిల్ 20 నుంచి ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే కొన్ని పరిశ్రమలకు సడలింపు ఇవ్వాలని నిర్ణయించింది. వేటికి సడలింపు ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం!

పరిశ్రమలు, తయారీదారులు, సేవా సంస్థలకు ఉపశమనం ఇచ్చేందుకు గాను, ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 20 నుంచి వివిధ ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వనున్నారు. నిరంతరం అవసరమయ్యే ఉత్పత్తులు, తయారీ యూనిట్లు తిరిగి పనిచేయడానికి అనుమతించబడతాయి. రోడ్లు, నీటిపారుదల ప్రాజెక్టులు, భవనాలు, అన్ని రకాల పారిశ్రామిక ప్రాజెక్టులు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల నిర్మాణాల కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు అనుమతులిస్తారు. సేవల రంగంలో ఐటీ, ఐటీ సంబంధిత సేవల సంస్థలు 50 శాతం పనిచేసేందుకు అనుమతులివ్వనున్నారు. వ్యవసాయ కార్యకలాపాఐ పూర్తీ స్థాయిలో పనిచేసుకోవచ్చు.

ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తగ్గించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు, ఈ కార్యకలాపాల బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయని కేంద్రం పేర్కొంది. అయితే, ఈ సడలింపు రెడ్ జోన్లు ఉన్న ప్రాంతాల్లో వర్తించదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటితో పాటు చమురు, గ్యాస్ శుద్ధి కర్మాగారాలను కూడా పునఃప్రారంభించేందుకు సడలింపు ఉంది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో ఇటుక బట్టీలు, ఎలక్ట్రీషియన్, ఐటీ మరమ్మతులు, ప్లంబర్లు, మోటార్ మెకానిక్‌లు, వడ్రంగి మొదలైన స్వయం ఉపాధి సేవలకు కూడా సడలింపు ఇవ్వనున్నట్లు సమాచారం. ఐటీ హార్డ్‌వేర్, బొగ్గు, ఖనిజ ఉత్పత్తి, మైనింగ్ సేవలకు కూడా సడలింపు ఉండనుంది. అంతేకాకుండా సరఫరా ప్రక్రియను సులభతరం చేసేందుకు గాను వస్తువులను రవాణా చేసే రైళ్లను, కార్గో విమానాలను ఏప్రిల్ 20 తర్వాత అనుమతులివ్వనున్నారు.

ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌లలో అనుమతులున్న తయారీ, ఇతర పారిశ్రామిక సంస్థల కార్యకలాపాలు ప్రారంభించడానికి అనుమతించబడతాయి. అయితే, ఈ సంస్థలలో పనిచేసే కార్మికులు సాధ్యమైనంత వరకూ ఆయా సంస్థల ప్రాంగణంలో నివశించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాంటి అవకాశం లేని సందర్భాల్లో యజమానులే కార్మికులకు రవాణా ఏర్పాటు చేయవలసి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, కొన్ని పరిశ్రమ వర్గాలు నాలుగవ వంతు సామర్థ్యంతో కూడా కార్యకలాపాలు ప్రారంభించుకునేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

ఇప్పటికే 22 రోజుల నుంచి ఉపాధి కోల్పోయిన వారికి ప్రభుత్వం కల్పించబోయే సడలింపు దేశంలోని ఉపాధిని పునరుద్ధరిస్తుంది. లక్షలాది కార్మికులు ఇప్పటికే సొంత ఊళ్లకు పయనమయ్యారు. ఇంకా అనేకమంది పనిచేసే ప్రాంతాల్లోనే ఉండిపోయారు. పరిశ్రమలలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభించడం ద్వారా వలస కార్మికులకు ఈ ఆపత్కాల సమయంలో జీవనోపాధికి ఆస్కారం ఉంటుంది.

Tags: Industries, Lockdown, Relaxations For Services, Factories, covid-19

Advertisement

Next Story

Most Viewed